18, నవంబర్ 2013, సోమవారం

వంకాయ ప్రశస్తి.

కొత్త వెబ్ పత్రిక   సృజన  ఆవిర్భవించింది.  దానికి సుస్వాగతం.

అందులో లాస్యగారు గుత్తి వంకాయ కూర చేయటం గురించి వ్రాసారు  ఘమఘమలు  అని.
వంట గురించి నేనేం‌ వ్రాయగలను గాని, వంకాయ గురించైతే కొంచెం వ్రాయాలని అనుకుంటున్నాను.

ప్రసిధ్ధ రచయిత్రి, విదుషీమణి స్వర్గీయ  శ్రీమతి మాలతీచందూర్‌గారు బోలెడు మంచి సాహిత్యంతో పాటు, వంటలు-పిండి వంటలు అన్న పుస్తకం కూడా వ్రాసారు.  అదే ఎక్కువగా అమ్ముడు పోయింది అనుకుంటాను, ఆవిడ పుస్తకాల్లో.  అందులో వంకాయను గురించి మాలతమ్మగారు,  ఈ వంకాయను ఒక రోజున వండినట్లు తిరిగి మరొక రోజున వండుకోకుండా నెలకు ముఫై రకాలుగానూ చేసుకోవటానికి వీలున్న కూర అన్నారు.

అంత గొప్ప కూర కాబట్టే దానిమీద ఒక చాటు పద్యం వెలసి బహుప్రచారం‌ పొందింది కూడా.

కం. వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే

అని.

ఈ వంకాయమీద ఎవరూ ఒక దండకం వ్రాసినట్లు కనబడదు.  కాఫీమీద ఒక ప్రచారంలో ఉన్న దండకం ఉంది కాని.

ఐనా వంకాయ పాటలపల్లకీ ఎక్కింది.  బసవరాజు అప్పారావుగారి  ఒక పాటలో

గుత్తి వంకాయ కూరోయి బావా!
కోరీ వండినానోయి బావా!

అని వస్తుంది.  ఈ‌ పాటని స్వర్గీయ బందా కనకలింగేశ్వరరావు గా అద్భుతంగా గానం చేసే వారట. శ్రీబందావారి గురించి   ఇక్కడ చదవండి.

ఆ పాట యొక్క పూర్తి పాఠం  ఇక్కడ  చూడండి.

తెలుగుసామెతల్లోకి కూడా వంకాయ చోటూ చేసుకుంది.  కొన్నది వంకాయ కొసరింది గుమ్మడికాయ అని ఒక సామెత మరి.  వంకాయ దొంగిలించిన వాడు టెంకాయకు రాడా అని మరొక సామెత. ఇంకా మరేమన్నా వంకాయ సామెతలున్నాయేమో చూడాలి.

తెలుగువారిలో వంకాయల అన్న ఇంటిపేరు  గలవా రున్నారు.  వారిలో వంకాయల సత్యనారాయణ గారని ఒకరు సినిమా నటులు. వారి గురించి ఇక్కడ  చూడండి.

రాజమండ్రిలో వంకాయలవారి వీధి కూడా ఉంది.  ఒక సారి ఏదో బస్సులో వెళుతూ చూసాను!

ఇంత గొప్ప వంకాయలో పోషక విలువలు ఎన్నున్నాయో  ఇక్కడ    చూడండి. నిజానిజాలు నాకూ‌తెలియవు.  పోషకవిలువల మాట అటుంచి, వంకాయ రుచి మరి దేనికి వస్తుంది చెప్పండి?

వంకాయలో రుచీ,పోషకాల మాటలకేం గాని వంకాయ మంచి  ఔషధగుణాలు కలది అన్నది ఋజువైన సత్యం.  ఆసక్తి ఉంటే ఆ వివరాలు  ఇక్కడ చదవండి.

ఏమిటో నండీ వంకాయగురించి తెగ  వివరించేస్తున్నాను.  అతి ఐపోతున్నట్లుంది. ఇంక సెలవు.