30, సెప్టెంబర్ 2025, మంగళవారం

రామనామము

రామనామము చేయలేనిది భూమి నేదియు లేదురా

రామనామము నోటనుండిన రాని దేదియు‌ లేదురా


కామవైరికి ప్రీతిపాత్రము రామనామము రామనామము 

భూమికన్యకు ప్రాణమైనది రామనామము రామనామము


పామరత్వము బాపు మంత్రము రామనామము రామనామము

తామసత్వము నణచు మంత్రము రామనామము రామనామము


రాజపూజ్యత కలుగజేయును రామనామము రామనామము

రాజపదవిని కట్టబెట్టును రామనామము రామనామము


రాతినైనను నాతిజేయును రామనామము రామనామము

కోతినైనను బ్రహ్మజేయును రామనామము రామనామము


లక్షణంబగు బుధ్ధి నిచ్చును రామనామము రామనామము

రక్ష ననిశము కలుగజేయును రామనామము రామనామము


స్వామికరుణకు పాత్రు జేయును రామనామము రామనామము

ప్రేమమీరగ మోక్షమిచ్చును రామనామము రామనామము



ఉదయవేళ

ఉదయవేళ నిన్ను పొగడి నొకమారు మరల పొగడి
ముదమున నటు పొగడ నిటు నిదురవేళాయెరా 

నిదురలో మునిగితినా నీ నామ మపుడు నాదు

పెదవులపై నిరంతరము కదలాడుట మానునో

అది సమ్మత మెటులగునని యందు నేమందువురా 

మదినేలెడు హరి నన్ను నిదుర నైన వదలకురా


నిదురలో నాతో నీవు నిలువ నాటపాటలతో

ముదమారగ నిన్ను నేను పొగడచుండు స్వప్నములు

మదిని నింప సంతసము మంచివాడ రాముడా

ఉదయవేళ సమీపింప నిదిగో మేల్కాంచితి


సదయ నిరంతరము నిన్ను సన్నుతించుటయె గాని

మదిని తోచ దింకొక్కటి మంచికార్య మనుచు నాకు

వదలక నను బ్రోచు రామ వదలక నిను పొగడెదరా

ముదమున నను వినవేడెద మోక్ష మిమ్ము చాలు నయ్య



25, సెప్టెంబర్ 2025, గురువారం

కానివాడ నైతినా

కానివాడ నైతినా కరుణాసింధో పనికి
రానివాడ నైతినా ప్రాణబంధో

నిన్ను గాక వేరెవరిని నేను పొగడకున్నను 
నిన్ను గాక నన్యునొకని నేను కొలువకున్నను
నిన్ను గాక మది నొక్కని నేను తలపకున్నను 
అన్నన్నా రామచంద్ర ఆహా యీనాటి కన

భవతారక మనుచు పేరుబడసిన నీ నామమునే
పవలురేలు పదేపదే పలుకుచు నేనున్నను
కువలయమున నీ నామమపు గొప్ప టముకువేయుచును
దివారాత్రంబులు కీర్తించుచు నిల నున్నను

అన్యమెరుగ నట్టి వాడ నాదరించవేమిరా
అన్యాయపు కాఠిన్యము హరి మానవేలరా
అన్యునిగా చూచుట కేమంత తప్పు చేసితిరా
ధన్యునిగా చేయవేల దయామయా నీదయతో

21, సెప్టెంబర్ 2025, ఆదివారం

నందనందన

వందనములు వందనములు నందనందన న
న్నెందుల కేడ్పింతువయ్య నందనందన

పొందితిరా కష్టములను నందనందన నేను
పొందితిరా వేదనలను నందనందన
పొందితిరా చెడుగెంతో నందనందన నీకు
వందనములు కావు మింక నందనందన

పొందితినా సంపదలను నందనందన నేను
పొందితినా భోగములను నందనందన
పొందితినా గర్వములను నందనందన నీకు
వందనములు కావు మింక నందనందన

ఉందువు శ్రీరాముడవై నందనందన నాదు
డెందంబున నెపుడు నీవు నందనందన
వందనములు రాముడందు నందనందన కృష్ణు
డందు నిన్ను కావు మింక నందనందన



ఇంకచాలు మాధవా

మనసు విరిగిపోయెరా మాధవా యీ
మనుజజన్మ మింకచాలు మాధవా

విలువలేదు నామాటకు వేడుకేమిరా సుంత
విలువలేదు నాచేతకు వేడుకేమిరా
విలువలేదు నాబ్రతుకుకు వేడుకేమిరా యింక
పిలిపించుకొనర నిన్ను వేడుకొందురా

బ్రతికితి నొకబ్రతుకునే భగవంతుడా అట్టి
బ్రతుకు శిధిలమాయెరా భగవంతుడా
బ్రతుకలేను దీనుడనై భగవంతుడా ఇంక
బ్రతుకును చాలించనిమ్ము భగవంతుడా

రానీయర నీకరుణను రామచంద్రుడా యింక
రానీయర నీపిలుపును రామచంద్రుడా
రానీయర శాంతస్థితి రామచంద్రుడా యింక
రానీయకు మరల జన్మ రామచంద్రుడా


ఇందుకేనా?

