14, జనవరి 2025, మంగళవారం

వినుడు వినుడు

 

వినుడు వినుడు నామనసు వెఱ్ఱియైనది

అనవరతము హరే హరే యనుచున్నది


హరేరామ హరేరామ యనుచు నున్నది

హరేకృష్ణ హరేకృష్ణ యనుచు చున్నది

హరే నరసింహాయని యరచుచున్నది

నిరంతరము నీరీతిగ నెగడుచున్నది


ఆనందము హరినామం బనుచు నున్నది

ఆనందము కావన్యము లనుచు నున్నది

తానన్నపానములను తలపకున్నది

మాని యితరవృత్తులను మసలుచున్నది


హరి దీనికి మత్తుపెట్టి నట్టులున్నది

హరి కన్యము లేనేలే దనుచు నున్నది

హరిని తలపకుండు టెట్టులనుచు నున్నది

హరివశమై యిది యన్యము లరయకున్నది



13, జనవరి 2025, సోమవారం

రాఘవాష్టకం

 

(ప్రమాణికా వృత్తాలు)


బిరాన నన్ను బ్రోవరా

ఖరాదిరాక్షసాంతకా

సురేశ్వరాభినందితా

నరేశ రామ రాఘవా  1


దినాధినాథవంశజా

మునీంద్రయాగరక్షకా

సనాతనా జనార్దనా

అనాథనాథ రాఘవా  2


హరీశరాజ్యదాయకా

సురారికోటినాశకా

సురేశహర్షదాయకా

నరేశ రామ రాఘవా  3


గిరీశజేశ ప్రస్తుతా

నరేశలోక సన్నుతా

పరంతపా నిరంజనా

ధరాత్మజేశ రాఘవా  4


సమస్తదుష్టనాశకా

సమస్తశిష్టరక్షకా

సమస్తభక్తపోషకా

నమస్కరింతు రాఘవా  5


సమస్తదుఃఖనాశకా

సమస్తసౌఖ్యదాయకా

సమస్తలోకపాలకా

నమస్కరింతు రాఘవా  6


దినేశవంశభూషణా

దినేశచంద్రలోచనా

అనింద్యదివ్యవిక్రమా

అనాథనాథ రాఘవా  7


స్మరింతు నీదు నామమే

నిరంతరంబుగా ప్రభూ

బిరాన నన్ను బ్రోవరా

నరేశ రామ రాఘవా  8


దండాలు దండాలు దండాలు

 

