17, జులై 2015, శుక్రవారం

రామకృపాధార ఒకటి నా మీద కురిసెను




రామకృపాధార ఒకటి
నా మీద కురిసెను
ఆ మధుర సుధావృష్టి
నా మనసు తడిసెను

అంతులేని ప్రయాణము
చింతలతో నరకము
ఎంత తిరిగినా తెలియ ద
చింత్యమైన గమ్యము
సుంత విశ్రాంతి గొనే
టంత భాగ్య మెక్కడిది
పంతమేల రామ యొ
క్కింత సాయపడమంటే

ఒక నల్లని మేఘమై
ఒక చల్లని గాలియై
ఒక హాయగు స్పర్శయై
ఒక కమ్మని తావియై
ఒక సుమధుర గర్జయై
సకలతాప మర్దనియై
ఒక లీలను నను ముంచుచు
వికసించెను విభుని దయ

ఇది నాకు చాలు గదా ఈ జన్మకు
ముదితాత్ముడ నైతి రామభూవరు కృపకు
విదితమాయె ఆ మబ్బు వెంబడి పోయి
సదయుని గేహమ్ము చేరజాలుదు ననుచు
అదిగదిగో కదలు చున్నదా నల్లమబ్బు
కదలిపోవు చుంటి రామ కారుణ్యవృష్టి
పదే పదే హాసశంపాలతల వెలుగుల
నిదే దారిచూపుచుండె నీశ్వరుడు నాకు