రామ రామ భవతారకనామా రారా వేగమె రక్షింప
రామ రామ నీ నామమె దప్ప రాదన్యము హరి నానోట
పరమశివుడు నీనామధ్యానము వదలకుండునని వింటినిరా
నిరంతరంబుగ నాంజనేయుడును నీనామమె జపియించునట
ధరాసుతావర దశరథనందన తరచుగ నీశుభనామమునే
నరమాత్రుడ నాశక్తికొలదిగ నడిపింతునురా నానోట
హరి సంసారము దాటునుపాయం బరయగ నీనామం బొకటే
ధరాతలంబున నరులకు గలదని నమ్మకముగ నే వింటినిరా
పరాత్పరా నీనామామృతమును పానముజేయుచు నుంటినిరా
నిరాకరించక సాయుజ్యంబను వరమొక్కటికి హరి నాకీరా
నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు దైవమవు
నీవే నాకిల గలిగిన చుట్టము నీవే కూర్చెడు మిత్రుడవు
నీవే సర్వము నీవే లోకము నీవే దిక్కని నమ్మితిని
నీవే తప్ప నితఃపరమెఱుగను నిక్కము రక్షింపగ రారా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.