దండాలు దండాలు దండాలు

దండాలు శతకోటి దండాలు


నిగమాంతవేద్యునకు శ్రీరామచంద్రునకు 

    నీరేజనేత్రునకు దండాలు

జగదేకవీరునకు శ్రీరామచంద్రునకు 

    జానకీనాధునకు దండాలు

నగరాజధీరునకు శ్రీరామచంద్రునకు 

    నరనాథశ్రేష్ఠునకు దండాలు

ఖగరాజగమనునకు శ్రీరామచంద్రునకు 

    ఘననీలదేహునకు   దండాలు


పరమేష్ఠివినుతునకు శ్రీరామచంద్రునకు 

    పరమేశవినుతునకు దండాలు

సురనాథవినుతునకు శ్రీరామచంద్రునకు 

    హరినాథవినుతునకు దండాలు

సురలోకవినుతునకు శ్రీరామచంద్రునకు 

    నరలోకవినుతునకు దండాలు

కరుణాలవాలునకు శ్రీరామచంద్రునకు 

    వరదానశీలునకు దండాలు


ఇనకులోత్తంసునకు శ్రీరామచంద్రునకు 

    వనజాయతాక్షునకు దండాలు

మునిజనానందునకు శ్రీరామచంద్రునకు 

    మోహనాకారునకు దండాలు

దనుజసంహారునకు శ్రీరామచంద్రునకు 

    ధర్మస్వరూపునకు దండాలు

మనకష్టముల బాపు మన రామచంద్రునకు 

    మనసార పెట్టేము దండాలు



హరివి నీవు


హరివి నీవు నరుని నన్ను

కరుణ నేల లేవా

పరమపురుష రామచంద్ర

దరికి జేర్చ లేవా


కరుణాతిశయముతో నీవు కరిని

దరిజేర్చిన దొక కల్లా 

సురవైరిసుతుని కొర కీవు నాడు

నరసింహు డగుట కల్లా

పరమాదరమున సభలోన సతిని

కరుణించి నదియు కల్లా

మరి నీవు నన్ను కరుణించ వేమి

పరమాత్మ చెప్పవయ్యా


వరదానశీల సిరులిచ్చి నన్ను

కరుణించ మనను గాదా

కరుణాలవాల భరమాయె బ్రతుకు

కరుణించ మంటి గాని

శరణాగతత్రాణ బిరుదాంకితువు

శరణంటి బ్రోవరాదా

మరి యేమి చేయ నీమనసుకరుగు

హరి నీవె చెప్పవయ్యా 



12, జనవరి 2025, ఆదివారం

శ్రీరామ సన్మంత్రమే


శ్రీరామ సన్మంత్రమే  మేలు సిరుల 

    చెడగొట్టు మంత్రాలచే కీడు

నోరార శ్రీరామ యన మేలు నోటి 

    నూరక వదరించితే కీడు


దేవుళ్ళ పూజించితే మేలు 

    కల్లదేవుళ్ళ పూజించితే కీడు

శ్రీవిష్ణు నర్చించితే మేలు 

    క్షుద్రదేవతల నర్చించితే కీడు


గురువులను సేవించితే మేలు 

    కల్లగురువులను సేవించితే కీడు

హరిహరుల కీర్తించితే మేలు 

    నరుల శ్రీలెంచి కీర్తించితే కీడు


బుధ్ధిమంతుల జేరితే మేలు 

    వట్టి బుధ్ధిహీనుల జేరితే కీడు

సిధ్ధులను సేవించితే మేలు 

    దొంగసిధ్ధులను సేవించితే కీడు


పూజల నొనరించితే మేలు 

    క్షుద్రపూజల నొనరించితే కీడు

రాజువలె బ్రతుకుటే మేలు 

    పోతురాజువలె బ్రతుకుటే కీడు



11, జనవరి 2025, శనివారం

చీమకుట్టి నట్లైన

 

చీమకుట్టి నట్లైన రామ నీకు లేదురా

స్వామీ నాబాధ హాస్యాస్పదముగ నున్నదా


నీమాట మేరకే భూమిని నే దిగబడితిని

నీమాటనే నమ్మి నీదు గొప్పలను చాటుచు

నీమహిమలను నేను నిత్యంబును కీర్తించుచు

నేమేమో పాడుచు నిచటనేను పడియుంటిని


పదే పదే మాతృగర్భములోన జొచ్చుచుంటిని

పదే పదే బాధలు పడుచుంటిని బ్రతుకీడ్వగ

పదే పదే నిందలు పడుచుంటిని లోకంబున

పదే పదే నిన్నే ప్రార్ధించుచు నిటనుంటిని


ఎందుకీ యుపాధుల నిరికి చావ మను చుంటివి 

ఎందుకీ యిలపైన నిడుముల బడు మను చుంటివి

ఎందుకీ రీతిగా నేడ్పించుచు నగుచుంటివి

ఎందుకీ మౌనమో యినకులేశ రక్షించుము



రారా సద్భక్తవరద

 

