25, డిసెంబర్ 2013, బుధవారం

వగల ప్రేమలు?


[ ముందుమాట: నిన్న శ్రీగుండువారు వగల ప్రేమలు చాలు అంటూ ఒక ఖండిక ప్రకటించారు. అందులో వారు సీమాంధ్రవాళ్ళు నీలంవారి శతజయంతిని ఘనంగా నిర్వహించి పీవీగారి వర్థంతిని ఏమాత్రం పట్టించుకోకుండా అవమానించారని ఆరోపిస్తూ "ఆ మహాత్మునికి జయంతి యంత ఘనము!యీ మహాత్ముని వర్థంతి యింత వెగటె?" అని అన్నారు.

వారి ఆ టపాకు నా స్పందన పంపితే అందులో బహుశః వారి దృష్టిలో సద్విమర్శాగౌరవానికి నోచుకోకపోవటం వలన కాబోలు ఆ నా స్పందనను ప్రకటించలేదు.  అలా జరగటం సాధారణవిషయమే కాబట్టి, అ స్పందన ప్రతిని అక్షరదోషాల వంటివి దిద్ది, చివరన ఒకటి రెండు వాక్యాలు చేర్చి ఒక టపాగా వేస్తున్నాను ఈ‌ బ్లాగులో.]

బాగుంది.  ఆడిపోసుకోవటం ఆపి, ఒక్క ముక్క ఆలకించండి.

నిజానికి దివంగత మహనీయులైన నీలంవారిని గాని పీవీగారిని గాని ఎవరు కించపరచటమూ హర్షణీయం కాదు.

మాజీ రాష్ట్రపతి నీలంవారి శతజయంతి మీరు అనుకుంటున్నంత ఘనంగా జరగనేలే దన్నది పచ్చినిజం.  ఆ వేడుకేదో అంతంతమాత్రంగానే జరిగినా, పీవీగారి వర్థంతి అంతమాత్రంగా కూడా జరగలేదని మీ అనుమానం కావచ్చును.

పీవీగారిమృతి సందర్భంగా స్వంతపార్టీకి ఎంతో‌ఘనకీర్తి తెచ్చిపెట్టిన ధీవిశాలుడైన పీవీగారికి కాంగ్రెసుపార్టీవారు ఎంత ఘనంగా అంతిమమైన వీడ్కోలు పలికారో తలుచుకుంటే ప్రతితెలుగువాడి హృదయమూ బాధతోనూ కోపంతోనూ ఊగిపోతుంది.  ఘోరావమానంగా జరిపించారు కాంగ్రెసువారు ఆ మహానేతకు వీడ్కోలు.  ఇదంతా సోనియమ్మగారి ఆధ్వర్యంలోనే జరిగింది.  కాదని బుకాయించే అమాయకులుంటారని అనుకోను.  ఆ విధమైన దుష్ప్రవర్తనతో పీవీకి అవమానం జరిపించిన సోనియాను నేడు నెత్తిన పెట్టుకొని దేవతలాగా కొలుస్తూ, ఆమెకు గుడులూ గోపురాలు కడుతూ తెలంగాణావీరజననాయకమ్మన్యులు కూడా పీవీగారి దివ్యస్మృతికి ఎటువంటి శ్రధ్ధాంజలి ఘటిస్తున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి.  అది మాని సాకులు వెదకుతూ దివారాత్రములూ నిత్యం సీమాంధ్రులను తిట్టిపోయటమే పనిగా పెట్టుకోవటం అనేది మంచి పనేనా?  అలోచించుకోండి.

ఒక్క విషయం గ్రహించండి.  తెలుగువారికి ఢిల్లోలో  ఎన్నడు సరైన గౌరవం లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండీ అక్కడ అంతా అరవపెత్తనం.  స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు తెలుగువారి ఆత్మగౌరవం  అనే నినాదంతో కాంగ్రెసువారికి వ్యతిరేకంగా ఉద్యమించటానికి అది కూడా ఒక ప్రధాన కారణం. వీలైనప్పుడల్లా తెలుగువారిని అవమానించటానికి అక్కడ నిత్యం ప్రయోగాలమీద ప్రయోగాలు నడుస్తూ ఉంటాయి. ఈ రోజు చిదంబరమూ ఆ తానులో ముక్కే - మీ కేదో నేడు ఒరగబెడుతున్నాడని కాక విస్తృతమైన పరిధిలో ఆలోచించగలిగితే మీకూ‌ బోధపడుతుంది.

ఇకపోతే తమ ఖండికలో శ్రీగుండువారు యధాప్రకారం తమ ధోరణిలో సీమాంధ్రులపై "స్వార్థపరులయ్య మీరలు స్వార్థపరులు" అనీ, "హృదయాన ఘోర విషము దాచుకొన్నట్టి మీర లధర్మపరులు"అనీ,  "నీది నటనె" అనీ పాత నిందారోపణలనే పునరుద్ఘాటించారు.  

