24, మార్చి 2025, సోమవారం

నీనామమే రమ్యము

 

నీనామమే రమ్యము రామా నీపాదమే గమ్యము

నీనామమే దివ్యము రామా నీవే మాసర్వస్వము


నీనామమే మాకు నిఖిలార్ధసాధకము

నీనామమే మాకు కామజయ కారకము

నీనామమే భూమిపై నున్న యమృతము

నీనామమే మాకు నిజమైన యానందము


నీపాదమే కదా నిఖిలపాపాంతకము

నీపాదమే కదా  నిఖిలశాపాంతకము

నీపాదమే కదా  నిరవధిసుఖప్రదము

నీపాదమే కదా నిశ్చయముగ గమ్యము

15, మార్చి 2025, శనివారం

శతకోటి దండాలు

 

దైవరాయడ వైన శ్రీరాముడా నీకు

    దండాలు దండాలు శ్రీరాముడా


శతకోటి దండాలు శ్రీరాముడా నీకు

    సకలార్తినాశకుడ శ్రీరాముడా

శతకోటి దండాలు శ్రీరాముడా నీకు

     ప్రతి లేని వీరుడా శ్రీరాముడా

శతకోటి దండాలు శ్రీరాముడా నీకు

    చ్యుతిలేని కీర్తిగల శ్రీరాముడా

శతకోటి దండాలు శ్రీరాముడా నీకు

    కృతదనుజసంహరణ   శ్రీరాముడా


శతకోటి దండాలు శ్రీరాముడా నీకు

    ధృతదివ్యకోదండ శ్రీరాముడా

శతకోటి దండాలు శ్రీరాముడా నీకు

     సద్భక్తపరిపోష శ్రీరాముడా

శతకోటి దండాలు శ్రీరాముడా నీకు

     సకలమునిరాజనుత శ్రీరాముడా

శతకోటి దండాలు శ్రీరాముడా నీకు

    రతిరాజవైరినుత శ్రీరాముడా


శతకోటి దండాలు శ్రీరాముడా నీకు

    సకలపాపవినాశ శ్రీరాముడా

శతకోటి దండాలు శ్రీరాముడా నీకు

    సరిసాటివా రెవరు శ్రీరాముడా 

శతకోటి దండాలు శ్రీరాముడా మరల

     జన్మింపగోరమో శ్రీరాముడా

శతకోటి దండాలు శ్రీరాముడా నిన్ను

    శరణంబు వేడెదము శ్రీరాముడా 



చేతులెత్తి మ్రొక్కి


చేతులెత్తి మ్రొక్కి శ్రీరామచంద్రునకు

    చేయరే పూజ మీరిపుడు

ప్రీతితో సలుపరే శ్రీరామచంద్రునకు

    వివిధోపచారముల నిపుడు

సారసాక్షుడు మన శ్రీరామచంద్రునకు

     హారతుల నెత్తరే యిపుడు

ఆదరించెడు విభుడు శ్రీరామచంద్రునకు

    ఆరగింపులు చేయు డిపుడు

నృత్యగీతములతో శ్రీరామచంద్రునకు

     నేత్రోత్సవము చేయు డిపుడు

సద్భక్తులను ప్రోచు శ్రీరామచంద్రునకు

     సాష్టాంగములు చేయు డిపుడు

భవబంధముల ద్రెంచు శ్రీరామచంద్రునకు

     ప్రార్ధనలు చేయరే యిపుడు

జగదీశు డైనట్టి శ్రీరామచంద్రునకు

    సర్వస్వ మర్పించు డిపుడు

విన్నపంబులు మీరు శ్రీరామచంద్రునకు

     వినయంబుతో తెలుపు డిపుడు

మరల మరల మ్రొక్కి శ్రీరామచంద్రునకు

    మరలరే మీ యిండ్ల కిపుడు



14, మార్చి 2025, శుక్రవారం

జయజయ సీతారామా


రామా జయజయ శ్రీరఘురామా 

    రామా జయజయ సీతారామా


రామా కామితవరదా  పాపవి

    రామా జయజయ సీతారామా

రామా దశరథరామా రవికుల

    సోమా జయజయ సీతారామా 

రామా జితశతకామా మునిజన

    కామా జయజయ సీతారామా

రామా జలధరశ్యామా సద్గుణ

    ధామా జయజయ సీతారామా


రామా భండనభీమా దనుజవి

    రామా జయజయ సీతారామా

రామా సురగణమునిగణనుతశుభ

    నామా  జయజయ సీతారామా

రామా జగదభిరామా పావన

    నామా జయజయ సీతారామా

రామా కామారిప్రముఖార్చిత

