31, అక్టోబర్ 2018, బుధవారం

బరువైన పదితలల


బరువైన పదితలల వలన నేమిలాభము
యిరువది చేతులున్న నేమిలాభము

పెడదారి తలపులతో చెడిపోయిన తలల
కడుగడుగున తప్పులందు ప్రీతిగలిగె
నుడువరాని పనులుచేసి యూడిపడె నవియెల్ల
బెడిదముగ రామబాణవితతి చేత

యిరువదిచేతులతో పొరిపొరి చెలరేగి
పరసతులను చెఱబట్ట వాంఛగలిగె
సరి కాని పనులు చేసి జారిపడె నవి యెల్ల
హరి విడచిన బాణముల వరుసచేత

హరిబుధ్ధి లేక వట్టి యట్టలే తలలని
తిరముపరచ రావణుకథ ధరను కలిగె
హరిపూజనంబున కమరుటకే చేతులని
తిరముపరచ రావణుకథ ధరను కలిగె
 

నేనని నీవని


నేనని నీవని నిత్యవ్యవహారము
కాని సిధ్ధాంతమున కానరాదే

మరియొక తత్త్వమే మహితమై కనరాక
సరిసరి పరమవిస్పష్టంబుగను
నిరుపమానమై నెలకొన్నదొక్కటే
పరమతత్త్వమన్నది వరసిధ్ధాంతము

ఉదితమై వేరొక్కటున్నప్పుడే కదా
అది యిది యని మాటలాడంగను
విదితంబుగానింక బేధంబు లెక్కడ
అదే పరబ్రహ్మ మన్నది సిధ్ధాంతము

రాముడనగ లోకాభిరామమై బ్రహ్మము
నామరూపములతో నడిచివచ్చినది
రామునియందు నిజనామరూపంబులను
ప్రేమతో విడచుటే విహితసిధ్ధాంతము

పొమ్మనక కర్మచయము


పొమ్మనక కర్మచయము రమ్మనక ముక్తికాంత
యిమ్మహి నందందు తిరుగు నీజీవుడు

ప్రతితిత్తిని జొరబారు పర్యంతము బుధ్ధిగలిగి
యతిశయించ గోరువా డగును జీవుడు
అతనుదొట్టి దుర్మార్గుల కతిసులభంబుగ జిక్కి
అతిశయించుచుండుబో నాజీవుని కర్మములు

రాముడొక్క డున్నాడని ప్రేమతోడ గొలిచినచో
పామరత్వ ముడిగి కర్మబంధమూడునే
ఆ ముక్తికాంత పిలుచు నన్నమాట తెలియుసరికి
ఏమయ్యా యుగము లెన్నెన్నో గడచిపోవును

ఏది మంచిదారి యన్న దించుకవిచారము
మేదినిపై జీవునిలో మెదలునొక్కట
వేదనలు వాదనలు విరిగి కర్మబంధముల
మీదుకట్టి జీవు డపుడు మేలుకాంచు నిశ్చయము

హరికీర్తనము చేయునప్పుడు


హరికీర్తనము చేయునప్పు డీ మనసెల్ల
హరిమయముగా నుండు టావశ్యకంబు

హరికన్యముల నెంచి యందందు నిరతము
చరియించు మనసెట్లు హరిని కీర్తించు
హరినిగూర్చి పలుకులాడెడు వేళలో
హరి నిండవలెను ప్రత్యక్షరం బందునను

హరిని దరిసించక నంతరంగంబున
హరివిభూతుల నెట్లు నరుడు కీర్తించు
విరజిమ్మవలె సర్వవిధముల శ్రీహరి
పరమాత్ముని దివ్య ప్రభలన్ని మాటలును

తారకమంత్ర ముత్తమసాధనము సుండి
మారజనకుని పైన మరులుకల్పించ
ఆరూఢిగ నపుడు మీరేది పలికినను
చేరును హరిచెవికి శ్రేయంబు గలుగును

చింతలన్నియు ద్రోసి


చింతలన్నియు ద్రోసి శివుని సన్నిధి చేరి
సుంతసమయము గడుప జూడరే మీరు

సోమవారమునాడు సోముని దేవళము
ప్రేమతో దరిసించి విభునిసేవించి
కామారికథలును నామజపంబులును
మీ మనసుతీరగ మిగుల భావించరే

విధివిష్ణుశక్రసేవితమైన తత్త్వమును
బుధులార గుమిగూడి పొగడగా త్రిజగ
దధినాథుడైన హరు డానందముగ మీకు
మధురమౌ దీవనలు మరిమరి కురియగ

రామచంద్రార్చితుని రామభక్తులు మీరు
నీమంబుతో చేరి నిలిచిసేవించి
కామాది సర్వవికారంబులను గెల్చి
మోమాటమే లేక ముక్తినిధి గొనరే

