16, అక్టోబర్ 2011, ఆదివారం

మనసున తోచిన మహితమూర్తి

మనసున తోచిన మహితమూర్తి
యే మనుకో నిను పోనీయను

లోలో నిండిన నీ మూర్తిని నే
చక్కగ పదిలం చేయాలంటే
ఒక బొమ్మ చెక్కటం రాదు
ఒక బొమ్మ గీయటం రాదు

లోలో నిండిన నీ మూర్తిని నే
హాయిగ గానం చేయాలంటే
ఒక పాట వ్రాయటం రాదు
ఒక పాట పాడటం రాదు

లోలో నిండిన నీ మూర్తిని నే
తృప్తిగ ఆరాధించాలంటే
ఒక మంత్రం నోటికి రాదు
ఒక పూజ చేయటం రాదు

లోలో నిండిన నీ మూర్తిని నే
అందుకనే కదలనీయక
తలపులతో బంధిస్తాను నా
మనుసులోనె బంధిస్తాను