    నామా జయజయ సీతారామా



13, మార్చి 2025, గురువారం

ఉన్నదిగా రామనామము


ఉన్నదిగా రామనామము ఓరయ్య మన

    కున్నదిగా రాముని దయయు

ఎన్నగ నింకేమి వలయు నన్నియు మన  

    కున్నటులే


సిరుల బడిసి నరులు పొందు చిత్రమైన సుఖము లన్ని

హరిదయామృతము కురియు నట్టి సుఖము ముందు సున్న


చిన్నచిన్న వడుగుదుమా సిగ్గువిడిచి మనము హరిని

అన్నన్నా యట్టివడిగి యల్పులమై పోవనేల


శ్రీరాముని కరుణ వలన చేకూరగ ముక్తి మనకు

కోరనేల మనము నేడు కొరగానివి పరమునకు



వెన్నుడ దాసుడ నీకు


వెన్నుడ దాసుడ నీకు వేరొకరికి కాదు

తిన్నగ నాహృదయము తెలుసుకోవయ్య


ఎన్నగ నాబత్తి యిది నిన్న మెన్నటిది కాదు

ఎన్నెన్ని జన్మలదో యెఱుకే లేదు

కన్నతండ్రి నీసేవకు కలిగిన దీతనువు

నిన్ను గాక వేరొకరిని నేడు చేరునా


ఎన్ని జన్మముల నెత్తి యింకను నిను సేవించ

నున్నవాడనో యది నీకే యెఱుక

కన్నతండ్రి నీదుకరుణ కలిగినదే చాలు

నిన్ను గాక వేరొకరిని నేను తలతునా


శ్రీరామరామా యని శ్రీకృష్ణకృష్ణా యని

నారాయణా నిన్ను నోరార  పిలిచి

నీరూపగుణనామ నిత్యసంకీర్తనము

కోరిచేయుచు నొరుల చేర నేర్తునా



11, మార్చి 2025, మంగళవారం

ఎంతవాడ వోరామ

 

ఎంతవాడ వెంతవాడ వెంతవాడ వోరామ

చింతలన్ని చిటికెలోన చెదరగొట్టి నావురా


చింతలేమి లేవనెడు జీవులున్నారా నీదు

చెంతచేర మనెడు దుష్టజీవు లున్నారు కాని

పంతగించి చేరకుండు వారిగోల నాకేలని

అంతరంగ మందు నమ్మి అయ్యా నిను జేరగానె


ఎంతెంతటి పాపములను నంతంతటి శిక్షలని

అంతకుడు బెదిరించగ నదిరిపడి నిన్నుజేర

చింతించకు చింతించకు జీవా నీపాపరాశి

కంతకుండు చూచుచుండ నగ్గిబెట్టి నానంటివి


వింతయేమి నిన్నుజేరి వేల్పులెపుడు పొగడుదు రన

వింతయేమి నీభక్తులు విడచిసంసారము నీ

చెంతచేరి సుఖియించుట జీవులందరకు నింక

నంత కంటె కోరదగిన దనగనేమి యున్నదిరా



10, మార్చి 2025, సోమవారం

చక్కగాను వినవయ్య


చక్కగాను వినవయ్య 
    సాకేతరామ  మేము
మక్కువతోమేము జేయు 
    మనవుల నిపుడు

దక్కినదిర నీనామము 
    దశరథరామయ్య యిదే
చిక్కినదిర నీపాద 
    సీమను బుధ్ధి
నిక్కువముగ భక్తితోడ 
    మ్రొక్కుచుంటి మయ్య మీకు
చక్కగ మము బ్రోవ వయ్య 
     సర్వవిధముల

దిక్కులన్నిటిని నీదు 
    దివ్యనామకీర్తనమున
పిక్కటిల్ల జేయు భక్త
    వీరులమయ్య
దిక్కై మమ్మేలవయ్య 
    దేవదేవ నిన్ను వినా
మ్రొక్క మింకొకరి కేము 
    నిక్కువంబుగ

చిక్కులన్నీ విడదీసి 
    చింతలన్నిటిని దీర్చి
మక్కువతో రామచంద్ర 
    మమ్మేలవయా
ఎక్కడెక్కడి పాపాల 
    యెక్కడెక్కడి పుణ్యాల
లెక్కలింక వేయకురా 
    మ్రొక్కెదమయ్యా



వైకుంఠద్వారములను


వైకుంఠద్వారములను 
    నాకై తెరిపించుమురా
లోకేశ్వర రామచంద్ర 
    నీకు మ్రొక్కెద

శోకరసార్ణవము యీ 
    లోకముతో దేవుడా
నాకేమీ పని లేదని 
    నాకెఱు కాయె
నీకొరకై వచ్చుచుంటి నీ
    లోకమునకు నా
రాక కాటంకములను 
    రానీయకురా