29, అక్టోబర్ 2018, సోమవారం

నాడు శ్రీరాముడైన


నాడు శ్రీరాముడైన నేడు శ్రీకృష్ణుడైన
వేడుకగా రెండును హరి వేషము లేను

చేతిలో విల్లుంటే శ్రీరాముడు వాని
చేతిలో చక్రముంటే శ్రీకృష్ణుడు
చేతిలో నేమున్న భీతిగొలుపు రాకాసుల
చేతలణచినట్టి వీడు శ్రీహరి యేను

ఒక్కతే చుక్క తనప్రక్క నున్న రాముడు
మిక్కిలిగ చుక్కలు గల చక్కనయ్య కృష్ణుడు
ఒక్కతైన పెక్కురైన చుక్కలటు లుండనిండు
ఎక్కటిజోదైన వీడేను శ్రీహరి

హరేరామ హరేరామ యనువారు గొల్చునది
హరేకృష్ణ హరేకృష్ణ యనువారు గొల్చునది
నిరంతరము మదిలోన నించున దింకెవ్వని
పరాత్పరుండైన శ్రీహరినే ఇలను

27, అక్టోబర్ 2018, శనివారం

భాగవతుల కివే


భాగవతుల కివే నా వందనంబులు మహా
భాగులార మీ కివే వందనంబులు

ఖలులను లెక్కించక గాసిపడి వగవక
జలజేక్షణుడైన రామచంద్రునే మనమున
తలచుచు ననిశంబును తన్మయత్వంబున
నిలను ధన్యము చేయు నీశ్వరార్చకులకు

కలిని లెక్కించక నిలచి శ్రీరాముని
తలచువారై కలి తలదన్ను వారై
పలుకుపలుకున రామభద్రుని కీర్తించి
తెలియరాని మహిమతో తేజరిల్లు వారికి

కాలుని లెక్కించక నీలమేఘశ్యాముని
వాలాయముగ నమ్మి వర్తించువారలై
చాలును సంసారమని నేల కింక రామని
యేలికయగు రామచంద్రు నింటికేగు వారికి

రామనామము మాకు


రామనామము మాకు రసమయజాత్యన్నము
రామనామేతరముల మేము కోరము

రామనామ మున్నది రాజసాన్నము లేల
రామనామ మున్నది తామసాన్నము లేల
సామాన్యుల రసనలపై సరసమాడు రుచులకు
రామభక్తు లేమాత్రము భ్రమలు చెందరు

భూమిని కడుపుణ్యులకే పుట్టునింత గొప్పరుచి
రామనామామృతమహారసముపై నింతరుచి
రామదాసులు కాని పామరులగు మానవుల
కేమాత్రము తెలియరాక నిల వెలసిన గొప్పరుచి

రామనామామృతమును ప్రేమతో గెలుచుకొని
భూమిపైన కూర్చుని బొక్కుచున్నారము
మేము రామేతరములు మితముగా సహింతుము
రామభక్తులకు రుచి రామనామాన్నమే

26, అక్టోబర్ 2018, శుక్రవారం

నీవు నా కిచ్చునదే


నీవు నాకిచ్చునదే నిజమైన ధనము
నీవాడను నాకితరము నిష్ప్రయోజనము

తామసించి తిరుగుచు ధరను పెద్దకాలము
ఏమేమో పోగిడిచు నెంతో పేరాశను
స్వామి నేను గడపితిని చాల జన్మంబులు
భూమిని గడియించినవి భూమిపాలాయెను

కలలవంటి బ్రతుకులలో గడియించు ధనములు
తెలియగ నెల్ల నద్దముల లోని వస్తువులు
తెలివిలేక వానికై తెల్లవారె జన్మములు
విలువలేని వాని వెంట వెఱ్ఱిపరుగులాయెను

ఈ నాటికి రామచంద్రు డిచ్చినదే ధనమని
నే నెఱిగికొంటి నింక నీవాడ నైతిని
జ్ఞానలబ్ధి కలిగి నాకు సత్యమెఱుగ నైనది
మానక నీవిచ్చు మోక్షమహాధనమె ధనము

రామనామ మెఱుగడా


రామనామ మెఱుగడా పామరుడే
పామరుడా వాడు పతనోన్ముఖుడే

స్వేదజోధ్భిజాండజముల జీవించి వాడు
మేదినిపై క్షీరదముల మేనులలో గడపి
వేదనలు పడిపడి నరవేషమును పొంది
వేదవేద్యు నెఱిగికొనక వెఱ్ఱికాడా

కామాది రిపుషట్కము కడుహితులై తోచ
తామసించి తిరుగుచు తత్త్వార్థ మెఱుగక
ఈ మానవజన్మమే యెంతో దుర్లభమని
ఏమాఱి యున్న వెఱ్ఱియే యగునుగా

