30, సెప్టెంబర్ 2024, సోమవారం

శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ


శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ శృంగారమూర్తి కృష్ణ

లోకేశ కృష్ణ కృష్ణ శోకాపనయన కృష్ణ 


గోవింద కృష్ణకృష్ణ గోపాల కృష్ణ కృష్ణ

దేవాధిదేవ కృష్ణ దివ్యప్రభావ కృష్ణ

శ్రీవిష్ణుదేవ కృష్ణ శ్రీరుక్మిణీశ కృష్ణ

సేవింతుమయ్య నినుభక్తితోడ శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ 


జగదీశ కృష్ణ కృష్ణ సర్వేశ కృష్ణ  కృష్ణ 

నిగమాంతవేద్య కృష్ణ  నిర్మోహ కృష్ణ  కృష్ణ 

ఖగరాజవాహ కృష్ణ కంసారి కృష్ణ కృష్ణ

అగచాట్లుబాపి మమ్మేలవయ్య హరి కృష్ణ  కృష్ణ కృష్ణ 


పరమేశ కృష్ణ కృష్ణ బ్రహ్మాండనాథ కృష్ణ 

గిరిధారి కృష్ణ కృష్ణ కరుణాంతరంగ కృష్ణ 

సురవైరినాశ కృష్ణ గురుమూరి కృష్ణ కృష్ణ 

హరి మాకుతొలగ సంసారబాధ వరమిమ్ము కృష్ణ కృష్ణ 



12, సెప్టెంబర్ 2024, గురువారం

పండనీ

 పండనీ యీబ్రతుకు భగవంతుడా నీ
యండనే యటుగాక యది యెందుకు

నరవేషమును వేసి ధర నుండు టెందుకు

పరమాత్మ నినుగూర్చి పాడుటకు కాక

కరచరణములు దాల్చి గర్వించు టెందుకు

తరచు నీసేవలో తిరుగుటకు గాక


ధర నిన్ను వెదకుచు తిరుగాడు టెందుకు

పరమాత్మ నీవు నాభావ మందుండ

సురుచిరంబులు భావసుమము లవి యెందుకు

హరి నీకునై నిత్యమమరుకు గాక


నాకండ వగు శ్రమయు నీకెందుకో రామ

నీ కన్యమెఱుగక నేనుండుటను కాక

నాకున్న బ్రతుకిదియు నీకొఱకు గాక

నాకేల కోరదగినది యేమి కలదు


శ్రీరామనామ మొకటి

శ్రీరామనామ మొకటి చేరెను మదిలో
ఆరామనామమయ మాయెను బ్రతుకే

నాలుకపైకెక్కి యది నాట్యమాడ జొచ్చినది

చాలుననుచు వ్యర్ధప్రసంగములు మానెనది


కనులలోన చేర నది కైపు తలకెక్కినది

కనును రామమయముగా కనులు జగమంతటిని


తలలోపల చేరి యది తలపులన్ని మార్చినది

తలపులన్ని రామపాదములమీద వ్రాలినవి


సర్వేంద్రియముల నది శాసించగ దొడగినది

యుర్వి నన్యకార్యముల కురుకుట నవి మానినవి


ఆత్మ నది యాక్రమించి యతిశయించి నిలచినది

ఆత్మేశుడు రామునిలో నది కలసిపోయినది


8, సెప్టెంబర్ 2024, ఆదివారం

వీడేమి చేసేనమ్మా


వీడేమి చేసేనమ్మా వీడు

నేడేమి చేసేనమ్మా


నిన్న కడివెడు పాలు వెన్నమీగడలన్ని

తిన్నంతతిని అన్నీ తన్నిపోయేనమ్మ

కన్నులు గప్పివచ్చు వెన్నదొంగను బట్ట

ఎన్ని చేసినగాని యన్నీ వృథయై పోయె


అన్ని యిండ్లను దూరి యన్నిపాలనుత్రాగి

అన్ని దుత్తలలోని వెన్నలు తినుటేమి

నిన్న మాయింటికి రాలేదన్న సుదతి లేదే

ఎన్నడు నిట్టివి వింతలు విన్నదే లేదోయమ్మ


తిన్నగ వాని పండువెన్నెల వంటినవ్వు

కన్నులజూచి మురియుచున్నాము వాని రాక

అన్నులమిన్నలార ఆనందమే గొలుప

ఎన్నకతప్పు లందరమున్నాము కాదటమ్మ


7, సెప్టెంబర్ 2024, శనివారం

పొగడనీయవయ్య రామ

 


