21, సెప్టెంబర్ 2025, ఆదివారం

ఇందుకేనా?

ఇలపై న న్నుండమన్న దిందుకేనా
కలకాలము చింతలతో నలుగుటకేనా

కలసిరాని మనుషులతో గడుపుటకేనా
గొలుసుకట్టుకడగండ్ల గుడువనేనా
అలసిసొలసి తుదకు నేల కలయుటకేనా
విలువలేని బ్రతుకు బ్రతికి వీడుటకేనా

అగుపడని నిన్నుపిలచి యలయుటకేనా
జగతిని నిర్భాగ్యుడనై జావనేనా
పగలురేలు యంత్రమువలె బ్రతుకుటకేనా
తగని చెడ్డబ్రతుకు బ్రతికి తరలుటకేనా

నను దీనుని చేసి జనులు నవ్వగనేనా
ఇనకులేశ నిరాదరణ యిందుకేనా
వనజేక్షణ నిరాశతో బ్రతుకుటకేనా
నిను బొందని బ్రతుకు బ్రతికి నీల్గుటకేనా

1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.