28, మే 2024, మంగళవారం

శ్రీరామనామమున చేకూరనది లేదు

శ్రీరామనామమున చేకూరనది లేదు
శ్రీరామనామ మాశ్రితకల్పవల్లి

శ్రీరామనామమున సిరులవర్షము కురియు
శ్రీరామనామమున చింతలన్నియు నణగు
శ్రీరామనామమున కోరికలు నెఱవేరు
శ్రీరామనామమున చెదరిపోవును భయము
శ్రీరామనామమున చేతజిక్కును జయము
శ్రీరామనామమున నారాటములు తొలగు
శ్రీరామనామమున క్షేమవార్తలు కలుగు
శ్రీరామనామమున వైరిషట్కం బణగు
శ్రీరామనామమున చేకూరు ఘనశక్తి
శ్రీరామనామమున ధారాళమగు భక్తి
శ్రీరామనామమున వైరాగ్యమును కలుగు
శ్రీరామనామమున సిధ్ధించు మోక్షంబు


27, మే 2024, సోమవారం

జీవి సంసారమున

జీవి సంసారమున చిక్కి - చిక్కి

దేవ దేవ తిరుగుచుండు


బహుజన్మముల తాను పొంది - పొంది

బహువిద్యలను తాను నేర్చి - నేర్చి

బహు కర్మముల తాను చేసి - చేసి

బహుధనంబుల తాను బడసి  - బడసి

బహుగర్వమున తాను తిరిగి - తిరిగి

బహుపాపముల తాను చెంది - చెంది

బహుదుఃఖముల తాను బడలి - బడలి

బహుతాపమున తాను క్రుంగి - క్రుంగి

బహుదారులను తాను వెదకి - వెదకి

బహుగురువులను తాను మ్రొక్కి - మ్రొక్కి

బహుమంత్రములు తాను బడసి - బడసి

బహుదీక్షలను తాను పట్టి - పట్టి

బహుయోగముల తాను వరలి - వరలి

బహుదేవతల తాను కొలిచి - కొలిచి

బహుతపంబులు తాను చేసి - చేసి

బహువిరాగిగ తాను మారి - మారి

బహునిష్ఠ తా హరిని తలచి - తలచి

బహునిష్ఠ తా హరిని కొలిచి - కొలిచి

బహునిష్ఠ తా హరుని తలచి - తలచి

బహునిష్ఠ తా హరుని కొలిచి - కొలిచి

బహుభంగులను తాను వేడ - వేడ

బహుకాలముగ తాను వేడ - వేడ

బహుమతిగ శివకృపను బడసి - బడసి

ఇహము దాటెడు దారి తెలిసి - తెలిసి

బహుప్రీతి శ్రీరామనామం - నామం

బహుమతిగ శివుడీయ నెఱిగి - యెఱిగి

బహుశ్రధ్ధతో తాను చేసి - చేసి

విహరించు హరిపదము చేరి - చేరి


26, మే 2024, ఆదివారం

స్వవిషయం - 1

 నాకు ఈ మే 6వ తారీఖుతో 72 సంవత్సరాలు నిండాయి.

ఇంక నాకు ఎంత ఆయుర్దాయం ఉన్నా అది నాదృష్టిలో ఒక బోనస్ లాంటిది అనుకుంటున్నాను.

ఇప్పుడు నాకు ఇంక వ్యక్తిగతమైన ఆశలూ ఆశయాలూ ఏమీ లేవు.

ఏది చేసినా రాముడి పేరు మీదనే చేయటం.

రామాంకితంగా నాకు సాధ్యమైనంత సాహిత్యాన్ని నేను సృజిస్తున్నాను.

దానితో ఈ లౌకిక జగత్తుకు నిమిత్తం లేకపోవచ్చును.

ఒకవేళ ఉన్నా కొంచెం ఉండే అవకాశం లేదనను.

ఇప్పుడు నేను వ్రాస్తున్నదంతా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు చదవాలనీ ఆదరించాలనీ ఆశించటం పేరాశ అని తెలుసు.

ఐనా రాముడు తలచుకుంటే అద్భుతాలు జరుగుతాయి.

జరుగకపోయినా ఇబ్బంది లేదు.

