28, నవంబర్ 2025, శుక్రవారం

ఆనందము


హరియే యానందకరుం డగుట చేతనే
హరియే యానందరూపు డగుట చేతనే

హరే రామ యనుట లోన నానంద మున్నది
హరే కృష్ణ యనుట లోన నానంద మున్నది
హరి నామము పలుకుటలో నానంద మున్నది
హరిని తలచు కొనుట లోన నానంద మున్నది

హరి కీర్తన పాడుటలో నానంద మున్నది
హరి పూజలు చేయుటలో నానంద మున్నది
హరికి సేవ చేయుటలో నానంద మున్నది
హరి తత్త్వము చాటుటలో నానంద మున్నది

హరి కథలను వినుటలోన నానంద మున్నది
హరిదాసుల కలయుటలో నానంద మున్నది
హరికి భక్తు డగుట లోన నానంద మున్నది
హరి కన్యము నెఱుగ కున్న నానంద మున్నది


16, నవంబర్ 2025, ఆదివారం

తామస మిది నీకెందుకు

తామస మిది నీకెందుకు దశరథతనయా నా
కోమలికై నేనేడ్చిన కోమలహృదయా

నీకోమలి దూరమైన నీకేడుపు రాగా
నాకోమలి దూరమైన నాకేడుపు రాదా
ఏకాంతునకైన సుదతి యెంతయు ప్రియురాలే
నీకు నాకు భేదమేమి నిజముగా నిచ్చట

లోకములో మనకిటుల శోక మొక్కటైన 
నీకాంతను తిరిగిపొంద నీకు చెల్లెను కాని
నాకాంతను తిరిగిపొంద నాకు చెల్లదు కదా
నీకు నాకు భేదమిదే నిజముగా నిచ్చట 

తిరిగి రాదు కదా


ఏమని విలపించినను రామచంద్రుడా
ఆమె తిరిగి రాదు కదా రామచంద్రుడా

ఆమె బాధలను చూచుచు రామచంద్రుడా
నామనసున కష్టపడితి రామచంద్రుడా
ఆమె బాధలకు విముక్తి రామచంద్రుడా
ప్రేమ మీర కోరితి నిను రామచంద్రుడా

ఆమె దూరమాయె ననుచు రామచంద్రుడా
ఏమో యిపు డేడ్చుచుంటి రామచంద్రుడా
ఈ మనోవేదన కన రామచంద్రుడా
ఏమి తెరపి లేదాయెను రామచంద్రుడా

ఆమె సుమంగళిగ జనగ రామచంద్రుడా
వేమరు వేడినది కదా రామచంద్రుడా
ఆమె కోరికయె తీరె రామచంద్రుడా
ఆమె ప్రశాంతముగ జనె రామచంద్రుడా

కోమలి శారదకు లోటు రామచంద్రుడా
ఏమి వచ్చినది స్వామి రామచంద్రుడా
ఆమెలేని జీవితమై రామచంద్రుడా
నా మనసే కృంగిపోయె రామచంద్రుడా

ఏమిటింత యధీరుడను రామచంద్రుడా
ఏమాయెను నాతెలివిడి రామచంద్రుడా
ఈమాయామయజగమున రామచంద్రుడా
నీమహిమయె సత్యమయ్య రామచంద్రుడా

రామచంద్రుడా సీతారామచంద్రుడా
నామనసున శాంతి నింపి రామచంద్రుడా
ప్రేమతోడ నన్నేలుము రామచంద్రుడా
ఓమహాత్మ దండమయ్య రామచంద్రుడా


15, నవంబర్ 2025, శనివారం

హరిని రాముని

ఆరాధించెదను నేను హరిని రాముని 

వేరొక్కని గొలుచునంత వెర్రిని కాను


పరవశించి పొగడెదను హరిని రాముని

నిరుపమాన కీర్తి గల హరిని రాముని

వరములిచ్చు దేవుడగు హరిని రాముని

కరుణగల స్వామి యగు హరిని రాముని


నరాకృతిని తోచుచున్న హరిని రాముని

సురవైరుల పీచమడచు హరిని రాముని 

ధరణిజతో కలిసియున్న హరిని రాముని

పరమపురుషుడైన మన హరిని రాముని


తిరముగా నమ్మి నేను హరిని రాముని

పరమపదము నొసంగెడు హరిని రాముని

పరమపదమె వేడెదను హరిని రాముని

మరలమరల వేడెదను హరిని రాముని



ఫలవిచారణ

ఫలవిచారణ బాగుగ చేయని పని దండుగ యని తెలియుడయా
తెలిసి తెలిసి సత్ఫలముల నొసగు పనులనే చేయుడు జనులారా

