31, మే 2025, శనివారం

హరినామము

హరినామము పలికితివా 

    యానందము కలుగునుగా

మరి మరి యన్యములు తలచ 

    మనసు మలినమగునుగా


నిరంతరము హరినామము

    నీనోటను పలుకనీ

పరమాత్ముని సుందరరూ

    పము నెదలో నిండనీ

హరేరామ హరేకృష్ణ

    యనుచు బ్రతుకు పండనీ

మరల మరల ధరను భవము

    మాటయె లేకుండనీ


ధనకనకము లిచ్చు సుఖము

    మనకెందుకురా పోనీ

వనితలతో తనయులతో

    బంధసమితులె పోనీ

తనువు పైన బ్రతుకు పైన

    తమకమేలరా పోనీ

మనకు రామనామ మొకటె

    కనుగొన సర్వము కానీ


శ్రీరాముని భక్తులతో

    చేరికయే కలుగనీ

శ్రీరాముని నామముతో

    చింతలన్నియు తీరనీ

శ్రీరాముని కరుణవలన

    ఆరాటము లణగనీ

శ్రీరాముడు భవములుడిపి

    చేరదీసి ప్రోవనీ

జయజయహే

శ్రీకర శుభకర జయజయహే 
   లోకేశ్వర హరి జయజయహే
సాకేతాధిప జయజయహే 
    సర్వమనోహర జయజయహే

శ్రీరఘునాయక సీతానాయక 

    చింతితదాయక జయజయహే

కారణకారణ భవభయవారణ

    కారణకరుణా జయజయహే


రావణాదిఘనరాక్షసనాయక

    ప్రాణాపహరణ జయజయహే

భావితయోగిహృదంబుజసంస్థిత

    పాదసరోరుహ జయజయహే


నారాయణ హరి నారదాదిముని

    నాయకసన్నుత జయజయహే

వారిజాక్ష సంసారమహార్ణవ

    తారణకారణ జయజయహే


రామచంద్ర బహురమ్యగుణార్ణవ

    రాజీవానన జయజయహే

కామవైరిజలజాసననుత శ

    క్రాదికవందిత జయజయహే

20, మే 2025, మంగళవారం

మధురభాషల చిన్ని కృష్ణ

మధురభాషల చిన్ని కృష్ణ నీవు

    మథురకు పోవద్దు కృష్ణ

మథురలో పనియుందే భామా నేను

    మథురకు పోవలె భామా


మదురలో కంసుడు కృష్ణా నిన్ను

     మననిచ్చునా వద్దు కృష్ణా

వధియింతు కంసుని భామా నేను

    మథురకు పోవలె భామా


కథలుకథలుగ వింటి కృష్ణా వాడు

     కఠినాత్ముడట చిన్ని కృష్ణా

వ్యథలకు మూలము భామా వాని

      కథ తేల్చ బోవలె భామా


ఆధముడు వానితో కృష్ణా నీవు

       ఆటలాడుట యేల కృష్ణా

విధి శంకరులు సాక్షి భామా వాని

     విరిచివచ్చెద గొల్లభామా



14, మే 2025, బుధవారం

రామభక్తుడు

 
రామనామము మరువకుండును రామభక్తుడు శ్రీ
రామపాదము విడువకుండును రామభక్తుడు

రామునే పూజించుచుండును రామభక్తుడు శ్రీ
రామునే ధ్యానించుచుండును రామభక్తుడు
రామునే సేవించుచుండును రామభక్తుడు శ్రీ
రామునే ప్రేమించుచుండును రామభక్తుడు

రామునే నిగమముల జూచును రామభక్తుడు శ్రీ
రామునే యెల్లెడల జూచును రామభక్తుడు 
రాముడే పురుషోత్తముండను రామభక్తుడు శ్రీ
రాముడే పరదైవతంబను రామభక్తుడు శ్రీ

రాముడే తన జీవితంబను రామభక్తుడు శ్రీ
రాముడే తన ప్రాణమనుకొను రామభక్తుడు
రాముడే తన కాప్తుడనుకొను రామభక్తుడు శ్రీ
రాముడే తన సర్వమనుకొను రామభక్తుడు

