1, ఆగస్టు 2024, గురువారం

రమణీయార్ధకప్రతిపాదకములు


రమణీయార్ధకప్రతిపాదకములు

    రామనామములు కావ్యములు

భ్రమలను బాపుచు మోక్షము నిచ్చెడు

    రామనామములు భావ్యములు


రామనామములు రామనామములు

    రాముని చక్కనినామములు

కామవైరికిని కమ్మగ నుండెడు

    రాముని తీయని నామములు

ప్రేమగపలికెడు వారల కెపుడును

    ప్రియమును గూర్చెడు నామములు

పామరులైనను పండితులైనను

    పలికిన చాలీ నామములు


అవ్యయుడగు శ్రీరామునినామము

    లనిశము మధురములై యుండ

దివ్యమహిమలను రామనామములు

    తేజరిల్లుచును తమకుండ

భావ్యముకాదు లౌకికములలో

    వర్తించుట హరిభక్తులకు

కావ్యాలాపములను వర్జించుట

    కార్యము రాముని భక్తులకు


రామా సీతారామా రఘువర

    రాజారామా శ్రీరామా

రామా దశరథరామా భండన

    భీమా దశకంఠవిరామా

రామా రాజలలామా మేఘ

    శ్యామా యని నోరారా శ్రీ

రాముని నామములను పాడి పరం

    ధాముని కరుణకు నోచండీ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.