8 కామెంట్‌లు:

 1. PV గారిని కేవలం తెలంగాణాకి చెందిన వ్యక్తిగా చూడడం సంకుచితత్వమే. ఆయనను తెలుగువాళ్ళే కాకుండా మొత్తం భారతీయులందరూ గౌరవిస్తారు, ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప.
  PV ప్రధానిగా, NTR ముఖ్యమంత్రిగా ఉన్న కొద్ది కాలం, తెలుగుజాతికి స్వర్ణయుగం. వాళ్ళిద్దరూ కలిసి, ఒక ఉగాది కార్యక్రమంలో పాల్గొన్నట్లు గుర్తు.
  ఇప్పుడు తెలుగువాళ్ళు దిక్కులేనివాళ్ళయ్యి, పరాయి రాష్ట్రాలవాళ్ళ చేతుల్లో మన భవిష్యత్తు పెట్టి, కొట్టుకుచస్తున్నారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇప్పుడు మన ప్రతాపాల, సంకుంచించుకున్న ప్రత్యేకాత్మాభిమాననినాదాల పుణ్యమా అని ప్రతి తెలుగువాడినీ తెలంగాణావాడు, సీమాంధ్రుడు అని విడదీసి చూసే పరిస్థితి కల్పిస్తున్నారు రాజకీయులు! మనలో మనకే సయోధ్యలేక మరింతగా దేశంలోపలా వెలుపలా కూడా పలచన అవుతున్నాం.

   తొలగించండి
  2. ఒక ప్రముఖుడిని ప్రాంతం ముసుగులో చూడడమే తప్పు అయితే, అదే సిద్దాంతం భాషకు కూడా వర్తిస్తుంది. సంకుచిత్వ ధోరణి భాష వరకూ ఫరవాలేదు కానీ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనడం అంత సమంజసంగా లేదు.

   When I want to own Gandhi, Bhagat Singh, Ambedkar etc. as Indian icons, how can I insist that Patel/Rajaji should be treated as a Gujarati/Tamil?

   తొలగించండి
  3. >సంకుచిత్వ ధోరణి భాష వరకూ ఫరవాలేదు కానీ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనడం అంత సమంజసంగా లేదు.

   నేనలా అనలేదే!

   తొలగించండి
  4. "ప్రతి తెలుగువాడినీ తెలంగాణావాడు, సీమాంధ్రుడు అని విడదీసి చూసే పరిస్థితి కల్పిస్తున్నారు రాజకీయులు"

   With minor changes, the above becomes:

   "ప్రతి భారతీయుడిని తెలుగు వాడు, తమిళుడు అని అని విడదీసి చూసే పరిస్థితి కల్పిస్తున్నారు రాజకీయులు!"

   దొందూ దొందే కాదాండీ?

   తొలగించండి
 2. శ్రీ శ్యామలీయంవారూ! నిన్నటి నా టపాకు మీ స్పందన పంపకుండానే, మీరు పంపితే నేనే ప్రకటించలేదనే నింద నాపై వేయడం మీ వంటి విజ్ఞులకు తగదు. నేను ఆధారం లేకుండా ఎవరినీ నిందింపను. మీడియాలో ఎవరికి ఎంత గౌరవం ఇచ్చారో కనబడలేదా? రాష్ట్రపతిగారు, ముఖ్యమంత్రిగారు, ఇంకా ముఖ్యులెందరో వేంచేసిన సభ...అంత ఘనంగా జరుగలేదనడం హాస్యాస్పదం. వినేవారుంటే ఎన్నైనా చెప్పవచ్చు. పోనీలెండి. మీరు సత్యవాదులు. మేం అసత్యవాదులం. ఇలాగే అనుకుంటూ తృప్తిపడండి. మాకేం నష్టం లేదు. నా టపాకు స్పందించి, ప్రత్యేక టపా ప్రచురించి, నా గౌరవాన్నిపెంచినందుకు కృతజ్ఞుడను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండువారు మన్నించాలి. నేను మీకు పంపిన స్పందన స్పాంలోకి పోయిందేమో చూడండి. శ్రీనీలంవారు కూడా మాజీ రాష్ట్రపతి కదా, వారి పేరున తపాలాశాఖ ఒక స్టాంపు విడుదల చేయలేదు - ఒక ప్రాంతీయ స్థాయి కవరో‌ ఏదో వేసినట్లుంది. అందుకే ఆ మొక్కుబడి సభ ఘనతను మనం చెప్పుకోనవసరం లేదనుకుంటున్నాను. మీ పట్ల నా గౌరవాన్ని గురించి మీకూ తెలుసు కాబట్టి మీరు నొచ్చుకో వద్దు. మీరు అసత్యవాదులని నేను అనటం లేదు. రాజకీయవిషయాల్లో అభిప్రాయ బేధాలు సహజమే కదా. పీవీగారిని సీమాంధ్రులు పట్టించుకోలేదనే ముందు తెలంగాణావారూ ఈ సందర్భంలో పెద్దగా పట్టించుకున్నదీ లేదనే బాధ ఉంది కదా!

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.