6, మే 2025, మంగళవారం

శ్రీరఘురాముడు మావాడు

శ్రీరఘురాముడు మావాడు హరి 

    సీతారాముడు మావాడు

నీరజనయనుడు మావాడు హరి 

    నారాయణుడు మావాడు


పురాణపురుషుడు మావాడు హరి 

    పురుషోత్తముడు మావాడు

నరాధినాథుడు మావాడు హరి 

    సురాధినాథుదు మావాడు

పురహరవినుతుడు మావాడు హరి 

    కరుణానిలయుడు మావాడు 

సురేశశరణుడు మావాడు హరి 

    పరమేశ్వరుడు మావాడు


నిరుపమగుణనిధి మావాడు హరి 

    నిర్మలచరితుడు మావాడు

వరమునివినుతుడు మావాడు హరి 

    సురగణవినుతుడు మావాడు

సురారిదమనుడు మావాడు హరి 

    గరుడవాహనుడు మావాడు

పరమసుందరుడు మావాడు హరి 

    వరదాయకుడు మావాడు


ఇనకులతిలకుడు మావాడు హరి 

    యిందునిభాస్యుడు మావాడు

మునిజనకాముడు మావాడు హరి 

    మోక్షదాయకుడు మావాడు

ఘనపరాక్రముడు మావాడు హరి

    గజేంద్రవరదుడు మావాడు

జనపతికులపతి మావాడు హరి 

    జానకీపతి మావాడు


3, మే 2025, శనివారం

రాముడు

హరిగతిరగడ.
సకలసుగుణముల ప్రోవగు రాముడు
సకలసుజనహితకరుడగు రాముడు
సకలజగములకు ప్రభువగు రాముడు
సకలశుభంబుల నొసగెడు రాముడు
సకలాసురగణకాలుడు రాముడు
సకలసురార్చితచరణుడు రాముడు
సకలనిగమనుతవిభవుడు రాముడు
అకళంకపరబ్రహ్మము రాముడు
రవికులతికుండగు శ్రీరాముడు
కవలయనయనుండగు శ్రీరాముడు
కవిజనవినుతుండగు శ్రీరాముడు
అవనీతనయాపతి శ్రీరాముడు
భువనము లన్నియు నేలెడు రాముడు
భవసాగర మింకించెడు రాముడు 
పవనసుతార్చితపాదుడు రాముడు
శివనుతపావననాముడు రాముడు
చండకిరణకులప్రభవుడు రాముడు
ఖండితహరచాపుండగు రాముడు
దండితభార్గవరాముడు రాముడు
భండనపండితుడగు శ్రీరాముడు 
ఖండితరావణుడగు శ్రీరాముడు
అండజవాహనుడగు శ్రీరాముడు 
అండగభక్తుల కుండెడు రాముడు
దండిగ కృపగల దేవుడు రాముడు
కరుణారసవార్నిధియగు రాముడు
వరదాయకుడై యుండెడు రాముడు
సురగణకష్టవిరాముడు రాముడు
నరసురమునిగణవినుతుడు రాముడు
సురుచిరసుందరరూపుడు రాముడు
స్థిరమగు యశమును గలిగిన రాముడు
పరమపురుషుడై వరలెడు రాముడు
హరి యవతారము మన శ్రీరాముడు

గమనిక:

పైన చూపినవిధంగా నాలుగేసి గణాలతో కూడిన పాదప్రణాళికతో ఇది మధురగతి రగడ అవుతుంది. కాని అప్పుడు ప్రతిపాదంలోనూ మూడవగణం పైన యతిమైత్రిని పాటించవలసి ఉంటుంది. అలా చేయలేదు కాబట్టి మధురగతి అని చెప్పటం కుదరదు. కాని రెండేసి పాదాలను కలిపి ఏకపాదంగా లెక్కించుకుంటే మధురగతి కాస్తా హరిగతి అవుతుంది. అప్పుడు యతిమైత్రిని ఐదవగణం వద్ద పాటించాలి. అలాగే పాటించటం జరిగింది.

రగడలకు ప్రాస అవసరమా అన్నది ఒక చర్చనీయాంశం. ద్వితీయాక్షరప్రాసను ఐఛ్చికం చేసినప్పుడు మిగిలిన ఉపజాతిపద్యాలకు వలె ప్రాసయతికి అవకాశం తప్పక ఉంటుంది, ఇక్కడ నేను పూర్తిగా ప్రాసయతిని వాడాను. కాని అదే ప్రాసను కూడా పాటించాను. ఇందు వలన అందం ఏమీ చెడలేదు కాబట్టి ఇబ్బంది లేదు.