ఏవేవో మతములు నెవరెవరో దేవుళ్ళు
కావరమున హరి గూర్చి  కారుకూతలై
తీవరమున కలిమాయల త్రోవలలో నడచి
వేవిధముల నుండెనా వెఱ్ఱికాడా

తప్పతాలు జోలికి


తప్పతాలు జోలికి మీ రెప్పటికిని బోక
తప్పక సన్మార్గమెఱిగి సంచరించుడు

మెచ్చకున్నచో నొరులు  మీదుమిక్కిలి లేదు
మెచ్చు వారు మీ  విలువ హెచ్చు చేయరు
మెచ్చి రామచంద్రమూర్తి యిచ్చు విలువ గట్టి కాని
త్రచ్చగ నితరంబులెల్ల తప్ప తాలు

ధనధనేతరములకు తరచు విలువ లేదు
జనులార వానివలన స్వర్గము  లేదు
ఇనకులేశ్వరుని కరుణ యింతింతనరాని గొప్ప
ధనమగు నితరంబు లెల్ల తప్పతాలు

ఘోరమంత్రజపములు నోరునొవ్వ చేసినా
తీరుగ నపవర్గమును చేర లేరు
శ్రీరాముని నామమే జీవులకు సంసార
తారక మితరంబు లెల్ల తప్పతాలు


పుట్టితి పెరిగితి పొరపాట్లు చేసితి


పుట్టితి పెరిగితి పొరపాట్లు చేసితి
తుట్టతుదకు నిను పొందితిని

పురుషోత్తమ నీవు పొరపాట్లు చేయవు
నరునకు కుదురునే పొరబడక
పరికింప మాయ కీవు బయటనుందువు నేను
మరి మాయాంబుధిమగ్నఝషమును

హరబ్రహ్మ లంతవారే మరి నీమాయ నెఱుగ
తరము కాదందు రింక తడబడక
పొరపాట్లు చేయకుండ నరునకు సాధ్యమే
నిరుపమానమైన దయను నీవు జూపక

రాముడవై నీవు నాకు తారకమంత్రమిచ్చి
దారిచూపినావు నేను తరియింప
సారహీనమైన సంసారమందిఛ్ఛ వదలి
చేరుకొంటి నేడు నీదు శ్రీచరణములు


ఒప్పని సంగతులు


ఒప్పని సంగతు లిప్పుడెండుకు నీ
చెప్పుచేతల నుండు జీవుల తప్పేమి

మమ్ము కల్పించుమని మరిమరి కోరిరా
మమ్మేల చేసితివో బమ్మ యంటిరా
బమ్మకే యబ్బవైన భగవంతుడా నీ
సొమ్ము లివి యిక నీ చిత్తమ్మోహో

మాయలో ముంచుమని మరిమరి కోరిరా
మాయలేల చాలునింక మానమంటిరా
మాయలమారివైన మాధవుడా నీ
చేయందించ రావీ జీవుల కోహో

పామరత్వమున మమ్ము పడవేయ మంటిరా
తామసత్వము బాపదగు నంటిరా
నామమిచ్చి ప్రోచిన రాముడా మా
పామరత్వముపైన బాణమేయ వోహో


అన్నిటి కంటెను గొప్ప


అన్నిటి కంటెను గొప్ప హరికీర్తనమే
తిన్నగ సుఖమిచ్చు చున్న దీ జీవునకు

గొప్పవంశ మందు బుట్టు టొప్పిదమగు కాక
గొప్పగొప్ప చదువుల గౌరవమగు కాక
గొప్ప ధనవంతు డగుట గొప్పచేయు కాక
అప్పడా శాశ్వతములై యవి యమరేనా

గొప్ప బుధ్ధి భార్య యును గొప్ప బుధ్ధి కొడుకులు
గొప్ప ప్రభుతయును చాల గొప్పకీర్తి యనగ
తప్పకుండ కొండలంత గొప్పసుఖములే కాని
అప్పడా శాశ్వతములై యవి యమరేనా

గొప్పదనము కొంత తాను కోరి గడియించినది
గొప్పదనము కాలముచే కొంత కూడి వచ్చినది
గొప్పదనము లెట్టి వైన కొంగుబంగారములా
అప్పడా శాశ్వతములై యవి యమరేనా

పరమాత్మ రామచంద్ర పరగ నీ నామామృతము
నిరుపమానమైన సుఖము నించుచుండు కాని
నరున కెట్టి గొప్పదనము నాటించు సుఖమైన
పరమాల్ప మగునే కాక పరమున కౌనా