నేను మళ్ళీ వచ్చి ఇంతకన్నా బాగా చేయాలని రాముడి తాత్పర్యం అని అర్ధం చేసుకుంటాను.

లేదా నేను మళ్ళి వచ్చి స్వయంగా ఆసాహిత్యాన్ని వెలుగులోనికి తీసుకొని రావాలని కూడా రాముడి తాత్పర్యం కావచ్చును.

ఏది ఏమైనా అంటే ఈప్రపంచం కోసం ఐనా, నాకోసం ఐనా ఈ సాహిత్యాన్ని పదిలపరచవలసి ఉంది.

ఆపనిలోనే ఉన్నాను.

శ్రేయోభిలాషులు కొందరు పుస్తకాలుగా ముద్రించమని కొన్నాళ్ళుగా సూచిస్తున్నారు. వారిలో కొందరు వత్తిడి చేస్తున్నారు కూడా. కాని పుస్తక ముద్రణ అంటే వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం.  ముఖ్యంగా తెలుగువాళ్ళలో సాహిత్యపరమైన పుస్తకాలను కొని చదివే వారి సంఖ్య నమ్మశక్యం కానంత తక్కువ అని ఖరాఖండీగా చాలా కాలం నుండీ వింటూ ఉన్నాను. 

నాకు పుస్తకాలను ముద్రించే స్తోమత ఉన్నది అనుకోను.

అదీ కాక నాసాహిత్యం చాలానే పుస్తకాలుగా వస్తుంది. అన్ని పుస్తకాలను ముద్రించేందుకు లక్షల మీద ఖర్చు అవుతుంది. అంతెక్కడ నుండి తెచ్చేది? ఆపుస్తకాలను ఎవరు కొంటారు. గుట్టలు గుట్టలుగా ఆపుస్తకాలన్నింటినీ ఇంటిలోనే పదిలంగా దాచుకోవటం వీలయ్యే పనీ కాదు, సమర్ధనీయమైన పనీ కాదు.

అసలు వీటిని DTP చేయించటానికే ఎంతో ఖర్చు అవుతుంది. అదే నాకు వీలు కాదు.

అందుచేత ఆ DTP ఏదో నేనే స్వయంగా చేసుకుంటాను. ఇబ్బంది లేదు.

చాలా కాలం పాటు ప్రింట్ బుక్ అన్నదే ఈబుక్ కూడా అనుకుంటున్నాను. అది తప్పు అని తెలిసింది.

ఈబుక్స్ చేయాలంటే అది వేరే కార్యక్రమం.

అదీ నేను స్వయంగా చేసుకుంటాను.

ఇదంతా చేసి నా వ్రాతలన్నీ భద్రపరచుకోవాలని ఆశిస్తున్నాను.

ఇంతవరకూ వ్రాసినదీ ఇకముందు వ్రాయబోయేది ఏమన్నా ఉంటే అదీ ఇలా పుస్తక రూపంలోనే ఎక్కడో అక్కడ అందరికీ అందుబాటులో ఉండేలా పదిలపరచాలి. కాబట్టి ఆపని మీద శ్రధ్ధ పెడుతున్నాను.

నేను కాస్త బధ్ధకస్తుణ్ణి.

కాని బధ్ధకించి రేపో మాపో చేదాం  అనుకుందుకు వీలులేదు.

ఇప్పుడు బోనస్ వయస్సులోనికి వచ్చేసాను కదా. ఇక బధ్ధకానికి తావు లేదు.

ఇది కూడా ఒక రామకార్యమే కాబట్టి దీని మీద శ్రధ్ధపెట్టక తప్పదు.

ఇది రామకార్యం ఎల్లాగు అవుతుందీ, ఇది నీ స్వకార్యం కదా అని ఎవరన్నా అభిప్రాయ పడవచ్చును. లేదా ముఖం మీదే అనవచ్చును,  అలా ఆలోచించే వారికి ఒక నమస్కారం. వాదన చేయను.


25, మే 2024, శనివారం

నిద్ర

గతరాత్రి నాకు నిద్రపట్టలేదు.

గతరాత్రి నేను నిద్రపోలేదు.


ఈరెండు వాక్యాలు చెప్పే విషయమూ ఒకటే కదా అనిపిస్తుంది.