ఆనందరసాబ్ధియై యల
    రారు పాలకడలి
నానాగశయనముపై 
    నారాయణుడా
వేనోళ్ళ పొగడుచు నిను 
    వేల్పులు పరివేష్ఠింప
నేనును నిను జూచి పొగడ 
    రానీయవయా



శ్రీహరిస్మరణమే జీవితము


శ్రీహరిస్మరణమే జీవితము

ఆహరినామమె యమృతము


హరిమహిమను హృదయంబున నెఱిగిన

సురలకు నరులకు జూడ నందరకు

పరమోదారుడు  భక్తవరదుడగు

పరంధాముడు పరమేశ్వరుడగు


పరాత్పరుని భవతరణము వేడుచు

సరళోపాయము స్మరణంబే యని

హరేరామ యని హరేకృష్ణయని

పరవశించు సద్భక్తుల కనగా



4, మార్చి 2025, మంగళవారం

సారసాక్షులార


సారసాక్షులార యుపచారము లిపుడు

చేరి సలుపరే మన శ్రీరామునకు


మించుబోడు లార తెచ్చి మంచిగంధాలు

వంచనలేకుండ మీరు వాని కలదరే


పంచదారమిఠాయిలును పాలునుపండ్లు

కొంచువచ్చి తినిపించరె కూరిమి మీర


మంచిమంచి బొమ్మలను మన బాలునకు

చంచలాక్షులార తెచ్చి చాల యీయరే


మంచిమంచి వింజామరలను బూని

యంచితముగ వీయరే హాయిగొలుపగా


అంచగమనలార బాలు డలసిన వేళ

మంచిజోలపాటల నిదురించ జేయరే


3, మార్చి 2025, సోమవారం

రాము డున్నాడు


రాము డున్నాడు మాకు రక్షగా సీతా
రాము డఖిలలోకసంరక్షకుడు మా
రాము డున్నాడు మాకు రక్షగా

పైకురికి ప్రారబ్ధము పట్టి పీడించు వేళ
శోకములే చుట్టుముట్టి శోధించు నట్టి వేళ
లోకమెల్ల మాకు వ్యతిరేకమై నట్టి వేళ
చీకట్లు క్రమ్మి బ్రతుకు చితికి యున్నట్టి వేళ

అన్ని వేళలందును మాకండగా నుండెద నని
విన్నదనము కలుగువేళ విడువక నే నుందునని
పన్నుగ నాపన్నుల యాపదల నదిలించెద నని
తిన్నగ మాచేయిపట్టి యున్నా డున్నా డిదే

భయమెందుకు మావాడై పరమాత్ముం డున్నా డిదె
భయమెందుకు మావాడై జయశీలుం డున్నా డిదె
భయమెందుకు మావాడై పరంధాము డున్నాడిదె
భమమెందుకు కాలు డైన భయపడ వలె మాకే

2, మార్చి 2025, ఆదివారం

నాతరమా భవసాగర మీదగ


నాతరమా భవసాగర మీదగ 
    నాతండ్రీ నను కావవయా
సీతారామా సద్గుణధామా 
    శ్రీరఘురామా కావవయా

అటునిటు తిరుగుచు నలసి పోయితిని 
    ఆదరించరా నాతండ్రీ
కుటిలజగంబున నిక నను త్రిప్పకు 
    కోటిదండములు రామయ్యా

ఆనందముగా నీనామంబునె 
    యాలపించుదును నాతండ్రీ
ఏనాడును నది మరువని వానిగ 
    నెఱుగుదువే నను రామయ్యా

ఇనకులతిలకుడ వగు నీసరివా 
    రెవ్వరు గలరుర నాతండ్రీ
మనసున నిన్నే గురిగా నమ్మితి 
    మరి నను బ్రోవుము రామయ్యా

ఈశ్వర నీదగు దివ్యప్రభావము 
    నెంతని పొగడుదు నాతండ్రీ
శాశ్వతమగు నీకీర్తిని పాడుచు 
    జరుపుదు దినములు రామయ్యా

ఉర్వీతలమున రామరాజ్యమున 
    కున్న ప్రశస్తిని నాతండ్రీ
సర్వకాలముల నన్ని దిక్కులను 
    జనులు పొగడుదురు రామయ్యా

ఊరక పుట్టుచు నూరక చచ్చుచు 
    నుండుట దేనికి నాతండ్రీ
వేరడుగను నను నీదరి నుండగ 
    పిలువబంపరా రామయ్యా

ఎవరిట మెచ్చిగ నెవరిట దిట్టిగ 
    నేమిటి కయ్యా నాతండ్రీ
భువనేశ్వర నీవొకడవు మెచ్చిన 
    పొంగుదు మిక్కిలి రామయ్యా