25, అక్టోబర్ 2018, గురువారం

ఓరీ నీ మనసే


ఓరీ నీ మనసే యొక్కింత నిర్మలమై
శ్రీరామనామమే చేయనీ దినదినము

వేయరాని వేషాలు వేసిన దిక చాలు
చేయరాని పనులెన్నొ చేసిన దిక చాలు
మోయరాని భారాలు మోసిన దిక చాలు
చేయరా యికనైన శ్రీరామ నామము

చాల జన్మము లెత్తి సాధించినది చాలు
మేలుకీళ్ళెరుగక మిడికిన దిక చాలు
కాలునిచే తిట్లు గడియించినది చాలు
నాలుకపై శ్రీరామనామము నిలుపరా

దుష్టసంసర్గముల దొరలిన దికచాలు
కష్టాల కొలుముల కాపుర మికచాలు
శిష్టుల నిరసించి చెడిపోయినది చాలు
యిష్టపడి రామనామ మికనైన చేయరా


జగన్నాటకం


జగన్నాటకం



బాగుంది.

నిజంగానే.
ఐతే ఎంతో అమాయకంగా చిన్నపిల్లవాడి చేష్టలాగా ఉంది.


జగన్నాటక సూత్రధారి ఎవరంటారు?

ఏమో
ఐతే పెద్దమోడీ కావచ్చును.
లేదా చిన్నమోడీ కూడా కావచ్చును.
ఒకవేళ సామంతప్రభువరేణ్యులే ఐనా ఆశ్చర్యం లేదు.


పరిణామం ఎలా ఉండవచ్చునూ?

రాష్ట్రపతిపరిపాలన విధించాలన్న మంత్రాంగంలో ఇది ఒక భాగం అనిపిస్తోంది.
కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉన్న స్థలంలో జరిగిన సంఘటనకు రాష్ట్రప్రభుత్వాన్ని ఎలా రద్ధు చేస్తారూ? అనకండి
సవ్యమైన లాజిక్కులు ఆలోచనాపరులకు మాత్రమే అవసరం.
 వేయి రూపాయలనోట్లు సులువుగా దాచేస్తున్నారూ నల్లధనం పెరిగిపోతోందీ అని ఆలోచించి అవి రద్ధు చేసి రెండువేల రూపాయల నోట్లుతీసుకువస్తే నల్లధనం కట్టడి అవుతుందని లాజిక్ వెలిగించిన మహానుభావుల తంత్రాంగం సవ్యమైన లాజిక్కులు ఆలోచిస్తుందని అనుకోవటం అవివేకం.
విశాఖపట్నం ఆంద్రాలో ఉంది.
ఆంధ్రాముఖ్యమంత్రికీ (చి/పె)మోడీలకీ పడదు.
ఆంద్రాలో ఒక సంఘటన జరిగింది. (జరిపించాము)
అది చాలు రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని చెప్పటానికి.
అసలు ఆంధ్రాముఖ్యమంత్రి అన్నింటికీ అడ్డుపడే రకం.
శ్రీకాకుళం అని ఒక చోట తుఫానొస్తే అక్కడికిపోయి కూర్చున్నాడు కర్రపెత్తనం చేస్తూ.
దానితో సహాయక చర్యలు కుంటుబడి జనం బీజేపీతోనూ దాని సామంతపార్టీలతోనూ పోయి మొత్తుకున్నారు.
పైగా పరిపాలన అధ్వాన్నంగా ఉండబట్టే విశాఖలో గొప్ప ప్రమాదం తప్పింది ఒక నాయకుడికి.
అర సెంటీమీటరో ఒకటిన్నర సెంటీమీటరో పొడుగు గాయం ఐనది అతడికి.
పాపం, నాలుగ్గంటలు కత్తిపోటుగాయంతోనే విమానంలో హైదరాబాదు వచ్చి వైద్యం చేయించుకున్నాడు.
హుటాహుటిన ఐసియూలో కట్టుకట్టి అంటీబయాటిక్సూ, పెయిన్ కిల్లర్సూ వంటి బహు ఖరీదైన మందులిచ్చారు.
శాంతిభద్రతలు ఇంత దరిద్రంగా ఉంటే ఎలా?
అందుకే రాష్ట్రపతి పాలన అనే అస్త్రం ప్రయోగిస్తాం అంటారు.


శుభం. అదెప్పుడూ?

ఏమో ఈ రాత్రి ఏక్షణంలో ఐనా రావచ్చును.
అర్థరాత్రి ప్రకటలన హుషారు ప్రథాని ఏలుబడి దేశం కదా మనది.
ఒకవేళ, ఈ సంఘటనతో మనమే అల్లరి పాలయ్యాం అనుకుంటే మాత్రం మరొక సంఘటన జరిగేంతవరకూ (లేదా జరిపించేంత వరకూ) వేచిచూస్తారు.


ఆంద్రాముఖ్యమంత్రిని అరెష్టు చేస్తారా?

