నాకు ఈ మే 6వ తారీఖుతో 72 సంవత్సరాలు నిండాయి.
ఇంక నాకు ఎంత ఆయుర్దాయం ఉన్నా అది నాదృష్టిలో ఒక బోనస్ లాంటిది అనుకుంటున్నాను.
ఇప్పుడు నాకు ఇంక వ్యక్తిగతమైన ఆశలూ ఆశయాలూ ఏమీ లేవు.
ఏది చేసినా రాముడి పేరు మీదనే చేయటం.
రామాంకితంగా నాకు సాధ్యమైనంత సాహిత్యాన్ని నేను సృజిస్తున్నాను.
దానితో ఈ లౌకిక జగత్తుకు నిమిత్తం లేకపోవచ్చును.
ఒకవేళ ఉన్నా కొంచెం ఉండే అవకాశం లేదనను.
ఇప్పుడు నేను వ్రాస్తున్నదంతా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు చదవాలనీ ఆదరించాలనీ ఆశించటం పేరాశ అని తెలుసు.
ఐనా రాముడు తలచుకుంటే అద్భుతాలు జరుగుతాయి.
జరుగకపోయినా ఇబ్బంది లేదు.
నేను మళ్ళీ వచ్చి ఇంతకన్నా బాగా చేయాలని రాముడి తాత్పర్యం అని అర్ధం చేసుకుంటాను.
లేదా నేను మళ్ళి వచ్చి స్వయంగా ఆసాహిత్యాన్ని వెలుగులోనికి తీసుకొని రావాలని కూడా రాముడి తాత్పర్యం కావచ్చును.
ఏది ఏమైనా అంటే ఈప్రపంచం కోసం ఐనా, నాకోసం ఐనా ఈ సాహిత్యాన్ని పదిలపరచవలసి ఉంది.
ఆపనిలోనే ఉన్నాను.
శ్రేయోభిలాషులు కొందరు పుస్తకాలుగా ముద్రించమని కొన్నాళ్ళుగా సూచిస్తున్నారు. వారిలో కొందరు వత్తిడి చేస్తున్నారు కూడా. కాని పుస్తక ముద్రణ అంటే వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. ముఖ్యంగా తెలుగువాళ్ళలో సాహిత్యపరమైన పుస్తకాలను కొని చదివే వారి సంఖ్య నమ్మశక్యం కానంత తక్కువ అని ఖరాఖండీగా చాలా కాలం నుండీ వింటూ ఉన్నాను.
నాకు పుస్తకాలను ముద్రించే స్తోమత ఉన్నది అనుకోను.
అదీ కాక నాసాహిత్యం చాలానే పుస్తకాలుగా వస్తుంది. అన్ని పుస్తకాలను ముద్రించేందుకు లక్షల మీద ఖర్చు అవుతుంది. అంతెక్కడ నుండి తెచ్చేది? ఆపుస్తకాలను ఎవరు కొంటారు. గుట్టలు గుట్టలుగా ఆపుస్తకాలన్నింటినీ ఇంటిలోనే పదిలంగా దాచుకోవటం వీలయ్యే పనీ కాదు, సమర్ధనీయమైన పనీ కాదు.
అసలు వీటిని DTP చేయించటానికే ఎంతో ఖర్చు అవుతుంది. అదే నాకు వీలు కాదు.
అందుచేత ఆ DTP ఏదో నేనే స్వయంగా చేసుకుంటాను. ఇబ్బంది లేదు.
చాలా కాలం పాటు ప్రింట్ బుక్ అన్నదే ఈబుక్ కూడా అనుకుంటున్నాను. అది తప్పు అని తెలిసింది.
ఈబుక్స్ చేయాలంటే అది వేరే కార్యక్రమం.
అదీ నేను స్వయంగా చేసుకుంటాను.
ఇదంతా చేసి నా వ్రాతలన్నీ భద్రపరచుకోవాలని ఆశిస్తున్నాను.
ఇంతవరకూ వ్రాసినదీ ఇకముందు వ్రాయబోయేది ఏమన్నా ఉంటే అదీ ఇలా పుస్తక రూపంలోనే ఎక్కడో అక్కడ అందరికీ అందుబాటులో ఉండేలా పదిలపరచాలి. కాబట్టి ఆపని మీద శ్రధ్ధ పెడుతున్నాను.
నేను కాస్త బధ్ధకస్తుణ్ణి.
కాని బధ్ధకించి రేపో మాపో చేదాం అనుకుందుకు వీలులేదు.
ఇప్పుడు బోనస్ వయస్సులోనికి వచ్చేసాను కదా. ఇక బధ్ధకానికి తావు లేదు.
ఇది కూడా ఒక రామకార్యమే కాబట్టి దీని మీద శ్రధ్ధపెట్టక తప్పదు.
ఇది రామకార్యం ఎల్లాగు అవుతుందీ, ఇది నీ స్వకార్యం కదా అని ఎవరన్నా అభిప్రాయ పడవచ్చును. లేదా ముఖం మీదే అనవచ్చును, అలా ఆలోచించే వారికి ఒక నమస్కారం. వాదన చేయను.
రిప్లయితొలగించండి''అరవైకే ముసలిటండీ. కొంచం పొడిదగ్గే కాగట్టండి.''
మీరే అలా అనుకుంటే మమ్మల్ని కర్చు రాస్సినట్టేనా :)
అద్భుతాలగురించి ఆసించద్దు. పుస్తకాల ముద్రణ అంటే సొమ్ముతో కూడినది. చేతులు కాల్చుకున్నవారె ఎక్కువ. ఆ పై మీచిత్తం, ఇది ఉబోస. వారి సొమ్ముతో వారు వేయించుకుంటామంటే ఆలోచించుకోండి. డి.టి.పి మీచేతిలో పని గనక చేసుకోండి. నిత్య వ్యవహారం నడుస్తున్నట్టు లేదు :) లోకులు కాకులు, వినకండి.