కానీ రెండూ వేరువేరు భావాలను వ్యక్తీకరించ వచ్చును.


నిద్రపట్టలేదూ అంటే నిద్రపోవటం కోసం ప్రయత్నం చేసినా ఫలించలేదూ ఆని అర్థం వస్తుంది.


నేను నిద్రపోలేదంటే అదేదో నా యిష్టప్రకారం జరిగి ఉండవచ్చును కదా అని అర్థం తీయవచ్చు.


నిద్రపట్టలేదు. నిద్రపోలేదు.. అని రెండు మాటలనూ చెప్పినపుడు కార్యకారణ సంబంధం తోచవచ్చును.


సరే అలాగే కా‌‌ర్యకారణ సంబంధం ఖరారు చేసుకుందాం.


నా నిద్రకు సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. 


మొట్టమొదటి నియమం ఏమిటంటే రాత్రి పూట బాగా ప్రొద్దుపోయేదాకా మెలకువగా ఉండి అప్పుడు పడుకుంటానంటే ససేమిరా కుదరదు.


రెండవనియమం ఏమిటంటే నిదురమధ్యలో కాని పడక దిగవలసి వస్తే నిముషాల వ్యవధిలో మళ్ళా పడుకుని తీ‌రాలి. 


మూడవనియమం ఏమిటంటే పగలు నిద్రపోదామంటే కుదరనే కుదరదు.


ఈనియమాలకు తోడు నాకు మరీ ఒళ్ళుతెలియనంత నిద్రపట్టదు. నేను నిద్ర పోతున్నపుడు సమీపంగా వచ్చి ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నా అలికిడి చేసినా నాకు మెలకువ వచ్చేస్తుంది.


ఈమధ్య కాలం వరకూ ఇంత సుకుమారమైన నిద్రతో బాగానే పెట్టుకొని వస్తూ ఉన్నాను.


ఇప్ఫుడు రెండు కారణాలు నా సుకుమారనిద్రా విలాసాన్ని సవాలు చేస్తున్నాయి.


ఇంటిలో ఒక పేషంట్ ఉన్నపుడు కుటుంబ సభ్యులకు ఆపేషంట్ ఆలనాపాలనా చూసుకోవటం కోసం వ్యగ్రత ఏర్పడుతుంది. పరిస్థితిని బట్టి ఒక్కొకసా‌రి నిద్రలకూ ఇబ్బందులు రావచ్చును. కుటుంబసభ్యులు వంతులవారీగా అని కాకపోయినా వీలును బట్టి సమయానికి ఎవరో ఒకరు పేషంటుకు సహాయం ఛేస్తు ఉంటారు.


కానీ, ఇంటిలో ఉన్నది ఆపేషంట్ కాక మరొకరు మాత్రమే ఐతే ఆ రెండవ మనిషికి ఊపిరిసలపక పోవచ్చును.


ప్రస్తుతం నాపరిస్థితి అదే. ఇంట్లో ఉన్నది నేనూ మాశ్రీమతి శారదా ఇద్దరమే.


తను ESRD పేషంట్.


ఈ ESRD అంటే end stage renal disease అన్నదానికి పొట్టిమాట.


తనకు వారానికి మూడు పర్యాయాలు డయాలసిస్ చేయించవలసి ఉంటుంది. 


నిజంగా ఈ డయాలసిస్ జీవితం ఒక నరకం. ఎన్నో ఇబ్బందులూ బాధలూ ఓర్చుకుంటూ డయాలసిస్ పేషంట్ల జీవితం సాగుతూ ఉంటుంది.


గాలిలో దీపాలు వీళ్ళప్రాణాలు.


ఇంచుమించు ఐదేళ్ళనుండీ తను కుకట్ పల్లి రామ్ దేవ్ ఆస్పత్రిలో జైన్ ట్రష్ట్ వారి సెంటర్లో డయాలసిస్ చేయించుకుంటోంది.


మాలాగే ఇంకా ఎందరో అక్కడికి డయాలసిస్ కోసం వస్తూ ఉంటారు.


ఒక్కొక్కసారి కొందరు చిన్నపిల్లలు డయాలసిస్ కోసం వస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది.