పొగడనీయవయ్య రామ పొగడనీయవయ్య

పొగడదగినవాడవు జగదీశుడ


పొగడనీ రసన యలసిపోవు దాకా నిన్ను

పొగడనీ పెదవు లలసిపోవు దాకా రామ

పొగడనీ తనువు పడిపోవు దాకా నిన్ను

పొగడనీ పొగడనీ పురుషోత్తమ


పొగడనీ కాల మాగిపోవు దాకా నిన్ను

పొగడనీ మాట లుడిగిపోవు దాకా రామ

పొగడనీ జగము లణగిపోవు దాకా నిన్ను

పొగడనీ నిత్యమును పురుషోత్తమ


పొగడనీ పొగడి హృదయముప్పొంగ నిన్ను

పొగడనీ పొగడి మురిసి పోదును రామ

పొగడనీ సకలసుగుణభూషణుడ వగు నిన్ను

పొగడనీ విరివిగా పురుషోత్తమ


6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

ఇదియేమి యిటులాయె

 
ఇదియేమి యిటులాయె నినకులతిలక
యిదియంతయు నీమాయయే కాదా


నేడు నీనామ మేల నిలువదు నానాలుకపై
వేడుకగా రామచంద్ర వివరమేమి టయ్య
నేడు నీరూప మేల నిలువదు నామనసులోన
చూడచక్కని తండ్రి యీచోద్యమేమి

దినదినము నీయశో గీతికలుపాడు నానోరు
దినపతికులనాథ మూగదనము చెందనేల
మనసు నోరుపెగల నీయని మంకుదన మేటికి
వినుతశీల పూనినదా వివరమేమి

తెలిసె రామచంద్ర నీదు దివ్యతేజంబులోన నే
కలిసిపోయి కరిగిపోయి నిలచిపోయి నీయందే
తెలియనైతి కాలంబును తెలియనైతి యొడలిని
నిలువనిమ్ము నీలోనే నీరజాక్ష


5, సెప్టెంబర్ 2024, గురువారం

ఎంతకును నీదయ

 

ఎంతకును నీదయ సుంతయును రాక

చింతలును పోక నను చెడనిత్తువా


అహరహము నిను వేడు టది యెందుకో తెలిసి

తహతహ నాకెందుకో దశరథాత్మజా

బహుచక్కగ నెఱిగి పలుకాడకున్నావు

మహరాజ నీఠీవి మరి ఘనమాయె


నీయానచే కదా నేను భూమికివచ్చి

ఆయాసపడుచుంటి నని యెఱిగియును

చేయూత నొసగి నను చేదుకొన కున్నావు

ఓయయ్య నీదయకు వేయిదండాలు


నీగొప్పను చాటుచును నేను తిరుగాడగను

నాగోడును వినవుగా బాగుబాగు

రాగద్వేషములు లేని రామచంద్రా యను

రాగమును చూపు మన రాదుగా నిన్ను



పొగడుదునా నిను

పొగడుదునా నిను పురుషోత్తమా నాపొగడికలకె యుప్పొంగేవా

పొగడుచు నేను చాల మురియుటయే గాని
జగదీశ నీగొప్ప చాటుట నాతరమె
నగజేశ యురగేశ నారదాదుల వలె
మిగులచక్కగ నిను పొగడలే నాయె

త్రిగుణాతీతునకు దేవదేవునకు నే
పొగడికలకు మన ముప్పొంగదని
నగరాజధర నా మనసున నెఱిగియు
మిగులచక్కని ప్రేమమీఱగ నిత్యము

రామ నీనామమును రక్కసుడును పొగడ
నేమని పొగడక నిల నుందునయా
కామితవరద నీఘనత దినదినమును
వేమరు పొగడక విడువనేరను సూవె


మరి యెవ్వడయ్యా

మరి యెవ్వడయ్యా మహిలో ఘనుడు
పరమేశుని యానగ వాడే ఘనుడు

హరిని తలచి మురియుచుండు నరుడే ఘనుడు

హరినామము రసననుగల నరుడే ఘనుడు

హరికన్యము నెఱుగ ననెడు నరుడే ఘనుడు

శిరమున హరికరుణగల నరుడే ఘనుడు


పరాభక్తి సంయుతుడగు నరుడే ఘనుడు

పరమభాగవతుండగు నరుడే ఘనుడు

పరమపురుషు నెఱిగికొనిన నరుడే ఘనుడు

పరమపదము చేరుకొనెడు నరుడే ఘనుడు


హరేరామయన మరగిన నరుడే ఘనుడు

హరేకృష్ణయనుచు తిరుగు నరుడే ఘనుడు

హరిమయమగు బ్రతుకుగల నరుడే ఘనుడు

హరియందే నిలచియుండు నరుడే ఘనుడు



వాడే భక్తుడు వాడే ధన్యుడు

వాడే భక్తుడు వాడే ధన్యుడు
వాడే ప్రియుడు భగవంతునకు 

స్మరణానందమె యుక్తమని
చక్కగ నెఱిగిన వాడెవడో
స్మరణానందమె ముఖ్యమని
చక్కగ నెఱిగిన వాడెవడో
స్మరణానందమె రుచ్యమని
చక్కగ నెఱిగిన వాడెవడో
స్మరణానందమె సర్వమని
చక్కగ నెఱిగిన వాడెవడో