రాష్ట్రపతి పరిపాలన విధించే పక్షంలో, కుట్రదారుడు ఆయనే అని (ఒక వీరవనిత భాషలో వాడే అని) అరెష్టు చేసినా చేయవచ్చును.


ఏ నిముషానికి ఏమి జరుగనో ఎవరూహించెదరు?

ఎందుకూ ఊహించటం? మీకేం పని లేదా?
జరిగేది చూడటమే.
మీరో నేనో ఆవేశపడితే ఒరిగేది ఏమీ లేదు సుమండీ.

అందరి వెతలు దీర్చు


అందరి వెతలు దీర్చు నా రాముడే
అందరికి దేవుడైన ఆ రాముడే

అందరిలో పలుచనై యలమటించు వారికి
చెందవలసిన సిరి చెడిపోయిన వారికి
బందుగులను నమ్మి  బాధపడుచుండు వారికి
కుందణచి చేరదీసుకొను వాడు వాడే

కాలము కలసిరాక కష్ట పడువారికి
ఆలుమగలసఖ్యత యటమటగు వారికి
నీలాపనిందలకు నీరసించు వారికి
చాల యూరట నీయజాలునది వాడే

ఈపూట కెట్లనో రేపెట్లు గడచుననో
వాపోవు వారలకు వరుదుడు వాడే
పాపాల పుట్టననో పాపి బెదిరించెననో
తాపమొందు వారికి దారిచూపు వాడే


నమో నమో విశ్వజనక

నమో నమో విశ్వజనక నారాయణా
నమో నమో విశ్వపోష నారాయణా

నమో మత్స కూర్మ కిటి నారసింహ రూప
నమో నమో వటు రూప నారాయణా
నమో రామ రామ రామ నందకుమారా
నమో బుధ్ధ కల్కి రూప నారాయణా

నమో నమో త్రిపురాంతక నారాచ రూప
నమో మోహినీరూప నారాయణా
నమో  కపిల ఋషభ నర నారాయణ రూప
నమో  దత్త నారద పృధు నారాయణా

నమో సనకాదిక బ్రహ్మనందన రూప
నమో ధన్వంతరి రూపనారాయణా
నమో శ్రీయజ్ఞ వ్యాస రూప నారాయణా
నమో నమో నమో నమో నారాయణా

24, అక్టోబర్ 2018, బుధవారం

ఆకలిని మరపించును


ఆకలిని మరపించును హరినామము
ఆకించు విషయముల హరినామము

సురాసురులు కొలువగ శోభిల్లు నామము
హరున కిష్టమైనదీ హరినామము
అరిది భవతిమిరహర మైనదీ నామము
నరుని నోటికి రుచి నారాయణ నామము

సుందరాతిసుందరమై శోభిల్లు నామము
అందరికి హితవైన హరినామము
మందై భవరోగమును మాన్పెడు నామము
అందుకొనుడు నోటికెంతో అనువైన నామము

శ్రీరామ అనగానే చింతలన్ని పోకార్చి
అరాటము లణచునా హరినామము
నోరార పలికితే చేరదీసి భవసాగర
తీరమును చేర్చునా దివ్యమైన నామము

23, అక్టోబర్ 2018, మంగళవారం

కల దేమూలనో


కల దేమూలనో కీర్తికాంక్ష యీ జీవునకు
తలయెత్తినపు డది తలదించు నీముందు

ధనము కలదేని యిల తానింత బొక్కును
ధనముల మేలిరకపు ధనము కీర్తి ధనము
తనకది స్వర్గవాసమును గూర్చునే కాని
నిను గూర్చ దద్దాని గొననేల కాంక్షయో

యెన్నెన్ని చదివి వీ డెన్నెన్ని చేసినను
ఎన్నిజన్మములెత్తి యెంతభోగించినను
నిన్నెరుగు దాక సుఖ మన్నదెరుగునా
యిన్నాళ్ళ కెరిగి కీర్తి కేల నారాటమో

తారకనామమే తనయొద్ద యుండగా
వేరేల యనుబుధ్ధి వెడలించ పెనుమాయ
ఆరాటపడు చుండు నంతియే గాక ఓ
శ్రీరామ కీర్తిదుష్కీర్తు లెందులకయా


15, అక్టోబర్ 2018, సోమవారం

రామరామ యనుచుంటి


రామరామ యనుచుంటి రక్షించు మనుచుంటి
నీ మీద గురియుంచి నీవాడనై యుంటి

భావాంబరవీధి నీదు భవ్యరూపము నించి
జీవుడ నిన్నే వేళ చింతించుచు నుంటి
దేవుడా నీవు తక్క దిక్కిం కెవరంటి
రావయ్య వేవేగ రక్షించవయ్య