సెంటర్లో తోటి డయాలసిస్ పేషంట్లతో పరిచయాలూ స్నేహాలూ కలుగుతూ ఉంటాయి.


అటువంటి స్నేహితులు హఠాత్తుగా మాయం ఐపోతూ ఉంటారు. మనస్సులకు గ్లాని కలుగుతూ ఉంటుంది.


ఎప్పడు మనవంతు వస్తుందో ఆని తరచుగా అనిపిస్తుంది.


ఈ దిగులు చాలదా నాకు నిద్రపట్టకుండా చేయటానికి చెప్పండి.


అదీ కాక తనకు ఇంట్లో ఆసరాగా ఉన్నది నేనొకడినే.


ఈ కిడ్నీవ్యాధి ఉన్నవాళ్ళకు చాలా సపోర్ట్ అవసరం దివారాత్రాలూను. 


ఈవ్యాధికి దారితీసిన మధుమేహం రక్తపుపోటులను సముదాయించటానికి చాలా శ్రమ అవసరం. 


తనకు ఎప్పుడూ ఏదో ఒక సహాయం అవసరం అవుతూనే ఉంటుంది. రాత్రి అని వి‌రామం ఉండదు.


అప్పుడప్పుడు ఉన్నఫళంగా అర్ధరాత్రి అపరాత్రి అనక తీసుకొనిపోయి ఎమర్జెన్సీ  వార్డుకు చేర్చవలసి ఉంటుంది.


అందుచేత నాకు నిద్రపోవటానికి కుదరక పోవటమే కాదు, నిద్రపోవాలంటే కూడా భయమే.


ఏ అర్ధరాత్రి వేళనో నేను నిదురలో ఉండగా తనకు సుగర్ డౌన్ కావటం జరిగితే ఎంత ప్రమాదం?


అందుచేత శారద ప్రశాంతంగా పడుకొని నిదురపోతున్నా సరే నేను మెలకువగానే ఉంటున్నాను.


ఇలా నిద్రను వదిలి వేస్తున్న పక్షంలో అలసట రాదా జబ్బుచేయదా అని సందేహం వస్తుంది కదా.


నాకూ అదే సందేహం. కాని దానికి నాకు ఒక సమాధానం ఉంది.


భగవంతుడు శ్రీరామచంద్రుడు చాలా కరుణామయుడు.


నాకు ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఆయనకు ఎప్పుడో తెలుసును కదా.


అందుకని తన దివ్యనామాన్ని నాకు అనుగ్రహించాడు.


మొదట్లో అప్పడప్పుడూ రామనామభజనానందం ఆనుభవిస్తూ వచ్చిన నారసన క్రమంగా దివారాత్రాల మధ్య బేధం ఎంచక నిత్యం అదే ఆనందంలో మునిగి ఉండసాగింది.


అందుచేత రాత్రులు ఇత‌ర లౌకికక్రియాకలాపాలు అట్టే ఉండవు కాబట్టి మరింత జోరుగా రామనామం నడుస్తూ ఉంటుంది.


ఇది నాప్రజ్ఞతో నేను ఏదో సాధించినది కాదు. రాముడు ఏర్పాటు చేసినదే.


యోగక్షేమం వహామ్యహం అన్నాడంటే భగవానుడు అదేదో తమాషాగా అన్నమాట కాదు కదా. పుట్టి బుధ్ధెరిగిన నాటినుండీ తననే నమ్ముకొన్న నాబాధ్యత తనదే కదా.


రామనామం నడుస్తూ ఉంటే అలసట ఉండదు. దానికి నేనే నిదర్శనం.


భగవద్గీతలో


యా నిశా సర్వభూతానాం

తస్యాం జాగర్తి సంయమీ 

యస్యాం జాగ్రతి భూతాని

సా నిశా పశ్యతో మునేః 


అని ఉంది చూడండి. అలాగు ప్రపంచంలో అందరూ నిదురపోయే రాత్రి సమయాల్లో నేను ఇంచక్కా రామస్మరణ చేసుకుంటూ ఉంటా నన్నమాట.


ఇదే బాగుంది.


అందుచేత సకారణంగానే నాకు నిద్రపట్టనూ లేదు. నేను నిదు‌రపోనూ లేదు.