స్మరణానందము బడసినచో
చాలని తలచెడు వాడెవడో
స్మరణానందము బడసినచో
సర్వము మరచెడు వాడెవడో
స్మరణానందము బడయుటచే
జ్ఞానము కలిగిన వాడెవడో
స్మరణానందము బడయుటచే
పరమును చెందిన వాడెవడో

హరేరామ యను స్మరణంబే
యవిరళమైన వాడెవడో
హరేకృష్ణ యను స్మరణంబే
యవిరళమైన వాడెవడో
హరిస్మరణంబున కన్యమునే
యరయని సుజనుడు వాడెవడో
స్మరణము విడచిన క్షణమైన
మనజాలని సజ్జను డెవడో

పరమానందము



పరమానందము రామస్మరణానంద మని
నరులలోన కొందరే నయముగ నెఱుగుదురు

ఎఱిగినట్ఞి వారలకది యెంతో యానందము
ఎఱుకలేని వారెన్నడు నెఱుగని యానందము
కఱకంఠుడు పొందుచుండు ఘనమగు నానందము
మఱియును యోగీంద్రులెల్ల మఱిగిన యానందము

సీతమ్మ వారి వలెను చిత్తమున స్మరించుట
వాతాత్మజు వలెను స్మరణ వదలలే కుండుట
ప్రీతితోడ పవలురేలు విడువక స్మరియించుట
చేతోమోదముగ నెఱిగి చెలగు సద్భక్తులకు

ఇట్టిది యగు నానంద మింకొక్క టుందదని
గట్టిగ తమహృదయంబుల ఘనముగ నెఱిగిన
పుట్టువుతో వైరాగ్యము పొందిన ధన్యాత్ములు
పట్టివిడువకుండ నుండి బడయు నానందము



3, సెప్టెంబర్ 2024, మంగళవారం

మనసా శ్రీరామచంద్రుని


మనసా శ్రీరామచంద్రుని మాట మరచినావటే

దినమంతా పనులనుచు తిరుగుచున్నావటే


రామనామము చాలనుచు నేమేమో పలికితివి

రామకీర్తనలు చాలా రమ్యముగా పాడితివి

రాముడే నాలోకమని ప్రేమగా పలికితివి

ఏమే ఈనాడు శ్రీరామునెటుల మరచితివి


హరిస్మరణము కన్న ముఖ్యమైన పని యున్నదా

హరిసేవల కన్న ముఖ్యమైన పని యున్నదా

హరిని మరచి తిరిగితివా యధోగతే కాదటే

పరుగిడవే పరుగిడవే హరివద్దకు మనసా


తప్పులెన్ననట్టి వాడు దశరథాత్మజుడు కద

తప్పైనది యని పలికిన తాను దండించడే

ఒప్పుగ శ్రీరామనామ మిప్పుడైన పలుకవే

ఎప్పటికిని రాముడే  హితకరుడే మనసా




2, సెప్టెంబర్ 2024, సోమవారం

ఉత్తుత్తి బ్రతుకొక్కటి

ఉత్తుత్తి బ్రతుకొక్కటి యుండనేల వట్టి
ప్రత్తికాయ వలెను నీరసమైన బ్రతుకు

మిన్నగ హరిసేవలో మెలగని దొక బ్రతుకా
కన్నుల శ్రీరాముని కాంచని దొక బ్రతుకా
పన్నుగ శ్రీహరికి మ్రొక్కకుండిన దొక బ్రతుకా
దిన్నగ హరిసంసర్గము నెన్నని దొక బ్రతుకా

ఉడుగక శ్రీరామయని నుడువని దొక బ్రతుకా
నుడువక హరికీర్తిని గడిపెడి దొక బ్రతుకా
గడువని సంసారమున పడియున్నది బ్రతుకా
పడి చెడి హరిసంసర్గము వదలిన దొక బ్రతుకా

బ్రతుకనిన హరికొరకై బ్రతికినదే బ్రతుకు
బ్రతుకనిన హరివాడై బ్రతికినదే బ్రతుకు
బ్రతుకనిన గుండెనిండి రాముడున్నది బ్రతుకు
బ్రతుకనిన నట్టి బ్రతుకు బ్రతికినదే బ్రతుకు

1, సెప్టెంబర్ 2024, ఆదివారం

రండి బాబు రండి

రండి బాబు రండి శ్రీరామభజనకు చే
యండి భజన చాల పుణ్యముండును మీకు

భజనచేయ ప్రారబ్ధపు బాధ తగ్గును 
భజనచేయ సంచితమిక పండకుండును 
భజనచేయ ఆగామియ భస్మ మయేను
భజనచేయు భక్తుల కిక పాపముండదు

భజనచేయు వారికి సంపదలు పెరుగును
భజనచేయు వారికి హరిభక్తి పెరుగును
భజనచేయు వారికి కలిబాధ లుండవు
భజనచేయు వారికి యమభయము తొలగును

హరినామము దొరకుటే నరుని భాగ్యము
హరినామము పలుకుటే యమితపుణ్యము
హరిభజనానందమే యానందము
హరిభజన చేసి ముక్తి బడయవచ్చును