8, జనవరి 2025, బుధవారం

పరాత్పరుని శుభనామము

 

పరాత్పరుని శుభనామము చాలును 

    భావింపకు మన్యంబులను

తరించిపోవుట కదియే చాలును 

    మరువకురా యీసూత్రమును


దేవుడు శివుడని తెలిసికొంటివా

    భావింపుము శివనామమును

భావజహరుని భక్తసులభుని

    పావననామము మోక్షమిడు

కేవల మాతని నామస్మరణమె

    కైవల్యము నీకిచ్చునను

భావము నెన్నడు తొలగనీయక

    సేవింపుము విభునామమును


ధరాతలంబున రామనామమున 

    తప్పక మోక్షము కలుగునని

పురారిప్రముఖులు వచించినా రది

    బుధ్ధిని తలచుము నిత్యమును

నరోత్తములు శ్రీరామనామమును

    నమ్ముకొందురని లోనెఱిగి

నిరంతరంబుగ రామనామమును

    నిలిపి జిహ్వపై తరించుము



హరిహరు లిర్వురు నొకటని తప్పక

    నరుడు నమ్మవలె చిత్తమున

హరినామములో హరనామములో

    నిరంతరంబుగ నాలుకపై

నరుడు నిలిపి సన్మార్గము నందున

    నడచిన మోక్షము సిధ్ధించు

స్మరణమాత్రమున మోక్షము కలిలో

    చక్కగ దొరకును నిశ్చయము




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.