16, మే 2024, గురువారం

నమ్ముడు మానుడు

 

కం. నమ్ముడు మానుడు రాముని

నమ్మిన మానవుడు చెడడు నమ్మక చెడుచో

నమ్మనుజుని రక్షింపగ

నిమ్మహి రామునకు దప్ప నెవ్వరి తరమౌ


ఈ ప్రపంచంలో  రాముణ్ణి నమ్ముకున్న వాడు చెడడు. నమ్మండి మానండి. ఇదే నిజం.

ఒక వేళ ఎవడన్నా రాముణ్ణి నమ్మకపోతే వాడు చెడిపోవచ్చును. నమ్మి మాత్రం ఎవరూ చెడరు.

ఎవడన్నా రాముణ్ణి నమ్మక చెడిపోతే వాణ్ణి ఎవరూ రక్షించలేరు.

ఒక్క రాముడే దయదలచి రక్షించాలి కాని మరెవరికీ అది తరం కాదు.


13, మే 2024, సోమవారం

లేడా రాముడు లేడా నీయెడ

లేడా రాముడు లేడా నీయెడ

వాడేగా నీకేడుగడ


కూరిమితో నిను చేరదీయుటకు

    శ్రీరఘురాముడు లేడా

వీరిప్రేమ కని వారిప్రేమ కని

    వెంపరలాడుట లేలా


ధారాళముగా దయలు కురియుటకు

    దశరథరాముడు లేడా

వీరికరుణ కని వారికరుణ కని

    వెంపరలాడుట లేలా


కొల్లలుగా సిరులెల్ల నిచ్చుటకు

    చల్లనిరాముడు లేడా

ఎల్లదిక్కులను సిరులను వెదకుచు

    నిటునటు తిరుగుట లేలా


వెల్లడిగా నరిషట్కము నణచగ

    వీరుడు రాముడు లేడా

అల్లరి చేసే కామాదులు గల

     వన్న బెంగ నీకేలా


చింతలన్నిటిని తొలగించుటకై

    సీతారాముడు లేడా

చింతలవంతల జిక్కి కృశించుచు

    చిన్నబోవ నీకేలా


అంతరంగమున శాంతి నించుటకు

    నయోధ్యరాముడు లేడా

అంతులేని దీసంసారం బని

     యంతగ భయపడ నేలా


10, మే 2024, శుక్రవారం

రామ రామ జయ దశరథరామా


రామ రామ జయ దశరథరామా 
    రామ రామ జయ రాఘవరామా

రామ రామ జయ రాఘవరామా 
    రామ రామ జయ రవికులసోమా

రామ రామ జయ రవికులసోమా 
    రామ రామ జయ సద్గుణధామా

రామ రామ జయ సద్గుణధామా 
    రామ జయ మునిజనకామా

రామ రామ జయ మునిజనకామా 
    రామ రామ జయ దైత్యవిరామా

రామ రామ జయ దైత్యవిరామా 
    రామ రామ జయ సీతారామా

రామ రామ జయ సీతారామా 
    రామ రామ జితభార్గవరామా

రామ రామ జితభార్గవరామా 
    రామ రామ దశకంఠవిరామా

రామ రామ దశకంఠవిరామా 
    రామ రామ జయ రాజారామా

రామ రామ జయ రాజారామా 
    రామ రామ జయ మేఘశ్యామా

రామ రామ జయ మేఘశ్యామా
    రామ రామ శ్రీవైకుంఠధామా

రామ రామ శ్రీవైకుంఠధామా
    రామ రామ జయ తారకనామా


8, మే 2024, బుధవారం

ఎంత మంచివాడవురా


ఎంత మంచివాడవురా యెంతని పొగడదురా
చింతలన్ని తీర్చినావు చిత్తజగురుడా

అంతులేని మోహంబుల నణచుట యది యెట్టులని
చింత జిక్కి యున్న నన్ను చేరదీసి
ఎంతలేసి మోహంబుల నిట్టే యణగించుదు నని
పంతమాడు నీనామమె పరగ నా కిచ్చితివి

అంతుపొంతు లేక సాగు నట్టి జన్మపరంపర
యెంతకాల మనుచు నేను చింతించగను
పంతగించి భవచక్రము పగులవేయు నీనామము
నెంతో దయ చూపి యినకులేశ నా కిచ్చితివి