రారా సద్భక్తవరద రఘునాథా రారా
రారా శ్రీరామా యన్న రాకున్నా వేరా

రారా కళ్యాణగుణవారాశివిగా రారా
రారా మాపూజలందగ రయముగ రఘునాథా

రారా కరుణారసవారిరాశివిగా రారా
రారా మాపూజలందగ రయముగ రఘునాథా

రారా రవివంశపయఃపారావార చంద్ర
రారా మాపూజలందగ రయముగ రఘునాథా

రారా కువలయాతనయాప్రాణేశా రారా
రారా మాపూజలందగ రయముగ రఘునాథా

రారా శరనిహతరాక్షసరాజేంద్ర రారా
రారా మాపూజలందగ రయముగ రఘునాథా

రారా భవవిధ్వంసనకారణనామా రారా
రారా మాపూజలందగ రయముగ రఘునాథా



రారా శ్రీరామ


రారా శ్రీరామ రారా రఘురామ

రారా నన్నేలు నారాయణా 


రారా నాగేంద్ర శయన రారా రవిచంద్ర నయన

రారా పాపౌఘ శమన రారా రాకేందు వదన


రారా జితమదనతేజ రారా జితకల్పభూజ

రారా జితదైత్యరాజ రారా నుతశుభ్రతేజ


రారా దశరథ నందన రారా శివచాప ఖండన

రారా జలనిధి బంధన రారా భవబంధ ఖండన


రారా నుతసుగుణజాల రారా జానకీలోల

రారా కరుణాలవాల రారా వరదానశీల 


రారా సురవైరిశోష రారా సురబృంద తోష

రారా మునిలోకతోష రారా సద్భక్తపోష 


రారా కరిరాజవరద రారా సుగ్రీవవరద 

రారా విభీషణవరద రారా సద్భక్తవరద



10, జనవరి 2025, శుక్రవారం

ఎందు కీయుపేక్ష


ఎందు కీయుపేక్ష రాఘవా

తొందర నీకేల లేదురా


చిందరవందరగ నున్న జీవితము నాదాయెను

వందారు సద్భక్తకోటిమందార దయామృత

బిందువొకటి నాపైపడవేసి రక్షసేయరా

వందనములు నీకు సర్వాత్మక దయజూపరా


ఎందరినో ప్రోచి నన్నేల నేల రావు వా

రందరి వలె నొక భక్తుడ ననిపించుట లేదా

ఇందీవరశ్యామ నాయందు తప్పేమిరా

వందనములు నీవు నాయందిక దయజూపరా


సందేహము దేనికి నిను శరణుజొచ్చి యుంటినే

సందడికా డీత డనుచు సరకుచేయ కుంటే

యెందుబోదు నింక దిక్కెవ్వరున్నారురా

వందనములు దేవదేవా యిక దయజూపరా



8, జనవరి 2025, బుధవారం

పరాత్పరుని శుభనామము

 

పరాత్పరుని శుభనామము చాలును 

    భావింపకు మన్యంబులను

తరించిపోవుట కదియే చాలును 

    మరువకురా యీసూత్రమును


దేవుడు శివుడని తెలిసికొంటివా

    భావింపుము శివనామమును

భావజహరుని భక్తసులభుని

    పావననామము మోక్షమిడు

కేవల మాతని నామస్మరణమె

    కైవల్యము నీకిచ్చునను

భావము నెన్నడు తొలగనీయక

    సేవింపుము విభునామమును


ధరాతలంబున రామనామమున 

    తప్పక మోక్షము కలుగునని

పురారిప్రముఖులు వచించినా రది

    బుధ్ధిని తలచుము నిత్యమును

నరోత్తములు శ్రీరామనామమును

    నమ్ముకొందురని లోనెఱిగి

నిరంతరంబుగ రామనామమును

    నిలిపి జిహ్వపై తరించుము



హరిహరు లిర్వురు నొకటని తప్పక

    నరుడు నమ్మవలె చిత్తమున

హరినామములో హరనామములో

    నిరంతరంబుగ నాలుకపై

నరుడు నిలిపి సన్మార్గము నందున

    నడచిన మోక్షము సిధ్ధించు

స్మరణమాత్రమున మోక్షము కలిలో

    చక్కగ దొరకును నిశ్చయము




7, జనవరి 2025, మంగళవారం

మరే యితర మంత్రము

 

