13, డిసెంబర్ 2013, శుక్రవారం

సాగతీత?


అదిగో వచ్చెను తెలగాణా బిల్!
వచ్చెనసెంబ్లీ చర్చలకొరకై!
ఒకటో రెండో మూడు రోజులో
సమయం పట్టును చర్చలకొరకై!


ప్రత్యేకంగా యుధ్ధవిమానం
మోసుకు వచ్చెను విభజన బిల్లు
శ్రధ్ధగ చదివిన పిమ్మట చర్చకు
దిగవలె తొందరపడరాదండీ

కానీ, బిల్లుకు ప్రెసిడెంటిచ్చెను
ఆరువారముల సమయమ్మిప్పుడు!!
ఇంత సమయమ్ము నిచ్చుట కేదో
బలమైన కారణమ్ముండవలెనయా!


చర్చకు తగిన సమయం బిచ్చుట
సంప్రదాయమని మరువరాదయా
ఎప్పటిలాగే ఆరువారముల
గడువు నిచ్చిరని గమనించుడయా

అనుమానమ్మెదొ పొడసూపెను మది!
కాలమిచ్చి యిక సాగదీయుటకె
కాదుగదా సీమాంధ్రుల కుట్రల
లాబీయింగుల మహిమమ్మిదియే?


లాబీయింగులు సీమాంధ్రులకే
కలిసొస్తే యీ బిల్లొచ్చేనా
లేనిపోని యారోపణలెందుకు
చీటికిమాటికి చిందులెందుకు

కేంద్రము పూనిన కార్యము చక్కగ
సకాలమ్ములో నెరవేరును గద!
భేషు భేషనును తెలగాణమ్మే!
దీప్తిమంతమై కాంగ్రెసు వెలుగును!!


కేంద్రము చేసిన దుష్కార్యములే
కాంగ్రెసు నిప్పుడు కాటికి పంపును
కాలము చెప్పును కలసి వచ్చునది
తెలంగాణకో సీమాంధ్రముకో

త్వరత్వరగా చర్చల జరిపించియు
కేంద్రముకంపగ యత్నించుటయే
ముందరనున్న మహత్కార్యమ్మిది!
తాత్సారమ్మిక చేయగనేలా


ఎందుకు లెండి హడావుడి పడటం
కేంద్రం‌ కరుణకు గడబిడపడటం
మహత్కార్యమో దుష్కార్యమ్మో
సమయం తీసుకు చర్చించవలె

కుట్రచేయుచో తిప్పికొట్టెదము!
మంచికేయైన కొనియాడెదము!
త్వరగా తేల్చుడు వారములోనే
త్వర త్వర త్వర త్వర త్వర త్వరగా!!


కొత్తగడువులను పెట్టేటందుకు
మీరెవరయ్యా తప్పుగదయ్యా
మీ దూషణలకు చింతించరయా
మీ మెప్పులతో పనిలేదయ్యా

(ఇది శ్రీగుండువారి సాగదీత...కుట్రేనా?  అనే టపాకు స్పందన)


3 కామెంట్‌లు:

  1. గమనిక:

    ఒక్కొక్కసారి కొన్ని టపాలకు క్లుప్తంగా స్పందన తెలియజేయటం సాధ్యపడకపోతే, నా స్పందనను ఒక టపాగా వ్రాయటం, ఆ విషయాన్ని సదరు టపా రచయితకు వ్యాఖ్యరూపంలో తెలియ జేయటం నా అలవాటు. అదే విధంగా నేడు, నేను ఈ టపాను వ్రాసిన వెంటనే శ్రీగుండువారి టపాక్రింద నా స్పందనకు లింకును కూదా ఇస్తూ ఆ విషయం తెలియబరచాను.

