17, మే 2012, గురువారం

కోరి కోరి వచ్చితినా కువలయమునకు

కోరి కోరి వచ్చితినా కువలయమునకు నిన్ను
చేరి యుండి యుండి విసివి చెడిపోయితినా

అచ్చట లేని వేమి నాకు అందిచితి వయ్య
ముచ్చటలు మురిపాల మోహ మేల నాకు
ఇచ్చకాలు మాని యింక యెప్పటివలెనే
వచ్చి తొల్లింట నుండ వచ్చు నన గదయ్య

నిను గన రాని చోట నెటు లుందు నయ్య
మనుజలోకవిలాసాల మాట యేల నాకు
కనుగొని తహతహను కాస్త కనికరించ వయ్య
వెనుకటి వలె నుండుమని పిలిపించ వయ్య

మాయ కళేబరాల మసలు టెందు కయ్య
ఆ యముని తోడ తరచుగా అల్లరేల నాకు
న్యాయ మెంచి మునుపటి వలె నన్ను గారవించి
హాయిగ నీ కడ నుండగ నాన తీయవయ్య
 
ఇప్పటి కైనను మాయను తప్పించుము రామ
ఒప్పని యీ దేహభ్రాంతి తప్పు నయ్య నాకు
చప్పున నిను కలసి మెరసి చక్కగ నీతోడ

నెప్పటి వలె హాయిగా నెగద నీయ వయ్య

2 వ్యాఖ్యలు:

 1. శ్యామల రావు గారు,

  నమస్కారం.మీ బ్లాగు చూసాను.చాలా బాగున్నది.

  మీవంటి తెలుగును ప్రేమించే పెద్దలు ఉన్నందునే మన నేల మీద తెలుగు ఇంకా బతికి ఉన్నది.

  మీ స్పందన వ్రాసినందుకు ధన్యవాదాలు.

  పాలపర్తి ఇంద్రాణి.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.