హరిగతిరగడ.
సకలసుగుణముల ప్రోవగు రాముడు
సకలసుజనహితకరుడగు రాముడు
సకలజగములకు ప్రభువగు రాముడు
సకలశుభంబుల నొసగెడు రాముడు
సకలాసురగణకాలుడు రాముడు
సకలసురార్చితచరణుడు రాముడు
సకలనిగమనుతవిభవుడు రాముడు
అకళంకపరబ్రహ్మము రాముడు
రవికులతికుండగు శ్రీరాముడు
కవలయనయనుండగు శ్రీరాముడు
కవిజనవినుతుండగు శ్రీరాముడు
అవనీతనయాపతి శ్రీరాముడు
భువనము లన్నియు నేలెడు రాముడు
భవసాగర మింకించెడు రాముడు
పవనసుతార్చితపాదుడు రాముడు
శివనుతపావననాముడు రాముడు
చండకిరణకులప్రభవుడు రాముడు
ఖండితహరచాపుండగు రాముడు
దండితభార్గవరాముడు రాముడు
భండనపండితుడగు శ్రీరాముడు
ఖండితరావణుడగు శ్రీరాముడు
అండజవాహనుడగు శ్రీరాముడు
అండగభక్తుల కుండెడు రాముడు
దండిగ కృపగల దేవుడు రాముడు
కరుణారసవార్నిధియగు రాముడు
వరదాయకుడై యుండెడు రాముడు
సురగణకష్టవిరాముడు రాముడు
నరసురమునిగణవినుతుడు రాముడు
సురుచిరసుందరరూపుడు రాముడు
స్థిరమగు యశమును గలిగిన రాముడు
పరమపురుషుడై వరలెడు రాముడు
హరి యవతారము మన శ్రీరాముడు
గమనిక:
పైన చూపినవిధంగా నాలుగేసి గణాలతో కూడిన పాదప్రణాళికతో ఇది మధురగతి రగడ అవుతుంది. కాని అప్పుడు ప్రతిపాదంలోనూ మూడవగణం పైన యతిమైత్రిని పాటించవలసి ఉంటుంది. అలా చేయలేదు కాబట్టి మధురగతి అని చెప్పటం కుదరదు. కాని రెండేసి పాదాలను కలిపి ఏకపాదంగా లెక్కించుకుంటే మధురగతి కాస్తా హరిగతి అవుతుంది. అప్పుడు యతిమైత్రిని ఐదవగణం వద్ద పాటించాలి. అలాగే పాటించటం జరిగింది.
రగడలకు ప్రాస అవసరమా అన్నది ఒక చర్చనీయాంశం. ద్వితీయాక్షరప్రాసను ఐఛ్చికం చేసినప్పుడు మిగిలిన ఉపజాతిపద్యాలకు వలె ప్రాసయతికి అవకాశం తప్పక ఉంటుంది, ఇక్కడ నేను పూర్తిగా ప్రాసయతిని వాడాను. కాని అదే ప్రాసను కూడా పాటించాను. ఇందు వలన అందం ఏమీ చెడలేదు కాబట్టి ఇబ్బంది లేదు.
ఇకపోతే రగడ మొత్తం ఒకే అంత్యప్రాసను పాటించటం జరిగింది. అంత్యప్రాసను నియమంగా స్వీకరించటం ఆధునికమే. శ్రీనాథుడు కాశీఖండంలోని హరిగతిరగడలో అంత్యప్రాసను పాటించలేదు. ప్రస్తుత రగడలో పాదార్ధమూ పాదమూ ఒకే అంత్యప్రాసను కలిగి ఉండటమూ మొత్తం రగడ అంతే అదే అంత్యప్రాసతో నడవటమూ విశేషం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.