25, మే 2024, శనివారం

నిద్ర

గతరాత్రి నాకు నిద్రపట్టలేదు.

గతరాత్రి నేను నిద్రపోలేదు.


ఈరెండు వాక్యాలు చెప్పే విషయమూ ఒకటే కదా అనిపిస్తుంది.


కానీ రెండూ వేరువేరు భావాలను వ్యక్తీకరించ వచ్చును.


నిద్రపట్టలేదూ అంటే నిద్రపోవటం కోసం ప్రయత్నం చేసినా ఫలించలేదూ ఆని అర్థం వస్తుంది.


నేను నిద్రపోలేదంటే అదేదో నా యిష్టప్రకారం జరిగి ఉండవచ్చును కదా అని అర్థం తీయవచ్చు.


నిద్రపట్టలేదు. నిద్రపోలేదు.. అని రెండు మాటలనూ చెప్పినపుడు కార్యకారణ సంబంధం తోచవచ్చును.


సరే అలాగే కా‌‌ర్యకారణ సంబంధం ఖరారు చేసుకుందాం.


నా నిద్రకు సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. 


మొట్టమొదటి నియమం ఏమిటంటే రాత్రి పూట బాగా ప్రొద్దుపోయేదాకా మెలకువగా ఉండి అప్పుడు పడుకుంటానంటే ససేమిరా కుదరదు.


రెండవనియమం ఏమిటంటే నిదురమధ్యలో కాని పడక దిగవలసి వస్తే నిముషాల వ్యవధిలో మళ్ళా పడుకుని తీ‌రాలి. 


మూడవనియమం ఏమిటంటే పగలు నిద్రపోదామంటే కుదరనే కుదరదు.


ఈనియమాలకు తోడు నాకు మరీ ఒళ్ళుతెలియనంత నిద్రపట్టదు. నేను నిద్ర పోతున్నపుడు సమీపంగా వచ్చి ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నా అలికిడి చేసినా నాకు మెలకువ వచ్చేస్తుంది.


ఈమధ్య కాలం వరకూ ఇంత సుకుమారమైన నిద్రతో బాగానే పెట్టుకొని వస్తూ ఉన్నాను.


ఇప్ఫుడు రెండు కారణాలు నా సుకుమారనిద్రా విలాసాన్ని సవాలు చేస్తున్నాయి.


ఇంటిలో ఒక పేషంట్ ఉన్నపుడు కుటుంబ సభ్యులకు ఆపేషంట్ ఆలనాపాలనా చూసుకోవటం కోసం వ్యగ్రత ఏర్పడుతుంది. పరిస్థితిని బట్టి ఒక్కొకసా‌రి నిద్రలకూ ఇబ్బందులు రావచ్చును. కుటుంబసభ్యులు వంతులవారీగా అని కాకపోయినా వీలును బట్టి సమయానికి ఎవరో ఒకరు పేషంటుకు సహాయం ఛేస్తు ఉంటారు.


కానీ, ఇంటిలో ఉన్నది ఆపేషంట్ కాక మరొకరు మాత్రమే ఐతే ఆ రెండవ మనిషికి ఊపిరిసలపక పోవచ్చును.


ప్రస్తుతం నాపరిస్థితి అదే. ఇంట్లో ఉన్నది నేనూ మాశ్రీమతి శారదా ఇద్దరమే.


తను ESRD పేషంట్.


ఈ ESRD అంటే end stage renal disease అన్నదానికి పొట్టిమాట.


తనకు వారానికి మూడు పర్యాయాలు డయాలసిస్ చేయించవలసి ఉంటుంది. 


నిజంగా ఈ డయాలసిస్ జీవితం ఒక నరకం. ఎన్నో ఇబ్బందులూ బాధలూ ఓర్చుకుంటూ డయాలసిస్ పేషంట్ల జీవితం సాగుతూ ఉంటుంది.


గాలిలో దీపాలు వీళ్ళప్రాణాలు.


ఇంచుమించు ఐదేళ్ళనుండీ తను కుకట్ పల్లి రామ్ దేవ్ ఆస్పత్రిలో జైన్ ట్రష్ట్ వారి సెంటర్లో డయాలసిస్ చేయించుకుంటోంది.


మాలాగే ఇంకా ఎందరో అక్కడికి డయాలసిస్ కోసం వస్తూ ఉంటారు.


