నీమముగా నున్నదయా రామచంద్రా
నీమహిమలు వర్ణింపగ రామచంద్రా నాడు
సామీరికి శివున కొప్పె రామచంద్రా
నీమహిమలు వర్ణింపగ రామచంద్రా నాడు
వామలూరుజునకు చెల్లె రామచంద్రా
నామీదను దయజూపుము రామచంద్రా యెఱుక
యేమాత్రము లేని వాడ రామచంద్రా
నీమీదే యచంచలము రామచంద్రా భక్తి
ఆమాత్రమె నాహర్హత రామచంద్రా
పామరుండ నైన నాకు రామచంద్రా నీదు
నామ మొకటె దిక్కు సుమా రామచంద్రా
కామితముల నిచ్చు నట్టి రామచంద్రా కోర
నేమున్నది ముక్తి దక్క రామచంద్రా