కదలె కదలె శ్రీరామచంద్రుడు కారడవుల కన్నా
వదినల వెంటను లక్ష్మణస్వామియు కదలినాడు ఘనుడు
నారచీరలను చుట్టబెట్టుకొనె నారాయణమూర్తి
నారచీరలను చుట్టబెట్టె తన నాతి సీత కతడె
నారచీరలను దాల్చె సుమిత్రానందను డంతటను
చేరి రాజునకు మ్రొక్కి వారపుడు సెలవు తీసుకొనిరి
నారచీరలను చుట్టబెట్టె తన నాతి సీత కతడె
నారచీరలను దాల్చె సుమిత్రానందను డంతటను
చేరి రాజునకు మ్రొక్కి వారపుడు సెలవు తీసుకొనిరి
చక్కనిచుక్క సీతమ్మ తనప్రక్కన నడువగను
మిక్కిలికోపము ముక్కునగల సౌమిత్రి వెంట రాగ
చెక్కుచెదరని చిరునవ్వుగల శ్రీరాముడు కదలె
అక్కట పదునాల్గేండ్ల పాటు కారడవుల నుండగను
మిక్కిలికోపము ముక్కునగల సౌమిత్రి వెంట రాగ
చెక్కుచెదరని చిరునవ్వుగల శ్రీరాముడు కదలె
అక్కట పదునాల్గేండ్ల పాటు కారడవుల నుండగను
నిలువుము నిలువుము రామా యనుచు పిలువగ దశరథుడు
వలదువలదు పోవలదు నీవనుచు బ్రతిమలాడ ప్రజలు
నిలువలేక తమ ననుగమించిరా నిఖిలపురప్రజలు
నిలువక పురమున రామచంద్రు డిక నిముషమేని కదలె
వలదువలదు పోవలదు నీవనుచు బ్రతిమలాడ ప్రజలు
నిలువలేక తమ ననుగమించిరా నిఖిలపురప్రజలు
నిలువక పురమున రామచంద్రు డిక నిముషమేని కదలె