మరే యితర మంత్ర మెంత మచ్చికైన గాని

హరేరామ యననిదే యబ్బేనా ముక్తి


గురువులను కొలిచి వారు కొసరిన మంత్రాలు

పరమభక్తితోడ జిహ్వాగ్రంబున నిలిపి

తరచుగాను తద్దేవతలను ధ్యానించిన

సరాసరిగ ముక్తిలేదు హరేరామ యనక


నిరంతరము జపతపాది నిష్టలను నెఱపి

పరమభక్తితోడ పునశ్చరణలు చేసి

పరమంత్రంబుల నెంతగ భావించిన గాని

హరేరామ యనక భవతరణము లేదు


హరేరామ హరేకృష్ణ హరేవాసుదేవ

హరేమురారే యనెడు నరునకు ముక్తి

కరతలామలకమై వరలుచు నుండు

హరినామము దక్క మంత్ర మనునది లేదు


ఎవరైనా శ్రీరామభక్తులై


ఎవరైనా శ్రీరామభక్తులై యెందు కుందు రయ్యా

భువిలో శ్రీహరిభక్తులె జీవన్ముక్తు లండ్రు గనుక


ఎవరైనా శ్రీరామచరితమే యెందుకు చదివే రయ్యా

భువిలో దివిలో నదియే మిక్కిలి పుణ్యచరిత గనుక

ఎవరైనా శ్రీరామచంద్రునే యెందుకు కొలిచే రయ్యా

భువిలో దివిలో దేవుడు శ్రీరఘుపుంగవుడే గనుక


ఎవరైనా శ్రీరాముని కీర్తన మెందుకు చేసే రయ్యా

స్తవనీయుడు శ్రీరామచంద్రుడే సర్వేశుడు గనుక

ఎవరైనా శ్రీరామదాసులై యెందుకు బ్రతికే రయ్యా

వివరింపగ సద్భక్తుల కదియే వేడు కగును గనుక


ఎవరైనా శ్రీరామనామమే యెందుకు పలికే రయ్యా

భువిలో దివిలో దానికి సాటియె పొడగానము గనుక

ఎవరైనా ఆమోక్షమార్గమే యెందుకు వలచే రయ్యా

భువిలో దానికి సాటి మార్గమునె పొడగానము గనుక



నీనామమును గాని


నీనామమును గాని నేను పలుకను స్వామి

నా నియమ మిట్టిది నారాముడా


నీకీర్తినే గాని నేను చాటను స్వామి

నీకు సాటిగ నొరుని నేనెన్నను

నీకరుణనే గాని నేను వేడను స్వామి

నాకితరము లేల నారాయణా


నీపాటలే గాని నేను పాడను స్వామి

ఆపాట లణచు నాతాపంబులు

నీపాదములు గాక నేను పట్టను స్వామి

ఆపాదములు భవహరణంబులు


నీవారితో గాని నేను తిరుగను స్వామి

నీవారె నావారు నిక్కంబుగ

నీవిచ్చు మోక్షమే నేను కోరుదు స్వామి

పైవారితో నాకు పనిలేదయా



హరేరామ జయ

హరేరామ జయ హరేరామ జయ హరేరామ జయ గోవిందా 
హరేకృష్ణ జయ హరేకృష్ణ జయ హరేకృష్ణ జయ గోవిందా

పురాణపూరుష పుండరీకాక్ష హరే మురారే గోవిందా 
ధరాత్మజావర హరే మురారే దశరథనందన గోవిందా 

సురగణతోషణ సజ్జనపోషణ హరే మురారే గోవిందా 

సురరిపుశోషణ శ్రీయదుభూషణ హరే మురారే గోవిందా 


వనరుహనయన పన్నగశయన వరదాయకహరి గోవిందా 

ఇనకులతిలక కౌసల్యాత్మజ మునిజనమోహన గోవిందా


ఖలవిధ్వంసక భవవిధ్వంసక బలభద్రానుజ గోవిందా 

కలివిధ్వంసక హరేమురారే కంసధ్వంసక గోవిందా


హతసురరిపుకుల ఆశ్రితవత్సల హరేమురారే గోవిందా

జితశతమన్మథ శ్రీరఘునందన సీతారమణ గోవిందా


పరాత్పర భూభారనివారక హరే మురారే గోవిందా

పురందరార్చితపదారవింద సురేశ కృష్ణ గోవిందా