20, జూన్ 2024, గురువారం

నీనామ మున్నది

నీనామ మున్నది నాజిహ్వ యున్నది

    దానికి దీనికి జతకుదిరె

దాని మధురిమకు దీనికి తహతహ

    దీనిపై నాడ దానికి తొందర


పవలని లేదే రేయని లేదే

     భళిభళి రెండిటి ముచ్చటలు

అవిరళముగనన అతిశయముగనన

     ఆరెండింటికి గల చెలిమి

అవినాభావముగా కొనసాగుచు

      నతిముచ్చట గొలుపును చూడ

అవురా యిది బహుజన్మల బంధమె

      యనిపించుగా రఘురామ


స్థిరసుఖవాసము గొని నీనామము

      చిందులు త్రొక్కగ నాలుకపై

సురుచిరమగునీ నామపు కలిమికి

      మురియుచు పాడును నాలుకయు

పరులముందు బాగుండదు పొమ్మను

     భావన రెండింటికి లేదు

అరయగ నిదియే పరమానందం

      బనిపించునుగా రఘురామ