    కాని శ్రీగుండువారు తన టపా క్రింద నా వ్యాఖ్య ప్రకటించకుండా (ఈ రోజు 7:32PM సమయంలో)ఇలా ఆగ్రహం వెలిబుచ్చారు (తన టపా క్రింద వ్యాఖ్యగా).
    ఇది ఎవరికి చెందుతుందో వారికి! ఒకరి బ్లాగులోని టపాను, బ్లాగు యజమాని అనుమతి లేకుండా తస్కరించి, తన బ్లాగులో వాడుకొనేవారినేమనాలి? కుళ్ళుబోతులనాలి! కుసంస్కారులనాలి! బ్లాగును పేర్కొననీ, కాని బ్లాగులోని టపానే తస్కరిస్తే, తస్కరులే అనవలసి వుంటుంది. వారు శాంతి కాముకులా? టపాలోని అంశాన్ని వెక్కిరించేవారు, సంస్కారులా? నేను ప్రత్యక్షంగా వారిని ఏమీ అనలేదే? గుమ్మడికాయల దొంగ అంటే, భుజాలు తడుముకోవలసిన అవసరమేముంది? నేను మాకు అన్యాయం చేసినవారిని అంటున్నాను. వారిననలేదే? అంతమాత్రంచేత సంస్కారం వీడాలా? నేను అనుసరించే ఛందం అనుకరించి కుతర్కం బోధిస్తే వినడానికి ఎవరూ ఇక్కడ కాచుకొని లేరు! వారి హద్దుల్లో వారుంటేనే మంచిది!


    వారి అపోహను తొలగించవలసిన బాధ్యతతో వారి వ్యాఖ్యకు కొద్ది నిముషాల క్రిందట ఈ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వటం జరిగింది.
    గుండువారూ, శాంతించండి. మీ టపాలో విషయానికి ప్రతిపద్యానికీ జవాబు వ్రాయటంలో భాగంగానే మీ పద్యాలన్నీ ఉదహరిస్తూ‌ మరీ వ్రాయవలసి వస్తున్నది కాని అంత మాత్రానికి మీరు ఆగ్రహించి నిందలకు దిగటం సబబు కాదు. విమర్శలూ ప్రతివిమర్శలూ హుందాగా విషయసంబంధిగానే ఉండనివ్వండి. ఏది తర్క ఏది కుతర్కం అన్నది చూసే వారి దృక్పధాన్ని బట్టి మారవచ్చును. మీ‌ టపాను ఉటంకించటం మీకు సమ్మతం కాకపోతే నా కేమీ అభ్యంతరం లేదు కాని తస్కరణలాంటి మాటలు ఎందుకు వాడుతున్నారు? మీ‌ ఫలాని టపాకు నా స్పందన అన్నది స్పష్టంగానే పేర్కొంటున్నాను కదా నా స్పందనతో‌ పాటే. సాహిత్యవాసనగల మీకు సాహిత్యలోకంలో‌ ఖండనమండనలు సాధారణమే కాని అనిదంపూర్వాలు కావని తెలియకపోదని విశ్వసిస్తున్నాను. భుజాలుతడుముకోవటం వంటి మాటలు దేనికి? మీరు నన్ను వేలు చూపి అనలేదు - అలాగే నేనూ తమరికి వేలు చూపి అనలేదు. విషయం మీదే ఖండనం. అంతవరకే. మీ‌ పట్ల వ్యక్తిగతంగా నా కేమీ విరోధభావం లేదే? ఏదైనా ఛందస్సుమీద మీకు గాని మరెవరికి గాని కాపీరైటు వంటిది ఉందని అనుకోను. చదివే వారిలో, ఛందస్సుల పట్ల అవగాహన ఉన్నవారికి, కవిత్వం చదివే అలవాటు ఉన్నవారికీ, ఛందస్సులను నేను వాడుక చేస్తున్న ధోరణిని బట్టి నేను కృతకమైన శైలిలో వ్రాస్తున్నదీ, ధారాశుధ్ధిగా వ్రాస్తున్నదీ సులభంగానే తెలుస్తుంది. ఈ విషయం మీద హెచ్చుగా చెప్పదలచుకో లేదు. నేను నా టపా క్రింద "ఇది శ్రీగుండువారి సాగదీత...కుట్రేనా? అనే టపాకు స్పందన" అని మీ‌టపాకు లింకుతో సహా స్పష్టంగానే ఇచ్చాను - బహుశః మీరు గమనించక పోవటం వలన ఆగ్రహోధగ్ధులయ్యారని నా అనుమానం. ఇతఃపూర్వం నేను మరొక టపాలో కూడా ఇలాగే మీ‌ ఫలాని టపాకు నా స్పందన అని సంబంధిత టపాకు లింకుతో సహా వివరణ ఇచ్చాను కదా? మీ టపాకయ్యేది మరొకరి టపాకయ్యేది స్పందన తెలియజేయటానికి అనుమతి వంటిది అవసరం అని అనుకోను. మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఫార్మాట్‌లో వ్రాయను లెండి - కాని అప్పుడు మీకు ఆ కారణంగా ఆగ్రహం రాకూడదు మరి. ఇకపోతే ఎవరి హద్దుల్లో వారుండాలని అన్నది భేషైన మాట. అలాగే కానివ్వండి. విమర్శ చేయటం అనేది హద్దు మీరటం కాదని నా విశ్వాసం - అలాకాని పక్షంలో సాహిత్యంలో విమర్శ అనేదే ఉండరాదని మీరు తీర్మానించటం అవుతుంది.