పండీపండని భావములను వచ్చీరాని భాషలో
వండి కీర్తనల జేసి వడ్డించినను
నిండుమనసు తోడ మెచ్చి నీవు నీనామము నా
కండ జేయు చుంటివి కోదండరామ దండము


7, మే 2024, మంగళవారం

వరమీవయ్యా


వరమీవయ్యా రామ వరమీవయ్యా మంచి

వరమీవయ్యా నాకు వరమీవయ్యా


పరమపురుష నీనామ స్మరణమును మరువకుండ

పరమభాగవతుల స్నేహబాంధవ్యము లబ్బునటుల


నిన్ను గాక నేనన్యుల నెన్నడును స్మరించకుండ

నిన్ను తిట్టు నీచులతో నెన్నడు పనిబడకుండగ


సిరులపైన వ్యామోహము చెందకుండ నాచిత్తము

నిరంతరము నీయందే నిలిచియుండ నాచిత్తము


తవులకుండ పాపపుణ్యద్వంద్వము నాకికపైన

భవచక్రము పగులదన్ని వచ్చునటుల నీవద్దకు


భజన చేయరే రామభజన చేయరే

భజన చేయరే రామభజన చేయరే 
భజన చేయరే మీరు భజన చేయరే


రామ రామ యని భజన చేయరే
    రాముని మహిమను చాటించుచును

రామ రామ యని భజన చేయరే
     రాముని కరుణను వర్ణించుచును

రామ రామ యని భజన చేయరే
    రాముని శౌర్యము నగ్గించుచును

రామ రామ యని భజన చేయరే
    రాముని గుణగణములు పొగడుచును


రామ రామ యని భజన చేయరే
     స్వామినామమును తాళము తప్పక

రామ రామ యని భజన చేయరే
     ప్రేమమీఱగను వివిధగతులను

రామ రామ యని భజన చేయరే
     స్వామిభక్తిని చాటించుచును

రామ రామ యని భజన చేయరే
      రాదిక జన్మం బని నమ్ముచును


రామ రామ యని భజన చేయరే
    రమణీమణి సీతమ్మ మెచ్చగను

రామ రామ యని భజన చేయరే
    లక్ష్మణస్వామియు మురిసిపోవగను

రామ రామ యని భజన చేయరే
    రయమున హనుమయు మీతో గలియ

రామ రామ యని భజన చేయరే
     రాముడు సత్కృప వర్షింపగను


6, మే 2024, సోమవారం

రాముని కొలువరే


రాముని కొలువరే సీతా
    రాముని కొలువరే
రాముని గగనశ్యాముని పరం
    ధాముని కొలువరే

రాముని కొలుచు వారి కడకు 
    కాముడు రానే రాడట
రాముని కొలుచు వారి తాప
    త్రయ మణగి పోవునట

రాముని కొలుచు వారి పాప
    రాశి బూది యగునట
రాముని కొలిచి మోక్షద్వా
    రమును దాట వచ్చునట

రాముని కొలుచు వారి సర్వ
    కామనలు తీరునట
రాముని కొలిచి నంత మోక్ష
   రాజ్యమే కలుగునట


హరిశుభనామము చాలని


హరిశుభనామము చాలని తెలిసిన 
    నరుడే విజ్ణుడు పోరా
హరిశుభనామము గళమున నించిన 
    నరుడే నేర్పరి పోరా

హరినామముపై రక్తి కలిగితే 
    నరుడు తరించును కాని
హరినే తెలియక ధరపై తిరిగుచు 
    నరుడు తరించుట కలదా

హరినామముపై ననురాగముతో 
    నరుడు తరించును కాని
హరి హరి యనుటకు చిరాకు చూపెడు 
    నరుడు తరించుట కలదా

హరి సర్వాత్మకు డని లోనెఱిగిన 
    నరుడు తరించును కాని
హరియే లేడని డంబము లాడే 
    నరుడు తరించుట కలదా

హరిభక్తులతో సంగతి నెఱపిన
    నరుడు తరించును కాని
హరిభక్తుల గని వెక్కిరించెడు 
    నరుడు తరించుట కలదా

