30, ఆగస్టు 2024, శుక్రవారం

రామనామమే సుఖము


రామనామమే వరము రామనామమే ధనము

రామనామమే బలము రామనామమే సుఖము


రామనామమే కలివిరామకర మంత్రము

రామనామమే సర్వరక్షోఘ్నమంత్రము

రామనామమే లోక రక్షాకరమంత్రము

రామనామమే సుందరంబైన మంత్రము


రామనామమే సకల క్షేమకరమంత్రము

రామనామమే యోగిరాజహృన్మంత్రము

రామనామమే మోక్షరాజ్యమిచ్చు మంత్రము

రామనామమే మంత్రరాజమౌ మంత్రము



27, ఆగస్టు 2024, మంగళవారం

పూవులన్నియును రామునకే

పూవులన్నియును రామునకే

    పూజలన్నియును రామునకే


పూలతావు లవి రామునకే

    మాలల సొగసులు రామునకే

మేలగు కాన్కలు రామునకే

    మిక్కిలి యశమును రామునకే

వేలపొగడ్తలు రామునకే

    వేలదండములు రామునకే


విభవము లన్నియు రామునకే

    విజయము లన్నియు రామునకే

శుభము లన్నియును రామునకే

     శోభ లన్నియును రామునకే

ఉభయలోకముల రామునకే

    యొప్పును గొప్పలు రామునకే


చెందు నన్నియును రామునకే

    శీఘ్రముగా రఘురామునకే

అందగాడు శ్రీరామునకే

    చెందును మంగళకీర్తనలు

అందరి వాడగు రామునకే

     చెందును మంగళహారతులు


    

మాటలేల నింక

మాటలేల నింక ముమ్మాటికి నీవాడ నని
సూటిగ నే నన్నను కృపజూడకున్నావు

కలనైనను పరుని పేరు పలికితినో నేను

వలచితినా నేనితరుల వలన సిరులను

తలచితినా నీసాటిగ తక్కొరు దైవంబును

కలతచెంది నాకెందుకు కఠినుడ వైనావు


చీటికిమాటికిని నీదు చెవినిల్లు కట్టుకొని

పాటలెన్ని పాడుదు నీ వైభవమెంచి

కోటచేసుకొంటివి నాగుండెను శ్రీరాముడ

మాటలాడ వేల మంచిమనసుకల నీవు


ఇమ్మహి మనుజుల నమ్మిన

ఇమ్మహి మనుజుల నమ్మిన వారల
  కెమ్మెయి సుఖములు కలుగునురా
నెమ్మనమున రఘురాముని గట్టిగ
    నమ్మిన తప్పక కలుగునురా

కిమ్మనకుండగ సేవలుచేసిన
    ఇమ్మని యడిగిన విచ్చెదరా
సొమ్ములు మరికొ న్నిమ్మనగానే
    పొమ్మని కోపము చేసెదరా

రమ్మని ప్రేమగ పిలిచే రాముడు
    పొమ్మని యెన్నడు కసరడురా
గుమ్ముగ సేవించినచో యిదె చే
    కొమ్మని సంపద లిచ్చునురా

ఇమ్మహి మనుజుల నమ్మిన సురలను
   నమ్మిన వారే మిత్తురురా
నమ్మకముగ శ్రీరాముడొకడె మో
    క్షమ్ము నిచ్చునని తెలియుమురా

సొమ్ములపై నీకేమాత్రము మో
    హమ్ములేనిచో గమనించి
నమ్ముకొన్న ఇను దయజూచును మో
    క్షమ్ము నొసంగును రామయ్య

23, ఆగస్టు 2024, శుక్రవారం

ఎంత మంచివాడండీ

ఎంత మంచివాడండీ యీరాముడు మన
చెంతనున్న దేవుడండి శ్రీరాముడు

భూరిభుజశాలి యైన శ్రీరాముడు బం

గారుకొండయై యుండెడు శ్రీరాముడు

నారాయణుడే మన శ్రీరాముడు  తని

వార బుధులు పొగడెడు శ్రీరాముడు


చింతలన్ని తీర్చుచుండు శ్రీరాముడు దు

శ్చింతనులను పిలుకుమార్చు శ్రీరాముడు

చెంతను సౌమిత్రితోడ శ్రీరాముడు ర

క్షింతునని పలుకుచున్న శ్రీరాముడు


కారుణ్యాంబుధి యైన శ్రీరాముడు సం

సారభయము నెడబాపు శ్రీరాముడు

వారిజాక్షి సీతతోడ శ్రీరాముడు జగ

దారాధ్యుడగుచు వెలుగు శ్రీరాముడు



22, ఆగస్టు 2024, గురువారం

రామనామమును పలికేదాకా

 రామనామమును పలికేదాకా 
    రావలె నెన్నో దేహములు
రామునిదయ యది కలిగేదాకా 
    రావలె నెన్నో జన్మములు