వేలకొలది నామముల వేడుకైన నామమని
మేలైన నామము జగమేలు రామనామమని
నాలోన నమ్మియుంటి నావాడ వనుకొంటి
చాలదా వేవేగ సంరక్షచేయవే

ఎన్నటికిని దాటరాని యీభవాబ్ధి నుంటి
ఎన్నెన్నో యోటిపడవ లెక్కి విడచియుంటి
యిన్నాళ్ళకు రామనామ మన్న నౌక గంటి
విన్నాణము గొంటి నింక వేగ రక్షించవే


14, అక్టోబర్ 2018, ఆదివారం

గోవిందుడు హరి గురువై


గోవిందుడు హరి గురువై యుండగ
జీవులు దుర్గతి చెందెదరా

వినిన చాలురా వెన్నుని చరితలు
అనిన చాలురా హరినామములు
కనిన చాలురా గరుడవాహనుని
మనసారగ నొక క్షణమైన

చాలును శ్రీహరి సంకీర్తనము
కాలుని వలన కలుగదు భయము
మేలగు సద్గతి మీకగు గాదే
శ్రీలోలుడు మిము చేరదీయగ

పామరులై భవవార్థి గ్రుంకులిడు
మీమీ యాత్మల మేలు కొఱకు హరి
మీ ముందుంచెను ప్రేమమీఱగ
రామనామమను రక్షణకవచము

13, అక్టోబర్ 2018, శనివారం

ధర్మవీరుడా రామ దండాలు


ధర్మవీరుడా రామ దండాలు
కర్మవీరుడా నీకు దండాలు

ధనకనకములు కాక దాశరథీ నీ కరుణ
అనిశము కోరువారి నాదరించు దేవుడవు
మనసున నిన్ను నిలిపి మరువక కొలుచుచుండు
జనుల నేవేళ బ్రోచు చల్లని తండ్రివి

శరణన్న వారి నెల్ల సంతోషముగ కాచి
పరిరక్షణ చేయునట్టి భగవత్స్వరూపుడవు
నిరంతరము నీపేరు నిష్ఠతో ధ్యానించు
పరమభక్తుల నేలు పరమాత్ముండవు

అన్నిధర్మముల నీ వాచరించి చూపితివి
అన్నిలోకంబులకు నాదర్శపురుషుడవు
విన్నాణము గొలుపు చరిత వెలయించితి వీవు
నన్నేలి ముక్తినిచ్చు నారాయణుడవు

ఏమి చెప్పుదు నయ్య


ఏమి చెప్పుదు నయ్య యెందరో రక్కసుల
నామావశిష్టుల జేసినావు రామయ్య

పడతుల జెరబట్టు పాపబుధ్ధి యైనందున
పడగొట్టినావు రావణు రణమున
పడతుల నేడ్పించు పాపబుధ్ధులు నేడు
పుడమిని నిండి రిది పొడగాంచవు

యదుకులమున బుట్టి యవనిభారము దీర్ప
వెదకి రాకాసుల విరచితివి
వెదుకబని లేదు నేడు పెరిగి రీ ధరనిండ
సుదతులపాలి రాకాసులు గమనించవు

ఏమయ్య రక్కసుల కేమి తీసిపోవుదురు
భూమిని దుర్జనులై బోరవిరచుక
తామసులై తిరుగెడు ధర్మేతరులు నేడు
స్వామి వారల నేల చక్క జేయవు

11, అక్టోబర్ 2018, గురువారం

ఒకబాణము వేసి


ఒకబాణము వేసి యొంచరాదా
వికటపు కలినింక వీరుడ రామా

తరుణి సీతను బొంది దరహాసముఖుడవై
తరలుచుండు వేళ నిన్ను దాకి తీండ్రించిన
పరశురాముని పైన పరగ విల్లెక్కుపెట్టి
బిరాన నతని పుణ్య విభవమును గొట్టినట్లు

తరుణి సీత యొడిని తలనిడి నిదురించి
తరుణాన కాకి యొకటి ధరణిజను గీరిన
యరసి దానిపైన బ్రహ్మాస్త్ర మెక్కిడి
బిరాన దాని పరిభవించి విడిచి పెట్టినట్లు

తరుణి సీతని బాసి తెరువు జూపవే యని
పరిపరివిధముల నీవు ప్రార్థించ సాగరుడు
గరువాన మిన్నకున్న పరగవిల్లెక్కుపెట్టి
బిరాన నతని కాళ్ళ బేరమునకు తెచ్చినట్లు

పదిమంది దృష్టిలోన


పదిమంది దృష్టిలోన పడవలె నని నీకంత
యిదిగా నున్నదే అది మంచిది కాదు

హరి మెచ్చిన నదే చాలు ననుచు వినిపించక
నరుల మెప్పుకై వెంపరలేమిటికి
నరుడు మెచ్చు కీర్తనకు నాణ్యత హెచ్చునా
హరి మెచ్చుటే యానందము గాక