ఇలపై న న్నుండమన్న దిందుకేనా
కలకాలము చింతలతో నలుగుటకేనా

కలసిరాని మనుషులతో గడుపుటకేనా
గొలుసుకట్టుకడగండ్ల గుడువనేనా
అలసిసొలసి తుదకు నేల కలయుటకేనా
విలువలేని బ్రతుకు బ్రతికి వీడుటకేనా

అగుపడని నిన్నుపిలచి యలయుటకేనా
జగతిని నిర్భాగ్యుడనై జావనేనా
పగలురేలు యంత్రమువలె బ్రతుకుటకేనా
తగని చెడ్డబ్రతుకు బ్రతికి తరలుటకేనా

నను దీనుని చేసి జనులు నవ్వగనేనా
ఇనకులేశ నిరాదరణ యిందుకేనా
వనజేక్షణ నిరాశతో బ్రతుకుటకేనా
నిను బొందని బ్రతుకు బ్రతికి నీల్గుటకేనా

20, సెప్టెంబర్ 2025, శనివారం

ఈశ్వరా

ఏవిచారమైన నా కెందు కీశ్వరా
నీవు నావాడవై నిలువ నీశ్వరా

ఏదైనా జరుగనీ యీశ్వరా రే

పేదైనా జరుగనీ యీశ్వరా యే

చేదైనా తీపైనా చింతలేదురా

నీదయే చాలని నిలచినానురా


ఎవరైనా పొగడనీ యీశ్వరా న

న్నెవరైనా తెగడనీ యీశ్వరా నా

కెవరున్నా లేకున్నా యేమి కాదురా

భువిని నీవాడనై పుట్టినానురా


ఈ తను వెన్నాళ్ళో యీశ్వరా రే

పేతనువున నుందునో యాశ్వరా నే

నే తనువున నున్న నేమి రాముడా

ప్రీతితో నిన్ను సేవించువాడరా


14, సెప్టెంబర్ 2025, ఆదివారం

పాహి పాహి

పాహి పాహి కృష్ణ మాం
పాహి కృష్ణ కృష్ణ 

పాహి నందనందన మాం
పాహి భక్తచందన

పాహి గోపవేషక మాం
పాహి దీనపోషక

పాహి గోగణప్రియ మాం
పాహి గోపికాప్రియ

పాహి ధర్మరక్షక మాం
పాహి లోకరక్షక

పాహి దైత్యనాశన మాం
పాహి కంసశాసన

పాహి దురితమోచన మాం
పాహి భవవిమోచన

9, సెప్టెంబర్ 2025, మంగళవారం

నీకేలా

శ్రీరఘురాముని కొలువక నన్యుల సేవించుపని నీకేలా
శ్రీరఘురాముడు నీవాడైతే చింతలు వంతలు నీకేలా

శ్రీరఘురాముని యిఛ్ఛయె జరుగు విచారము నడుమను నీకేలా
శ్రీరఘురాముడు శుభముల నిచ్చు నరే సందేహము నీకేలా
శ్రీరఘురాముడు సంపద లిచ్చు నరే దైన్యంబిక నీకేలా
శ్రీరఘురాముని రక్షణ కలుగ మరెవ్వరి భయమో నీకేలా

శ్రీరఘురాముడు నీవాడైతే రేపెటు లనుకొన నీకేలా
శ్రీరఘురాముడు చెంత నుండ సంసారచింతలవి నీకేలా
శ్రీరఘురాముని వాడవు యమపురి చేరెడు కష్టము నీకేలా
శ్రీరఘురాముని భక్తుడ వికపై ధారుణి బుట్టగ నీకేలా


3, సెప్టెంబర్ 2025, బుధవారం

ఈశ్వరా


ఈశ్వరా మన్నించవయ్యా యెఱుక నా కందించవయ్యా
శాశ్వతంబగు పదము నందు చక్కగా నను నిల్పవయ్యా

ఏది మంచో యేది చెడుగో యెవ్వ డెఱుగు నీశ్వరా
నీదయా లేశమున గాక నిక్కముగ సర్వేశ్వరా

ఏది యల్పం బేదనల్పం బెవ్వ డెఱుగు నీశ్వరా
నీదయా లేశమున గాక నిక్కముగ సర్వేశ్వరా

ఏది న్యాయం బేది కాదో యెవ్వ డెఱుగు నీశ్వరా
నీదయా లేశమున గాక నిక్కముగ సర్వేశ్వరా

ఏది ధర్మం బేదధర్మం బెవ్వ డెఱుగు నీశ్వరా
నీదయా లేశమున గాక నిక్కముగ సర్వేశ్వరా

ఏది సత్య మేదసత్య మెవ్వ డెఱుగు నీశ్వరా
నీదయా లేశమున గాక నిక్కముగ సర్వేశ్వరా

ఏది నాదో యేది కాదో యెవ్వ డెఱుగు నీశ్వరా
నీదయా లేశమున గాక నిక్కముగ సర్వేశ్వరా

ఎవడు తనవా డెవడు పైవా డెవ్వ డెఱుగు నీశ్వరా
భువిని నీదయ వలన గాక పోల్చ తరమా యీశ్వరా

ఎవడు సజ్జను డెవడు దుర్జను డెవ్వ డెఱుగు నీశ్వరా
భువిని నీదయ వలన గాక పోల్చ తరమా యీశ్వరా

ఎవడు పండితు డెవడు పామరు డెవ్వ డెఱుగు నీశ్వరా
భువిని నీదయ వలన గాక పోల్చ తరమా యీశ్వరా

ఎవడు జ్ఞానియొ యెవడు జడుడో యెవ్వ డెఱుగు నీశ్వరా
భువిని నీదయ వలన గాక పోల్చ తరమా యీశ్వరా

ఎవడు యోగియొ యెవడు రాగియొ యెవ్వ డెఱుగు నీశ్వరా
భువిని నీదయ వలన గాక పోల్చ తరమా యీశ్వరా

ఎవడు నిన్ను రామునిగ గుర్తించ నేర్చెడు నీశ్వరా
భువిని నీదయ వలన గాక  పోల్చ తరమా యీశ్వరా