రాముని భక్తులు మెచ్చేదాకా 

    రావలె నెన్నో జన్మములు

రాముని సేవల కరిగేదాకా 

    రావలె నెన్నో జన్మములు

రాముడు గుండెను నిలచేదాకా 

    రావలె నెన్నో జన్మములు

రాముడు నిన్ను మెచ్చేదాకా

    రావలె నెన్నో జన్మములు


రామునితో జతకట్టేదాకా 

    రావలె నెన్నో జన్మములు

రామభక్తి కుదురాయేదాకా 

    రావలె నెన్నో జన్మములు

రామతత్త్వ మెఱుకాయేదాకా 

    రావలె నెన్నో జన్మములు

రాముడు చాలని పలికేదాకా 

    రావలె నెన్నో జన్మములు



రారో మ్రొక్కరో రామునకు

రారో మ్రొక్కరో రామునకు సం
సారుల కిదియే సౌఖ్యమని

పాడుకలితో వేగు బాధ మాకెందుకని
వేడుకతో శరణు వేడుచున్నా మని
కూడని పనులలో కుదురుకో లేమని
నేడే నీసేవానిరతి గోరితి మని

వింతవింత జన్మముల వేడుక లేదని
సంతోషముగను నీచెంత నుండే మని
అంతులేని నీదయ సుంతమా కిమ్మని
చింతించ కన్యులను శీఘ్రము గను

మ్రెక్కిన వారింక పుట్టరు గావున
చక్కగా మీరెల్ల సంబరపడుచును
నిక్కువముగ నేడు మోహనాశకు డైన
చక్కని తండ్రికి మక్కువతో

మందన్న నిదియే మందుకదా


మందన్న నిదియే మందుకదా బుధు

లందరు మెచ్చిన మందుకదా


వేయిజన్మలుగ వదలని బాధల వెడలించే దీమందుకదా

మాయదారి భవరోగము నిట్టేమాయము చేసే మందుకదా


ఆరువిధంబుల రోగలక్షణము లన్నిటి నణచే మందుకదా

తీరని మమతయు నహమను చిత్తవికారము లణచే మందుకదా


కల్లదైవముల గొలిచే వెఱ్ఱిని కట్టడిచేసే మందుకదా

ఉల్లము చక్కగ హరిపై నిత్యము నల్లన నిలిపే మందుకదా


రామనామమను పేరుగలిగిన రసవంతమగు మందుకదా

భూమిని దీనినిమించిన దేదీ పుట్టని ఘనమగు మందుకదా



16, ఆగస్టు 2024, శుక్రవారం

పోరాడుటెందుకు కలితోడను

పోరాడుటెందుకు కలితోడను వాడు
    శ్రీరామ  యనగానె పడిపోవును

రామనామము చెవుల విననొల్లడు వాడు
    రామబాణము కనుల కననొల్లడు
రామదాసుల కడకు చననొల్లడు వాడు
    రామునిచే దెబ్బతిన నొల్లడు

రామతీర్ధంబుల మననొల్లడు వాడు    
    రాముని గుడికడకు చననొల్లడు
రాముని కన్నెత్తి కననొల్లడు వాడు
    రామప్రసాదంబు తిననొల్లడు

రామకార్యము చెఱుప జననొల్లడు వాడు
  రామదాసుల కడ్డు పడనొల్లడు
రాముడంటే వణకి పరుగెత్తును వాడు
  రాముని పే‌రెత్త పడిపోవును

12, ఆగస్టు 2024, సోమవారం

గర్వించక శ్రీరాముని

కం. గర్వించక శ్రీరాముని

సర్వాత్మకుడైన హరిని చక్కగ గొలువన్

సర్వార్ధంబులు కలుగుట

యుర్వినిగల సుజను లెఱిగి యుందురు సతమున్

అన్నిటికిని

కం. అన్నిటికిని శ్రీరాముం
డున్నాడని నమ్ముకొనిన నుండవు చింతల్
తిన్నగ నేను సమర్ధుడ
నన్నప్పుడు కలుగుచుండు నాపదలెల్లన్