ఒరులిచ్చు ప్రశంస ల నొరుగున దేముండును
హరి ప్రశంసించె నేని యబ్బు ముక్తి
తరచుగా కీర్తి కొఱకు తహతహలాడు వాడు
పరము నార్జించుట వట్టిది సుమ్ము

పరగ రామకీర్తనలను ప్రజలు మెచ్చి పాడిరేని
హరి వారల  మెచ్చుకొను నంతియె కాక
విరచించితి రామునికై వినుడు మీరనుచు నీవు
నరుల మధ్య తిరుగుట పరమును చెఱచు

10, అక్టోబర్ 2018, బుధవారం

పరమయోగిని కాను


పరమయోగిని కాను పామరుడను కాను
హరి నీకు దాసుడనే యది చాలదా

వెనుకటి జన్మలలో వెఱ్ఱినో వివేకినో
యనునది నే నెఱుగ నది యటులుండ
మునుకొని యీ జన్మ ముడుపుగట్టితి నీకు
అనిశము సేవింతునే యది చాలదా

చనిన భవంబు లందు జల్పము లెన్నైనవో
యనునది నే నెఱుగ నది యటులుండ
విను మీ జన్మ మెల్ల విశదంబుగ నీ కీర్తి
అనిశము పాడుదునే యది చాలదా

అణగిన జన్మముల హరిభక్తి యున్నదా
యనునది నే నెఱుగ నది యటులుండ
ఇనకులేశ్వర రామ ఇప్పుడు నినుగూర్చి
అనిశము తపియింతునే యది చాలదా

ఎవరెవరి తప్పు లెంచి


ఎవరెవరి తప్పు లెంచి యేమిలాభము పూర్వ
భవముల చేసినపనుల ఫలము లిటులుండె గాన

పెట్టకుండ పుట్టదను పెద్దల మాటలు నిజము
చెట్టబుధ్ధి చేత దానశీలమును
గట్టున పెట్టినట్టి ఘనుడ నే నైతి నేమొ
కట్టికుడుపు చున్న దిప్పు డట్టి పాపమె

భాగవతుల పరిహసించ పరమమూఢు డగు నందురు
సాగి నేనట్టి తప్పు చాల జేయగ
యోగనిష్ఠ యందు బుధ్ధి యొక్కనిముష ముండదాయె
భోగభూము లందె నిలచిపోవు చుండు నయ్యయ్యో

రామచంద్ర నీవు కాక రక్షసేయ వార లెవరు
కామితార్థమైన ముక్తి కలుగు టెట్లో
యేమిచేయ జాల నట్టి హీనుడను శరణు శరణు
నా మెఱాలకించ వయ్య నన్ను కావ రావయ్య


9, అక్టోబర్ 2018, మంగళవారం

వారగణనం - 1


నిత్యం మనం వాడుతూ ఉన్న గ్రిగొరియన్ కాలెండర్లో ఇచ్చిన తారీఖునకు సరియైన వారం గణితం వేసే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. అప్పుడప్పుడు అష్టావధానాల్లో సభలోని వారో పృచ్ఛకులో ఏదో ఒక తారీఖు చెప్పి ఆరోజు ఏవారం  ఐనదీ చెప్పమనటమూ అవధాని వెంటనే చెప్పటమూ మంచి వినోదంగా ఉంటుంది.

తారీఖుకు వారం కనుక్కోవటం కేవలం గణితం.

అతిసులభం అనలేము కాని సులభం అనే చెప్పాలి.

మొదట ఈ టేబుల్ భట్టీయం వేయాలి

జనవరి  0
ఫిబ్రవరి  3
మార్చి  3
ఏప్రిల్   6
మే     1
జూన్    4
జూలై    6
ఆగష్టు   2
సెప్టెంబరు 5
అక్టోబరు  0
నవంబరు 3
డిసెంబరు 5

ఈ టేబుల్ వెనుకాల బ్రహ్మ రహస్యం ఏమీ లేదు.

జనవరి 1వ తారీఖు ఆది వారం అనుకుంటే ఫిబ్రవరి 1వ తారీఖు బుధవారం అవుతుంది. ఎందుకలా అంటే జనవరిలో 31రోజులుంటాయి కదా, అందులో 28రోజులు (పూర్తివారాలు) కొట్టివేస్తే మిగిలేది 3 కాబట్టి. ఫిబ్రవరి 1 బుధవారం ఐతే (లీపు సంవత్సరం కాని సం. లో) మార్చి 1వ తేదీ బుధవారమే అవుతుంది. మరలా మార్చిలో 31 రోజులు కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖున 3+31 =34లో 28రోజులు కొట్టివేస్తే 6వది అవుతుంది.  ఇలా సంవత్సరంలో ప్రతినెల మొదటి తారీఖు ఏవారం అయ్యేదీ తెలిపే టెబుల్ ఇదన్నమాట, ఈ టేబుల్ ప్రకారం సంవత్సరంలో మొదటిది ఆదివారం అనుకుంటూన్నాం అంతే.