ఒక్కొక్కసారి కొందరు చిన్నపిల్లలు డయాలసిస్ కోసం వస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది.


సెంటర్లో తోటి డయాలసిస్ పేషంట్లతో పరిచయాలూ స్నేహాలూ కలుగుతూ ఉంటాయి.


అటువంటి స్నేహితులు హఠాత్తుగా మాయం ఐపోతూ ఉంటారు. మనస్సులకు గ్లాని కలుగుతూ ఉంటుంది.


ఎప్పడు మనవంతు వస్తుందో ఆని తరచుగా అనిపిస్తుంది.


ఈ దిగులు చాలదా నాకు నిద్రపట్టకుండా చేయటానికి చెప్పండి.


అదీ కాక తనకు ఇంట్లో ఆసరాగా ఉన్నది నేనొకడినే.


ఈ కిడ్నీవ్యాధి ఉన్నవాళ్ళకు చాలా సపోర్ట్ అవసరం దివారాత్రాలూను. 


ఈవ్యాధికి దారితీసిన మధుమేహం రక్తపుపోటులను సముదాయించటానికి చాలా శ్రమ అవసరం. 


తనకు ఎప్పుడూ ఏదో ఒక సహాయం అవసరం అవుతూనే ఉంటుంది. రాత్రి అని వి‌రామం ఉండదు.


అప్పుడప్పుడు ఉన్నఫళంగా అర్ధరాత్రి అపరాత్రి అనక తీసుకొనిపోయి ఎమర్జెన్సీ  వార్డుకు చేర్చవలసి ఉంటుంది.


అందుచేత నాకు నిద్రపోవటానికి కుదరక పోవటమే కాదు, నిద్రపోవాలంటే కూడా భయమే.


ఏ అర్ధరాత్రి వేళనో నేను నిదురలో ఉండగా తనకు సుగర్ డౌన్ కావటం జరిగితే ఎంత ప్రమాదం?


అందుచేత శారద ప్రశాంతంగా పడుకొని నిదురపోతున్నా సరే నేను మెలకువగానే ఉంటున్నాను.


ఇలా నిద్రను వదిలి వేస్తున్న పక్షంలో అలసట రాదా జబ్బుచేయదా అని సందేహం వస్తుంది కదా.


నాకూ అదే సందేహం. కాని దానికి నాకు ఒక సమాధానం ఉంది.


భగవంతుడు శ్రీరామచంద్రుడు చాలా కరుణామయుడు.


నాకు ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఆయనకు ఎప్పుడో తెలుసును కదా.


అందుకని తన దివ్యనామాన్ని నాకు అనుగ్రహించాడు.


మొదట్లో అప్పడప్పుడూ రామనామభజనానందం ఆనుభవిస్తూ వచ్చిన నారసన క్రమంగా దివారాత్రాల మధ్య బేధం ఎంచక నిత్యం అదే ఆనందంలో మునిగి ఉండసాగింది.


అందుచేత రాత్రులు ఇత‌ర లౌకికక్రియాకలాపాలు అట్టే ఉండవు కాబట్టి మరింత జోరుగా రామనామం నడుస్తూ ఉంటుంది.


ఇది నాప్రజ్ఞతో నేను ఏదో సాధించినది కాదు. రాముడు ఏర్పాటు చేసినదే.


యోగక్షేమం వహామ్యహం అన్నాడంటే భగవానుడు అదేదో తమాషాగా అన్నమాట కాదు కదా. పుట్టి బుధ్ధెరిగిన నాటినుండీ తననే నమ్ముకొన్న నాబాధ్యత తనదే కదా.


రామనామం నడుస్తూ ఉంటే అలసట ఉండదు. దానికి నేనే నిదర్శనం.


భగవద్గీతలో


యా నిశా సర్వభూతానాం

తస్యాం జాగర్తి సంయమీ 

యస్యాం జాగ్రతి భూతాని

సా నిశా పశ్యతో మునేః 


అని ఉంది చూడండి. అలాగు ప్రపంచంలో అందరూ నిదురపోయే రాత్రి సమయాల్లో నేను ఇంచక్కా రామస్మరణ చేసుకుంటూ ఉంటా నన్నమాట.


ఇదే బాగుంది.


అందుచేత సకారణంగానే నాకు నిద్రపట్టనూ లేదు. నేను నిదు‌రపోనూ లేదు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.