ఇకపోతే రగడ మొత్తం ఒకే అంత్యప్రాసను పాటించటం జరిగింది. అంత్యప్రాసను నియమంగా స్వీకరించటం ఆధునికమే. శ్రీనాథుడు కాశీఖండంలోని హరిగతిరగడలో అంత్యప్రాసను పాటించలేదు. ప్రస్తుత రగడలో పాదార్ధమూ పాదమూ ఒకే అంత్యప్రాసను కలిగి ఉండటమూ మొత్తం రగడ అంతే అదే అంత్యప్రాసతో నడవటమూ విశేషం.

జానకీనాథునకు

జానకీనాథునకు జయము జయము జయ మనరే
మానవేంద్రునకు జయమంగళ మనరే

కౌసల్యాతనయునకు కరుణాలవాలునకు
దాససంపోషకునకు ధర్మావతారునకు
వాసికెక్క రఘుకులము వసుధ నవతరించిన
శ్రీసతీరమణునకు చిన్మయాకారునకు

రావణాదికదైత్యప్రాణాపహారునకు
దేవముఖ్య వినుతునకు దివ్య ప్రభావునకు 
భావించ భక్తలోకపాలకుడై వెలసిన
శ్రీవరుడగు శౌరికి చిన్మయాకారునకు 

కాలస్వరూపునకు కమనీయరూపునకు
పాలితాఖిలభువనభాండునకు రామునకు
నీలమేఘదేహుడై నేల నవతరించిన
శ్రీలక్ష్మీవరునకు చిన్మయాకారునకు

2, మే 2025, శుక్రవారం

భవతరణోపాయమై

భవతరణోపాయమై వరలు నట్టి నామము
పవలు రేలు నన్నేలు భగవంతుని నామము 

హరుడు పొగడు నామము హరిదేవుని నామము 
సురలు పొగడు నామము శుభములిచ్చు నామము
సురుచిరమగు నామము పరమాత్ముని నామము
నిరుపమాన నామము నిఖిలవరద నామము

శివు డిచ్చిన నామము చింతనణచు నామము 
భవు డిచ్చిన నామము పావనమగు నామము 
కవులు పొగడు నామము కమ్మనైన నామము
నవమహిమల నామము నారాముని నామము

పుష్పవిలాసము


హరిగతి రగడ.
రాముని తోటను పూచిన పూవులు
    రాముని కొఱకై పూచిన పూవులు
రాముని భక్తులు తెచ్చిన పూవులు
    రాముని వద్దకు చేరినపూవులు
రామునికై వికసించిన పూవులు
    రాముని కర్చన చేసిన పూవులు
రాముని నామము తలచిన పూవులు
    రాముని పాదము చేరిన పూవులు
రాముని మెడలో మాలల పూవులు
    రాముని యెడదను సోకిన పూవులు
రాముని యందము పెంచిన పూవులు
    రాముని పత్నికి నచ్చిన పూవులు
రాముడు సతిపై జల్లిన పూవులు
    రాముడు సీతకు తురిమిన పూవులు
రాముని సేవను చేసిన పూవులు
    రాముని సేవను బ్రతికిన పూవులు
రాముడు మాజీవిత మను పూవులు
    రాముని పొంది తరించిన పూవులు
రామున కన్యము నెఱుగని పూవులు
    రాముని ప్రేమను పొందిన పూవులు

1, మే 2025, గురువారం

రామ రామ స్తుతి


రామ రామ రామ రామ
రామ రామ సీతారామ
రామ రామ రామ రామ
రామ రామ రాజారామ


రామ రామ రామ రామ
రామ రామ ఘనశ్యామ
రామ రామ రామ రామ
రామ రామ పరంధామ

రామ రామ రామ రామ
రామ సూర్యవంశ సోమ
రామ రామ రామ రామ
రామ యోగిహృదయధామ

రామ రామ రామ రామ
రామ రామ సార్వభౌమ
రామ రామ రామ రామ
రామ రామ ఖలవిరామ


రామ రామ రామ రామ

రామ రామ శుభదనామ

రామ రామ రామ రామ

రామ రామ మధురనామ

రామ రామ రామ రామ
రామ విబుధవినుతనామ
రామ రామ రామ రామ
రామ సకలశుభదనామ

రామ రామ రామ రామ
రామ సకలసుగుణధామ
రామ రామ రామ రామ
రామ సకలమౌనికామ

రామ రామ రామ రామ
రామ దనుజగణవిరామ
రామ రామ రామ రామ
రామ రామ విజయరామ

రామ రామ రామ రామ
రామ సమరభీమ రామ
రామ రామ రామ రామ
రామ రామ భవవిరామ