25, డిసెంబర్ 2013, బుధవారం

విద్యుత్తు వినియోగమూ - పొదుపూ.

ఈ రోజున  ఇంట్లో రోజుకొక యూనిట్ విద్యుత్ పొదుపు చేయటం ఎలా?   అనే టపా చూసాను విజ్ఞాన శాస్త్రము  బ్లాగులో.  మంచి విషయం స్పృశించారు.  మంచి పొదుపు చిట్కాలు చెప్పారు.

మన వాడుతున్న విద్యుత్తును ఒక్కో ఉపకరణమూ ఏ విధంగా వినియోగిస్తోందో తెలుసుకోవటమూ ఈ విషయంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

ఒక విద్యుదుపకరణం (electrical equipment) రేటింగ్ W వాట్లు అనుకుంటే,  సగటున దానిని మనం రోజుకు H గంటలు వాడుతున్నాం అనుకుంటే, ఒక సంవత్సర కాలంలో అది ఖర్చుచేసే విద్యుత్తు విలువ W x H x 365.25 వాట్లు అవుతుంది.  ఒక వేయి వాట్ల వాడకం అనేది ఒక యూనిట్‌గా లెక్కిస్తారు మీటరు రీడింగులో.

కాబట్టి సంవత్సరంలో మనం ఈ విద్యుదుపకరణం ద్వారా కర్చుచేసే యూనిట్లు W x H x 0.36525

మనకు నెలలో కాల్చే యీనిట్ల విలువ తెలుసుకోవటం ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది కదా.  ఈ విలువ  W x W x 0.36525 / 12 = W x H x .030437

ఈ గణితం పైకి పెద్దగా ఆసక్తి దాయకంగా కనిపించదు.  కాని దీని నుండి సులభంగా మనం గుర్తుపెట్టుకోవటానికి మార్గం కనుక్కోవచ్చును చూడండి.

పైన ఇచ్చిన గణితంలోని .030437 అనే విలువను  33 చేత గుణిస్తే 1.004421 వస్తుంది.  దశాంశ భాగం చిల్లర చాలా చిన్నది కాబట్టి దాదాపుగా ఈ విలువని   1 అనుకోవచ్చును.

అంటే?

W వాట్ల ఉపకరణాన్ని రోజుకు 33 గంటలు చొప్పున వాడితే (రోజుకు అన్ని గంటలా అని అనకండి, ప్రస్తుతానికి) ఒక నెలలో మనం కాల్చే విద్యుత్తు W యూనిట్లు అన్నమాట.

ఈ బండగుర్తు సహాయంతో సులభంగా మన ఇంట్లోని ప్రతి విద్యుదుపకరణం మీద నెలకి ఎన్ని యూనిట్ల విద్యుత్తును కర్చు చేస్తున్నదీ లెక్క వేయ వచ్చును.

ఉదాహరణకు ఒక సీలింగ్ ఫాన్ ఉన్నది.  దాని వాటేజ్ 72W అని తెలుసు అనుకుందాం.  ఆ ఫానును రోజుకు  8 గంటల చొప్పున వాడితే నెలకు మనం 72 x 8 / 33 = 17.45 యూనిట్లు కాల్చుతున్నాం అన్నమాట.(మనం ఖచ్చితంగా లెక్కిస్తే 72 x 8 x 365.25/12000 = 17.53  యూనిట్లు వస్తుంది)

మరొక ఉదాహరణ కోసం 2000 W రేటింగ్ ఉన్న గీజర్ వాడకం చూదాం.   ఆ గీజర్ని ప్రతిరోజూ ఒక గంట సేపు వాడితె మనం  ఒక నెలలో 2000 x 1 / 33 = 60.61  యూనిట్లు కర్చు చేస్తున్నామన్న మాట. (మనం ఖచ్చితంగా లెక్కిస్తే 2000 x 1 x 365.25 = 60.88 యూనిట్లు వస్తుంది)

పై ఉదాహరణలో వచ్చిన తేడా అలా 1.004421ని  1గా తీసుకోవటం వలన వచ్చిన చిన్న వ్యత్యాసం.  స్వల్పాంతరత్యశ్చ బహూపయోగాః. తత్యజ్యతే తన్నతు దూషణాయ అని ఒక సూక్తి. అంటే చిన్న తేడా వలన హెచ్చు ఉపయోగం ఉంటే అలా గ్రహించటం మంచిదే అని అర్థం.

మరొక విషయం.  ఒక 100W ఉపకరణం రోజుకు 10గంటల చొప్పున వాడితే ఒక కాలెండరు నెలలో ఎన్ని రోజులో అన్ని యూనిట్ల విద్యుత్తు కాల్చుతుంది.  ఆ నెలలో రోజులు 31 ఐతే 31 యూనిట్లు, రోజులు 30 ఐతె 30 యూనిట్లు, రోజులు 28 ఐతే 28 యీనిట్లు. ఎందుకంటే 100W ను పదిగంటలు కర్చుచేస్తే ఒక యూనిట్ కాబట్టి.  కాని మనం పైన లెక్కించిన విధానం ప్రకారం  100 x 10 x 365.25 / 12000 = 30.4375 యూనిట్లు అవుతుంది. ఇది సంవత్సరంలో సగటు నెల విలువ అని గ్రహించ గోరుతాను.  మన చేసే ఉజ్జాయింపు లెక్కప్రకారం ఐతే, 100 * 10 / 33 = 30.3030 యూనిట్లు వస్తుంది.   పెద్దగా చెప్పుకోదగ్గ తేడా ఏమీ లేదు.

ఈ క్రింద ఇచ్చిన పట్టిక గుర్తుపెట్టుకోవటానికి సులభంగా ఉంటుంది.  (ఉపకరణం వాటేజ్ W అనుకుంటే..ఉజ్జాయింపుగా విద్యుత్తు ఖర్చు)

రోజుకు వాడకం గంటల్లో నెలకు కరిగే యూనిట్లు ఏడాదికి కరిగే యూనిట్లు
 1:00 W/33 3W/8
 2:45 W/12 W
 5:30 W/6 2W
 8:15 W/4 3W
11:00 W/3 4W
13:45 5W/12 5W
16:30 W/2 6W
19:15 7W/12 7W
22:00 2W/3 8W
24:45 3W/4 9W



2 కామెంట్‌లు:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.