నీవింత ఘనుడవని రామయ్యా నేనెంత పొగడుదును రామయ్యా
భావించి నామనసు రామయ్యా పరవశమాయెనో రామయ్యా
సుగుణాలవాలుడవు రామయ్యా శుభనీల గాత్రుడవు రామయ్యా
జగదేక వీరుడవు రామయ్యా సర్వసమర్ధుడవు రామయ్యా
అంబుజనేత్రుడవు రామయ్యా అమృతహృదయుడవు రామయ్యా
కంబుసుగ్రీవుడవు రామయ్యా కమలాయతాక్షుడవు రామయ్యా
పంక్తికంథరు జంపి రామయ్యా పట్టంబు గట్టుకొని రామయ్యా
పంక్తిరథుని కొడుక రామయ్యా బహుకీర్తి గాంచితివి రామయ్యా
త్రైలోక్యనాథుడవు రామయ్యా దేవాధిదేవుడవు రామయ్యా
ఫాలాక్షవినుతుడవు రామయ్యా లీలావినోదుడవు రామయ్యా
సీతాసహితుడవై రామయ్యా శోభిల్లుచుండెదవు రామయ్యా
ప్రీతిగ నామదిని రామయ్యా వెలుగొందు చుండెదవు రామయ్యా
మాకాప్త బంధుడవు రామయ్యా మమ్మేలు దేవుడవు రామయ్యా
లోకాభిరాముడవు రామయ్యా నీకు మ్రొక్కెదమయ్య రామయ్యా
నిను సేవింతునయా రామయ్యా నను కరుణించుమయా రామయ్యా
ఘనుడవు వెన్నుడవు రామయ్యా ఇలకులతిలకుడవు రామయ్యా
భక్తి చూపెడి వారి రామయ్యా వదలక బ్రొచెదవు రామయ్యా
ముక్తి నొసంగెదవు రామయ్యా భూరికృపాళుడవు రామయ్యా