హరేరామ యని హరేకృష్ణ యని 
    నరుడు తరించును కాని
మరొక్క విధమున మసలుచు నుండిన
    నరుడు తరించుట కలదా

తరింపజేసే తారకనామము
    వరించ తరించు కాని
మరొక్క విధమున మానవమాత్రుడు
    తరించు టన్నది కలదా

రామనామమే తలచండి


రామనామమే తలచండి శ్రీ
    రామనామమే పలకండి
రామనామమునె పొగడండీ శ్రీ
    రామనామమునె పాడండి

రామనామమున రక్తి కలుగగా 
    ప్రజలకు బోధన చేయండి
రామనామమున పొందరానిదే 
    భూమిని లేదని చాటండి
రామనామమును చేసెడు వారికి 
    రక్షణ కలదని చాటండి
రామనామమున ముక్తి కలుగునని 
    ప్రజ లందరకును చాటండి

రామనామమే సంపత్కర మని 
    ప్రజలకు సత్యము చాటండి
రామనామమే ప్రజలందరకు 
    క్షేమకరంబని చాటండి
రామనామమే వరదాయక మని 
    భూమి నందరకు చాటండి
రామనామమే భవతారకమని 
    ప్రజ లందరకు చాటండి

రామరామ యను నామమంత్రము


రామరామ యను నామమంత్రము 
    నేమరకుండిన చాలును
రాముని నామము చాటుచు తిరుగుచు 
    భూమి నుండుటే చాలును


అవదాతాంబుజలోచను రాముని
    యనిశము దలచుట చాలును
భువనమోహనును రాముని నిత్యము
    పొగడుచును నుండిన చాలును
దివారాత్రములు రాముని కీర్తన 
    తీయగ చేయుట చాలును
భవబంధములను చిక్కక రాముని
    పదముల నుండిన చాలును


సదమలమగు శ్రీరాముని కీర్తిని
    చక్కగ చాటుట చాలును
మదిలో రాముని తత్త్వచింతనము
    మానక చేయుట చాలును
పదములె చాలును రామా యనుచును
    పాడుచు మురియుట చాలును
హృదయపద్మమున రాముని రూపమె
    యమరి యుండినది చాలును 
వదలక రాముని నామము దలచెడు
    భక్తుల స్నేహము చాలును


చాలుచాలు శ్రీరామనామ మను 
    చక్కని స్పృహయే చాలును
చాలుచాలు శ్రీరామనామ మన
    జాలెడు భక్తియె చాలును
చాలుచాలు శ్రీరామనామ మని 
    చాటెడు శ్రధ్ధయె చాలును
చాలుచాలు శ్రీరామనామ మది 
    చక్కగ ముక్తి నొసంగును


సదా వందనీయుడ వగు సాకేతరామ

 

సదా వందనీయుడ వగు సాకేతరామ
సదా నన్నేలుచుండు సర్వేశరామ

నిన్ను సదా కీర్తించుచు నున్నారు విబుధులు
నిన్ను సదా వర్ణించుచు నున్నారు కవులు
నిన్ను సదా చింతించుచు నున్నారు యోగులు
నిన్ను సదా పూజించుచు నున్నారు భక్తులు

నిన్ను సదా ధ్యానించుచు నున్నారు మునులు
నిన్ను సదా సేవించుచు నున్నారు దాసులు
నిన్ను సదా ప్రార్ధించుచు నున్నారు సుజనులు
నిన్ను సదా చేరుకొనుచు నున్నారు జ్ణానులు

నిన్ను సదా భావించుచు నున్నా నిట నేను
నన్ను సదా మన్నించుచు నున్నా విదె నీవు
నిన్ను సదా నేను నమ్మి యున్నాను గావున
నన్ను సదా రక్షించుచు నున్నావు నిజము


చాలును రాముని నామము చాలను


చాలును రాముని నామము చాలను
చక్కని యింద్రియ సంపద
మేలుగ నదియే కలిగిన మోక్షము
మిక్కిలి సులభము కావున

నాలుక మీదను రాముని నామము
నడచుచు నుండిన చాలును
చాలును పామరవాక్యము లాడని
చక్కని నాలుక చాలును