అన్నియు నీవిచ్చినవై

కం. అన్నియు నీవిచ్చినవై
యున్నవి యీతనువు మనసు నీజీవితమున్
మన్నించి రామచంద్రా
సన్నిధి దయచేసి కొఱత సవరించవయా

ఏమందువు శ్రీరామా

కం. ఏమందువు శ్రీరామా
నీముందుకు నేను వచ్చి నిలదీసినచో
కామితవరబిరుదాంకిత
ఆమోక్షము నీయ కుందు వది తగదనుచున్

రాముని నమ్మిన వారము

కం. రాముని నమ్మిన వారము
రామునకే గాక నన్యులకు మ్రొక్కము శ్రీ
రాముని కీర్తిని చాటుచు
మేముందుము రామనామమే ప్రాణముగా

10, ఆగస్టు 2024, శనివారం

పలుకవలె రామనామము


పలుకవలె రామనామము పలుకువారికి జన్మరాహిత్యము

పెద్దలిచ్చిన రామనామము ఫలముపెచ్చైన శ్రీరామనామము
ముద్దుముద్దుగ రామనామము జగన్మోహనమగు రామనామము

భక్తికలిగి రామనామము శ్రధ్ధవదలక శ్రీరామనామము
ముక్తికోరుచు రామనామము బుధ్ధిపూర్వకముగ రామనామము

వదలక శ్రీరామనామము కలికి బెదరక శ్రీరామనామము
ముదమారగ రామనామము కలిని వదిలించు శ్రీరామనామము

రసననుంచి రామనామము మాకు ప్రాణమని రామనామము
రసవంతమని రామనామము మంత్రరాజమని రామనామము

సంతోషముగ రామనామము బుధ్ధిమంతులై శ్రీరామనామము
చింతలణచు రామనామము పరమశివనుతమగు రామనామము


1, ఆగస్టు 2024, గురువారం

రమణీయార్ధకప్రతిపాదకములు


రమణీయార్ధకప్రతిపాదకములు

    రామనామములు కావ్యములు

భ్రమలను బాపుచు మోక్షము నిచ్చెడు

    రామనామములు భావ్యములు


రామనామములు రామనామములు

    రాముని చక్కనినామములు

కామవైరికిని కమ్మగ నుండెడు

    రాముని తీయని నామములు

ప్రేమగపలికెడు వారల కెపుడును

    ప్రియమును గూర్చెడు నామములు

పామరులైనను పండితులైనను

    పలికిన చాలీ నామములు


అవ్యయుడగు శ్రీరామునినామము

    లనిశము మధురములై యుండ

దివ్యమహిమలను రామనామములు

    తేజరిల్లుచును తమకుండ

భావ్యముకాదు లౌకికములలో

    వర్తించుట హరిభక్తులకు

కావ్యాలాపములను వర్జించుట

    కార్యము రాముని భక్తులకు


రామా సీతారామా రఘువర

    రాజారామా శ్రీరామా

రామా దశరథరామా భండన

    భీమా దశకంఠవిరామా

రామా రాజలలామా మేఘ

    శ్యామా యని నోరారా శ్రీ

రాముని నామములను పాడి పరం

    ధాముని కరుణకు నోచండీ


కరుణాలవాల యిదె కర్పూరహారతి


కరుణాలవాల యిదె కర్పూరహారతి
పరమాత్మ శ్రీరామ సురుచిరహారతి

నిరవద్యగుణధామ నీలాభ్రశ్యామ
పరిపంధిగణభీమ పట్టాభిరామ
దురితశోషణనామ హరి పూర్ణకామ
ధరణిజాహృధ్ధామ దశరథరామ

వికచసరోరుహాక్ష వీరేంద్రరామ
సకలలోకారాధ్య సాకేతరామ
సకలదనుజవిరామ సర్వేశరామ
సకలయోగీంద్రగణసంసేవ్య రామ 

శృంగారగుణధామ మంగళహారతి
అంగనాసహిత రామ మంగళహారతి
మంగళాలయ రామ మంగళహారతి
సంగవర్జిత రామ మంగళహారతి