10, అక్టోబర్ 2011, సోమవారం

ధ్యానం అనే మందు నూరటం

నిన్ను ధ్యానిస్తున్నాననుకొంటూ చాలా  పొరబడ్డాను సుమా
నిన్ను ధ్యానవిషయంగా  గ్రహించలేక పోతున్నాను కదా నేను
తెలియని విషయంపై తిప్పలు పడటం ధ్యానం కానే కాదుగదా
ఎలా యీ ధ్యానం చేయాలో యెంతకీ సరిగ్గా తెలియదాయెను

పుస్తకాల్లో నియమాలూ వ్యాఖ్యానాలూ పుష్కలంగా ఉన్నాయి
ధ్యానం గురించి అవి చెప్పేదంతా నాకు డొంకతిరుగుడుగా ఉంది
గురుపీఠాలెక్కిన వాళ్ళంతా గోలగోలగా చాలా చెబుతున్నారు
ధ్యానం గురించి  వారు వెప్పేది అంతా నాకు డొల్లడొల్లగానే ఉంది

నీకొక రూపం లేదే నిన్నెలా నేను ధ్యానం చేయాలో తెలియట్లేదు
నీకొక నామం లేదే నిన్నెలా నేను ధ్యానం చేయాలో తెలియట్లేదు
నీకొక గుణమూ లేదే నిన్నెలా నేను ధ్యానం చేయాలో తెలియట్లేదు
నీకొక చోటని లేదే  నిన్నెలా నేను ధ్యానం చేయాలో తెలియట్లేదు

స్థలకాలగుణనామరూపవికారాలు లేని నిన్నెలా ధ్యానం చేయాలి
కనురెప్పులు మూసుకున్నంతనే కనుమరుగవుతుందా యీ లోకం
మనసు కందని నిన్ను ధ్యానం చేస్తున్నానను కుంటే సరిపోతుందా
అటువంటి దొంగధ్యానం నీకు తృప్తి నిస్తుందా నాకు తృప్తి నిస్తుందా

నిజం నేనొప్పుకుంటున్నానని నువ్వు సంతోషపడితే సరిపోతుందా
నిజమైన ధ్యానం నాచేత నువ్వు చేయించుకొనేదేమన్నా అసలుందా
నాకెంత యిష్టమైనా నాకు చేతగాని యీ ధ్యానం నేనెలా చేయగలను
కాస్తంత నీ సహాయం గనక ఉంటే కావలసినంతగా చేయగలను గాని

లోకరుగ్మతలన్నింటికీ యీ ధ్యానం నిశ్వయంగా మంచి మందైతే
నీకు తెలిసిన ఆ మందు నూరటం నాక్కూడా కాస్త నేర్పించ కూడదా
దాని పుణ్యమా అని నేను లోకానికే దూరమై పోతానంటావా నువ్వు
అదే నాకు చాలనీ  అసలందుకే నా ధ్యానమనీ నే మొత్తుకుంటున్నా

2 కామెంట్‌లు:

  1. 'నిజమైన ధ్యానం నాచేత నువ్వు చేయించుకొనేదేమన్నా అసలుందా' --
    చాలా మంచి ప్రశ్న , మొత్తం కవితని అక్కడి దాకా తీసుకువచ్చి అక్కడ ఈ ప్రశ్న వేయడం అమోఘం .

    రిప్లయితొలగించండి
  2. చేసే ప్రతి పని నూటికి నూరు శాతం చేయటమే కదా ధ్యానమంటే!ఆనందిస్తూ,ప్రేమిస్తూ పనిలో రమించ టమే కదా ధ్యానమంటే !మీ ఆవేదన ,అన్వేషణా దృక్పధం ,సత్యం కోసం మీ తపన కవితలో కనిపించాయి.

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.