మేలుగ రాముని నామము మనసున
మెదలుచు నుండిన చాలును
చాలును దుశ్చింతనలను చేయని
చక్కని మనసే చాలును

రెండు కర్ణముల రాముని నామము
నిండుచు నుండిన చాలును
పండువగా హరినామమునే విన
వలచెడు చెవులే చాలును

చాలును కరములు రామభజనలో
తాళము చరచిన చాలును
చాలును రాముని సేవలు చేసే
చక్కని కరములు చాలును

చాలును రాముని భజనకు పరువిడు
చక్కని రెండు పాదములు
చాలును రాముని సేవకు పరుగిడు
చక్కని చరణము లుండిన


2, మే 2024, గురువారం

అతడేమొ శ్రీరాము డాయె - 2


అతడేమొ శ్రీరాము డాయె చూడు
డతని బాణమున కడ్డు లేదు

కం. పట్టము గట్టెద ననియును
నట్టడువుల కంప దండ్రి నాతికి దనకున్
గట్ట కుటీరము దమ్ముడు
పట్టపురా జట్లు రామభద్రుం డుండన్

కాకాసురుడు వచ్చినాడు వాడు
లోకమాతను గీరినాడు చూచి
చీకాకు కాకమ్ము పైన కినిసి
కాకిపై శరమంపినాడు మూడు
లోకమ్ము లాకాకి తిరిగి తుదకు
చేకొని రక్షించు మనుచు రామ
నే కోరి శరణమ్ము బ్రతికె కన్ను
గైకొని బాణమ్ము విడువ

దండకారణ్యంబు నందు దైత్యు
లుండి రొక పదునాల్గు వేలు వారి
కుండిరి నాయకుల్ ఖరుడు దూష
ణుండనగ గర్వాంధు లగుచు వారు
దండెత్తిరా రాము డపుడు కినిసి
దండిగా బాణముల్ బరపి వేగ
చెండాడ రామబాణముల వలన
దండకయు నిర్దైత్య మాయె

అతడేమొ శ్రీరాము డాయె - 1

అతడేమొ శ్రీరాము డాయె చూడు
డతని బాణమున కడ్డు లేదు

కం. ధరపై దశరథసుతుడై
హరి యుండగ యాగరక్షణార్ధము కడు సం
బరమున విశ్వామిత్రుడు
బిరబిర గొనిపోవు నట్టి వేళ నడవిలో

తాటక పైకొనగ వచ్చె రాము
నాటంక పరుచగ జూచె జూచి
నాటించు బాణమ టంచు గురువు
సూటిగా రెట్టించి నంత శరము
నాటించె రఘువీరు డపుడు దాని
యాటోప మణగారె నంత నీవు
మేటి ధానుష్కుడ వనుచు రాము
ధాటిని శ్లాఘించె గురువు

కం. మునియాగము మొదలాయెను
వనజాక్షుడు కాచుచుండె బహువేడుకతో
ఘనుడగు తమ్ముడు లక్ష్మణు
డును తోడుగ నిలువ నంత నోర్వని దుష్టుల్

మునియాగమును చెఱుపగాను వచ్చి
దనుజు లల్లరి చేయగాను రాము
డనలాస్త్రమును వేయగాను ఒక్క
దనుజు డాయెను బూది గాను రాము
డనిలాస్త్రమును వేయగాను ఒక్క
దనుజుడు కడు దవ్వుగాను పోయి
వనధిని వడి కూలగాను మునియు
వనజాక్షు దీవించె తాను

కం. పిమ్మట రాముడు లక్ష్మణు
డమ్ముని గొనిపోవ మిథిల కరుగన్ శివచా
పమ్మును గని యెక్కిడగా
నమ్మునివరు డనుమతింప నతిసులభముగా

శివచాప మల్లన విరిచి రాము
డవనీసుతను పెండ్లియాడ కనలి
శివుని శిష్యుడు పరశురాము డపుడు
కవల చాపము విష్ణుధనువు జూపి
రవికులేశుని దాల్చు మనగ నెత్తి
సవరించి బాణంబు నతని దర్ప
మవలీలగా నణచి నిలచె పొగడి
భవుని శిష్యుడు వెడలిపోయె

... సశేషం