14, ఏప్రిల్ 2016, గురువారం

ఏమి చేయమందు వీశ్వరా


       ఏమి చేయమందు వీశ్వరా న
న్నేమి చేయమందు వీశ్వరా
తెల్లవారినది మొదలు కల్లలాడు బ్రతుకాయె
నెల్లప్పుడు  నా కిచట నెవరి నే మందునయా
అల్లకల్లోలవార్థి యైనది నా చిత్తము
చల్లగా నిన్ను తలచజాలు వీలేదయా
ఏమి


ఏ వారికి హితుడనో ఎరుగరాని లోకమున
నా వారని యెవ్వరిని నమ్ముకొని యుందురా
ఈ వసుధ మీద వీర  లెఱుక గల్గి యున్నారని
నీ వారని యెవ్వరిని నేను తెలిసికొందురా
ఏమి


మస్తకము దురూహల మయమాయె విసివితిని
దుస్తులవలె తనువులను త్రోసిత్రోసి విసివితిని
పుస్తకముల పరమసత్యమును వెదకి విసివితిని
ప్రస్తుతకర్తవ్య మేమొ బాగుగా తెలుపరా
ఏమి

1 వ్యాఖ్య:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.