మాయవేసిన వేషముచే మనిషినైతి నేను
మాయవేషము వేసి నీవు మనిషి వైనావు
నీమాయావిలాసమిటు నిగిడించిన సృష్టిలో
ఈమానవుడొకడు పొడమె స్వామి నీ యాటకై
ఏమో ఈయాట యెపుడు భూమిని మొదలాయె
నీమాయ కే యెఱుక నీకే యెఱుక
ఆటను నడిపించువాడ మేటి యాటగాడ
ఆట దారితప్పువేళ ఆటలోన నీవే
సూటిగాను ప్రవేశించి చొక్కమైన తీరు
నాటించియె పోవుదువో నారాయణా
భవతారకరాముడవై ప్రభవించిన నిన్ను
పవలురేలు కొలుచుకొనుచు పాడెదనిట నేను
వివిధమైన తనువులెత్తి వేడుకతో నిటుల
భువిని నీదు నాటకమున పొలుపుగా నటింతు