వెన్నుని పొగడక వేరెవ్వరినో యెన్ని నుతించిన ఫలమేమి
వెన్నుని కరుణకు నోచక నితరుల మన్నన పొందిన ఫలమేమి
వెన్నుని గాంచగ నొల్లక నితరుల కన్నుల జూచిన ఫలమేమి
వెన్నుని నామము పలుకక నాలుక యెన్ని నుడివినను ఫలమేమి

వెన్నుని దాసుల గొలువక నితరుల పన్నుగ గొలిచిన ఫలమేమి
వెన్నుని భక్తుల కీయక నితరుల కెన్ని యొసగినను ఫలమేమి
వెన్నుని తత్త్వము చింతన చేయక నెన్నో తడవిన ఫలమేమి
వెన్నుని చేరెడు చింతన గాకను వెర్రి చింతనల ఫలమేమి

తిన్నగ రాముని వెన్నుడటంచును తెలుపని విద్యల ఫలమేమి

ఉన్నన్నాళ్ళును రాముని భటుడై యుండక బ్రతికిన ఫలమేమి

వెన్నుని కాదని యితరుల గొలుచుచు నున్న బ్రతుకునకు ఫలమేమి

వెన్నుని మోక్షం బొక్కటి యడుగక నెన్నో వేడిన ఫలమేమి


14, నవంబర్ 2025, శుక్రవారం

కాముని స్నేహము

కాముని స్నేహము మరగిన జీవుడు
    రాముని మరచును దేవా
రాముని సంగతి మరచిన జీవుడు
    భూమికి బరువగు దేవా

భూమికి బరువై బ్రతుకుట కన్నను
    పోల్చగ హీనత కలదే
వేమరు పుట్టియు వేమరు చచ్చియు
    కాముని స్నేహము విడడే
కాముని స్నేహము విడిచెడు దాకను
    రాముడు స్మరణకు రాడే
రాముడు స్మరణకు వచ్చెడు దాకను
    యేమియు లాభము లేదే

కాముడు తన చేజిక్కిన వానిని
    యేమిటికని పొమ్మనును
యేమో కాలము గడువగ గడువగ
    కాముని స్నేహము వెగటై
రాముని నామం బింపుగ వినబడి
    రాముడు ప్రియుడని తోచును
రాముడు ప్రియుడను జీవుని గ్రక్కున
    కాముడు విడచుట తథ్యము 


హరేరామ యను

హరేరామ యను వారికి కలుగును సరాసరి మోక్షం బాబూ

పరాకు పడితే కల్లదైవముల పాలైతే కష్టం 


కలియుగ మందున కొల్లలు కొల్లలు కల్లగురువులు నీచుట్టూ

కలికమునకును నిజమే లేని కల్లబొల్లి దుర్బోధలతో

నిలువున ముంచే మాయవిద్యలతో నిన్నాకర్షించుట తథ్యం 

ఉలకక పలుకక రామరామ యని ఉపేక్షీంచుటే మార్గం


వెలిసేరయ్యా ఊరూరా బహువిచిత్రమైన దేవుళ్ళు 

కలవని మహిమలు కల్లగురువులు ఘనముగ బాకాలూదేరు

కలుగును సిరులని కలుగు మోక్షమని కల్ల ఋజువులే చూపేరు

తలయూచక శ్రీరామరామ యని నిలువరించుటే మార్గం 


శివుడిచ్చిన శ్రీరామనామమును చేయుట కన్నను మేలేది

భవతారకఘనమంత్రము కన్నను పవిత్రమైనది వేరేది

వివేకవంతుడు రామనామమును విడిచిపెట్టుటను మాటేది

పవమానాత్మజ రామదాసుల బాటకంటెను దారేది


రామరామ

రామరామ సీతారామ 
రామరామ రాజారామ

రామరామ యినకులాబ్ధిసోమ మంగళనామ
రామరామ భూమిసుతాకామ మంగళనామ 
రామరామ లోకాభిరామ మంగళనామ
రామరామ మునిగణైకకామ మంగళనామ

రామరామ సమరాంగణభీమ మంగళనామ 
రామరామ సర్వవినుతనామ మంగళనామ
రామరామ హరిపరంధామ మంగళనామ
రామరామ భవతారకనామ మంగళనామ


