వ. ఓ సీమాంధ్రప్రజలారా, మన మిక హైదరాబాదును గూర్చి విచారించి ప్రయోజనము గలదా? మన మందరము తెలుగువారము, ఆంధ్రప్రదేశము మన తెలుగువా రందరిది, యీ రాజధాని మన తెలుగువా రందరిది యని భావించి మోసపోతిమి గదా! |
సీ. రాష్ట్రప్రజల కెల్ల రాజధాని యటంచు భావించు కొనుటయే ప్రజల తప్పు అందరి యూరని యతినమ్మకంబున పెంచి పోషించుటే పెద్దతప్పు ఇన్నాళ్ళు ప్రేమతో నీ భాగ్యనగరమ్ము మన దను భ్రాంతితో మనుట తప్పు ఇచట చేరిన వారి నెల్లర దూషించు మాన్యుల నెఱుగమి మనది తప్పు తే.ఇన్ని తప్పులు చేసిన దెందువలన ఇన్ని నిందలు మోసిన దెందువలన ఇన్ని నాళులు తెలియలే దెందువలన అసలు తెలుగువార లుదారు లందువలన |
సీ. మన యైకమత్యంబు మన్ను మశానంబు మన నోళ్ళలో నేడు మన్ను గొట్టె మన యతి నమ్మక మను బలహీనత మన నోళ్ళలో నేడు మన్ను గొట్టె మన బుధ్ధి కీ యూరు మనదని తోచుట మన నోళ్ళలో నేడు మన్ను గొట్టె మన సంపదలు దెచ్చి ఘనముగా పెంచుట మన నోళ్ళలో నేడు మన్ను గొట్టె తే. ఒకరి నన నేల బుధ్ధి లేకుండ మనము తెలుగు జాతి యంతటికి నుద్దిష్టమైన పట్టణం బని హైదరాబాదు మీద మమత గొని యుంట మన నోళ్ళ మట్టి గొట్టె |
తే. హైదరాబాదు మీ కొక యద్దెకొంప హైదరాబాదుపై మీకు హక్కు లేదు పూని యైదేండ్లలో రాజధాని కట్టు కొనుడు సీమాంధ్రులను మాట కూడ బుట్టె |
కం. తగదట యూటీ చేయుట తగునట యీ యూరిపైన తమ పెత్తన మ ట్లగుచో సీమాంధ్రుల పై పగగొని యగచాట్లు పెట్ట వచ్చును గనుకన్ |
కం. కాలము వ్యత్యస్తంబై చీలికలై రాష్ట్ర మిటుల చెడు చుండగ నిం కేలా చింతించుట యే మేలగు కీడగును కాలమే చేయుగదా |
కం. రేపో మాపో కాలం బా పక్షము నుండి మరలి యరుదెంచునుబో కాపాడును దైవంబని యోపికగా నెదురుచూడు డో జనులారా |
వ. ఓ వీరతెలంగాణా వాదులారా! |
కం. తెలగాణరాష్ట్రపాలన తెలగాణపుదొరల దగుట దివ్యంబుగ మీ వలసిన రీతిని మీదగు కెలనన్ మీ రేల వచ్చు కేరింతలతో |
కం. ఉమ్మడి యూరికి పెత్తన మిమ్మని మీ రిట్టు లడుగు టేమి యుచిత మా యుమ్మడి యగు కాలంబును పొమ్మన నిం డవల మీది ముమ్మాటికిని నౌ |
కం. విను డెల్ల రాత్మగౌరవ మనగా తెలగాణ వారి కది యెట్లగునో చను నటు సీమాంధ్రులకుం జనులకు సామాన్యమగుట సర్వవిధములన్ |
కం. దినదినమును సీమాంధ్రుల పనిగొని నిందించి యిట్లు పరమానందం బును బొందుచుండి వదరుట నొనగూరెడు లాభ మొక్కటి గలదే |
కం. మంచిది మీ రడిగిన వే కొంచెంబును గోత పెట్టకుండగ హితులై పంచెడు వా రిడు చుండగ కించిత్సంశయము పేర కీడెంచదరో |
కం. ఇచ్చెడు వారలు గలిగిన ముచ్చటగా భూమి నెల్ల మోమోటము లే కచ్చముగా మా కిండని హెచ్చిన గరువమున గోర నెంచెదరు గదా! |
కం. ఇక దేనికి మీ వగపులు ప్రకటంబుగ కాలమహిమ వలనన్ రాష్ట్రం బిక చీలుటయే తథ్యం బకటా పగ లుడిగి శాంతులై యుండదగున్ |
2, డిసెంబర్ 2013, సోమవారం
హైదరాబాదు విషయంలో ఉభయపక్షాలకూ విజ్ఞప్తి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గుండెఘోష బ్లాగరు శ్రీకాంతాచారిగారు ఒక సుదీర్ఘవ్యాఖ్య పంపారు. నా టపాకే చిరుమార్పులతో parody అది. ఐతే వారు దానిని రెండుసార్లు పోష్టు చేసినా నేను ఈమధ్యాహ్నమే చూసాను. అప్పటికే వారు తన వ్యాఖ్యను ఒక టపాగా ప్రచురించుకున్నారు హైదరాబాదును గూర్చి విచారించి ప్రయోజనము గలదా? అనే శీర్షికతో. ఆసక్తి గలవారు శ్రీకాంతాచారిగారి సమాధానాన్ని వారి టపాలో చదవండి.
రిప్లయితొలగించండిశ్రీకాంతాచారిగారు యథాప్రకారం, 'కాజెసితిరి', 'పీల్చివేయగ జూ(సితిరి)', 'హైదరాబాదు మీద
మరులు గొని వచ్చి రాంధ్రులు మట్టు బెట్ట', 'మీనాటకములు చాలించుడికన్' వంటి నిందాలాపాలు చేసారు. తెలంగాణావాదుల నిందాలాపాలు ఎవరికీ క్రొత్తవి కావుగదా!
నిన్న 5వ తారీఖున వచ్చిన వ్యాఖ్యల గురించి:
రిప్లయితొలగించండి1. ఒక అజ్ఞాతగారు 'ప్రతిదానికీ ఆంధ్రులమీద పడి ఏడవటమేనా... కష్టపడి పనిచేయటం నేర్చుకోండి' అంటూ వ్యాఖ్య పెట్టారు. కాని ఆ వ్యాఖ్య రెచ్చగొట్టే విధంగానూ, అభ్యంతరకరమైన పదాలతోనూ ఉండటం వలన ప్రచురించటం లేదు.
2. శ్రీకాంతాచారిగారు సమాధానం చెబుతూ, 'అవి నిందలు కావు యధార్థాలు' అనీ, 'మమ్ము దోచుకోవటంలోనే మీమనుగడ' అనీ, 'మీరు తెలంగాణాకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలే అసలు నిందలు' అనీ పునరుద్ఘాటించారు. ఇదంతా పాతపాటే కాబట్టి ప్రచురించటం లేదు.