    అన్నట్లు, ఈ టపాకు నా వ్యాఖ్యలో మీటపాకు స్పందనగా ఫలాని టపా వ్రాసాను గమనించగలరని విన్నవించాను. అది మీరు ప్రచురించకుండా, ఇలా వ్రాసి అపోహకు తావివ్వటం విచార్యం.

    రిప్లయితొలగించండి
  2. @ శ్యామలీయం : హద్దులు తెలుసుకోకుండా దూషించే వారి బ్లాగుల్లో మీరు వేలు పెట్టకుండా వుంటే ఉత్తమం... విమర్శని స్వీకరించే సంస్కారం లేని వారికి ఇంత విపులంగా వివరణ ఇవ్వ వలసిన అవసరం లేదని నా అభిప్రాయం...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆకాశరామన్నగారూ,

      శ్రీగుండువారు ఆ మధ్య ఒక ఖండికలో 'నోరుమూయుడు' అని కూడా అన్నారు. ఇటువంటి పదప్రయోగాలు చేయటం వారి ఆవేశపూరిత కవితాధోరణిలో భాగం. అంతమాత్రం చేత వారి సంస్కారం గురించి వ్యాఖ్యానించటం నాకు ఇష్టంలేదు. వారు నా సంస్కారాన్ని ప్రశ్నించారు కాని అది వారి విజ్ఞతకే వదలి వేద్దాం.

      వారన్న తస్కరణలాంటి మాటలు అనవసరం అని నా ఉద్దేశం. ఒక కృతిని సమగ్రంగా ఖండిస్తూ వ్రాసేటప్పుడు మూలాన్ని ఉటంకించకుండా ఎలా వీలవుతుంది చెప్పండి? అలా మూలాన్ని ప్రదర్శించటం తస్కరణ అంటే కాళిదాసుకు వ్యాఖ్యానాలు వ్రాసిన మల్లినాధసూరీ, వ్యాసహృదయావిష్కరణం చేసిన శ్రీశంకరులూ కూడా వీరి దృష్టిలో ఆక్షేపణీయులే అవుతారన్నమాట. శాంతం పాపమ్‌.

      శ్రీగుండు వారు నేను అనుమానించినట్లే నా వ్యాఖ్యలను ప్రకటించకుండా, తమ నిరసనను మాత్రం ప్రకటించారు! తాజాగా ఇక దుష్టుల ఆటలు సాగవు! అంటూ మరొక టపా వేసారు కాని ఇప్పటికే తమ దగ్గర ఉన్న నా వ్యాఖ్యలను మాత్రం ప్రకటించలేదు. చిత్రం.

      పదే పదే వారి నిందాలాపాలకు స్పందించటం అనవసరం అనుకుంటున్నాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.