25, సెప్టెంబర్ 2025, గురువారం

కానివాడ నైతినా

కానివాడ నైతినా కరుణాసింధో పనికి
రానివాడ నైతినా ప్రాణబంధో

నిన్ను గాక వేరెవరిని నేను పొగడకున్నను 
నిన్ను గాక నన్యునొకని నేను కొలువకున్నను
నిన్ను గాక మది నొక్కని నేను తలపకున్నను 
అన్నన్నా రామచంద్ర ఆహా యీనాటి కన

భవతారక మనుచు పేరుబడసిన నీ నామమునే
పవలురేలు పదేపదే పలుకుచు నేనున్నను
కువలయమున నీ నామమపు గొప్ప టముకువేయుచును
దివారాత్రంబులు కీర్తించుచు నిల నున్నను

అన్యమెరుగ నట్టి వాడ నాదరించవేమిరా
అన్యాయపు కాఠిన్యము హరి మానవేలరా
అన్యునిగా చూచుట కేమంత తప్పు చేసితిరా
ధన్యునిగా చేయవేల దయామయా నీదయతో

3 కామెంట్‌లు:

  1. బాగుంది. కానీ స్వతహాగా పద్య కవి కూడా అయిన మీరు అప్పుడప్పుడైనా పద్యాలు వ్రాయకపోవడం మా బోంట్లకు వెలితిగా ఉన్నది. కనుక రాముని మీదే కావచ్చు గాక, పద్య కవితకు కూడా ఇందు స్థానం కల్పింతురని ఆశంస.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యాలు కూడా వ్రాస్తూనే ఉన్నా నండీ. అవి సంకలనం చేస్తున్నాను ఒక పుస్తకంగా నో రెండు గానో. కాని మా శ్రీమతికే నాసమయం అంతా కేటాయించాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ ప్రయత్నం అంత సులువుగా నడవటం లేదు.

      (ఈసమయంలో మా శ్రీమతి శారద ఐసీయూలో ఉంది, ఈనాడు డయాలసిస్ మధ్యలో collapse కావటంతో CPR చేసి ఐసీయూలో ఉంచారు. నేను బయట వేచి ఉన్నాను.)

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.