5, నవంబర్ 2025, బుధవారం

ఎంత విచారించినా

ఎంత విచారించినా యింతి తిరిగివచ్చునా

ఎంత ప్రయత్నించినా యింతి మరపువచ్చునా


నేలపైన నన్ను విడచి నింగి కెగసె శారద

కాలగర్భమున కలిసె గాఢానుబంధము

కాలువలుగ నేడ్చినా కనికరించునా విధి

జాలి లేదు కద దానికి సాకేతరామా


మున్నే చనవలయునని ముదిత కోరుకొన్నది

ఎన్నగ నది సహజమే యీగేహినులకును

అన్నాతిని కోలుపడితి నన్నవిచారంబున

నున్న నాకు మనశ్శాంతి నొసగుమా రామా


యింతి దూరమైనదా


ఎంత తెలిసియున్న గాని యింతి దూరమైనదా

యింతిం తనరాదు బాధ యేమందువు రామ


పదుగురును బహుస్వాంతనవచనంబుల పలుకగా

అదుముకొనినకొలది దుఃఖ మతిశయించు చుండును


పదుగురిలో మసలుచుండి బాధమరిచి నటులుగా

పదేపదే నటియించుట వలనుపడక యుండును


తనవారై యెందరున్న  తరుణి దూరమైన బాధ

మనసు నేర్చుచుండ తనకు మనక తప్పకుండును



కోరిన కోరిక

కోరిన కోరిక తీరెను సుదతికి 

గౌరీలోకము చేరెను శారద


శోధన చాలించుమనుచు వేడగ

బాధలు తీరెను పడతికి నేటికి

గాథగ మిగులగ కమలలోచన య

నాథుడ నైతిని నను గనరా


చింతించెదనో శ్రీపతి యిక నా

యింతి లేదనుచు హృదయావేదన

యింతింతన రానిదియై యెగయగ

సంతోషింతునొ సతి తరించెనని


ధీరత చెడి బహుదీనుడ నైతిని

శ్రీరామా నాచింతను దీర్చర

కారణకారణ కరుణించర సం

సారమహార్ణవతారణకారణ



3, నవంబర్ 2025, సోమవారం

తప్పులెన్నో

తప్పులెన్నో జరుగునయా దశరథ రామా మే
మొప్పులకుప్పలము కాకుండుట వలన

ఆశలతో సతమతం బగు టొక తప్పు దు
రాశలకు లొంగిపోవు టతిపెద్ద తప్పు
లేశమును సద్బుద్ధియె లేని మా బ్రతుకిది
కాశిలో చచ్చినా నరకమును పొందు బ్రతుకు

వరుసపెట్టి లెక్కించ పనిలేదు కనుగొన
హరి మేము పుట్టుటయే అసలైన తప్పు 
మరిమరి యీ తప్పుల మా కంటగట్టక
పరమపురుష నీవద్ద పడియుండనిమ్ము


రామ రామ

రామ రామ రామ సీతారామ రామ రామ శ్రీ
రామ రామ రామ రాజారామ రామ రామ

రామ సకలసుగుణధామ రామ సార్వభౌమ శ్రీ
రామ సంసారార్తిశమననామ పరంధామ

రామ ఆప్తకామ యోగిరాజగణసుపూజ్య శ్రీ
రామ కామవైరివినుతనామ పరంధామ

రామ సురవిరోధిగణవిరామ సమరభీమ శ్రీ 
రామ సూర్యవంశజలధిసోమ పరంధామ


1, నవంబర్ 2025, శనివారం

రామరామ శ్రీరామరామ యని

రామరామ శ్రీరామరామ యని
    రామనామమే పలుకుమురా
రామనామమును పలుకువారితో
    ప్రాణస్నేహము నెఱుపుమురా

రామనామసంకీర్తన మధురిమ
    కేమియు సాటిగ నిలువదురా
రామనామసంకీర్తన చేసిన
    క్షేమము ధైర్యము కలుగునురా

రామనాముమును పాడెడు వారికి
    స్వామి హనుమయే తోడగురా
ఆమారుతియే తోడై యుండగ
    నన్నిట నీదే విజయమురా

నీమముగా శ్రీరామనామమే
    నిత్యము పలుకుచు నుండుమురా
రాముని కృప సిధ్ధించునురా
    రాముడు నీతో పలుకునురా

రామనామమున సర్వజనులకు
    కామితఫలములు కలుగునురా
ప్రేమగ రామా రామా యంటే
    రాముడు నీవాడే యగురా

రామనామమున జేసి మోక్షమే
    భూమిని జనులకు గలుగునురా
రామనాముమును గాక నన్యముల
    నేమేమో యిక పలుకకురా