10, మార్చి 2025, సోమవారం

చక్కగాను వినవయ్య


చక్కగాను వినవయ్య 
    సాకేతరామ  మేము
మక్కువతోమేము జేయు 
    మనవుల నిపుడు

దక్కినదిర నీనామము 
    దశరథరామయ్య యిదే
చిక్కినదిర నీపాద 
    సీమను బుధ్ధి
నిక్కువముగ భక్తితోడ 
    మ్రొక్కుచుంటి మయ్య మీకు
చక్కగ మము బ్రోవ వయ్య 
     సర్వవిధముల

దిక్కులన్నిటిని నీదు 
    దివ్యనామకీర్తనమున
పిక్కటిల్ల జేయు భక్త
    వీరులమయ్య
దిక్కై మమ్మేలవయ్య 
    దేవదేవ నిన్ను వినా
మ్రొక్క మింకొకరి కేము 
    నిక్కువంబుగ

చిక్కులన్నీ విడదీసి 
    చింతలన్నిటిని దీర్చి
మక్కువతో రామచంద్ర 
    మమ్మేలవయా
ఎక్కడెక్కడి పాపాల 
    యెక్కడెక్కడి పుణ్యాల
లెక్కలింక వేయకురా 
    మ్రొక్కెదమయ్యా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.