ప్రతిసంవత్సరానికీ 365 రోజులు. ఒక సంవత్సరం లో పూర్తివారాలు కొట్టివేస్తే 1రోజు అదనం అన్నమాట, కాబట్టి ఒకసంవత్సరం మొదటి తారీఖు ఆదివారం ఐతే (అది లీపు సంవత్సరం కాకపోతే) అ తరువాతి సంవత్సరం మొదటి తారీఖు సోమవారం అవుతుంది.

ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక లీపు సంవత్సరం వస్తుంది.

ఇప్పుడు 20వ శతాబ్దంలోని తారీఖులకు వారాలు సులభంగా ఎలా చెప్పవచ్చో చూద్దాం. (తరువాత ఇతర శతాబ్దాల సంగతీ చూద్దాం).

నిజానికి 20వ శతాబ్దం 1901 సంవత్సరంతో మొదలు అవుతుంది. 1900తో కాదు. కాని మన గణితానికి 1900 ఐనా ఇబ్బంది లేదు.

1900- జనవరి -1 ఏ వారం?

సూత్రం. సంవత్సరం + సంవత్సరం/4  + నెలకు టేబుల్ ఇండెక్స్ + నెలలో తారీఖు

గణితం.  0 + 0 + 0 + 1

ఇక్కడ సంవత్సరం అంటే శతాబ్దంభాగాన్ని వదిలేయాలి. కేవలం సంవత్సరభాగం 00 మాత్రం తీసుకోవాలి. ఈ సున్నను 4చేత భాగిస్తే వచ్చేది 0 కదా. టేబుల్ ప్రకారం జనవరి ఇండెక్స్ 0. నెలలో తారీఖు 1. అన్నీ కలిపితే వచ్చేది 1. ఆది వారం 0 నుండి లెక్కవేస్తే 1సోమవారం . ఇది సరైనదే.

1947- ఆగష్టు - 15 ఏ వారం?

గణితం.
     సంవత్సరం      47
    47/4 విలువ    11
    ఆగష్టు ఇండెక్స్    2
   తారీఖు          15
   మొత్తం  47+11+2+15 = 75
   ఈ 75 ను 7 చేత భాగిస్తే శేషం 5 అంటే శుక్రవారం.

ఇలా ఏసంవత్సరంలో ఏనెల కైనా చేయవచ్చును. కాని లీపు సంవత్సరాలతో కొంచెం పేచీ వస్తుంది చూడండి.

1996-1-1 ఏ వారం?

గణితం.  96 + 96/4 + 0 + 1 = 121
      121ని 7 చేత భాగిస్తే శేషం 2 అంటే మంగళవారం.
      ఇది తప్పు. ఆ రోజు సోమవారం.

సవరణ.  తప్పు ఎందుకు వచ్చిందంటే 4 సంవత్సరాలకూ ఒకరోజు చొప్పున 96సంవత్సరాలకు 24రోజులు. కాని ఈ అదనపు దినం కలిసేది మార్చి నుండి కాని జనవరి నుండి కాదు కదా? అందుచేత లీపు సంవత్సరాలలో మాత్రం జనవరి, ఫిబ్రవరి నెలలకు సమాధానాన్ని ఒకరోజు వెనక్కు జరపాలి.

ఇప్పుడంతా సరిగ్గానే ఉంది కదా?

మొదట ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. దానికో చిట్కా ఏమిటంటే 0336, 1462, 5035 అనే సంఖ్యలను గుర్తుపెట్టుకోవటమే. రెండవది కొన్ని ఇరవయ్యవ శతాబ్దపు తారీఖులకు వారాలు గణనం చేస్తూ ఈ గణితాన్ని బాగా ఆభ్యాసం చేయాలి. 

మరొక చిట్కా గుర్తుపెట్టుకోవాలి. చివరన 7 చేత భాగించి శేషం మాత్రం వాడతాము. కాబట్టి ఎక్కడికక్కడ 7చేత భాగహారం చేసుకోవచ్చును.  1996-1-1 ఏ వారం? అన్నప్పుడు 96 + 96/4 + 0 + 1 = 121 అని ప్రయాస పడనక్కరలేదు. 96 బదులు 5 తీసుకొని దీనికి 24 బదులు 3 కలిపితే 8 అంటే 1 దీనికి 0 కలిపితే 1 మళ్ళా 1 కలిపితే 2. కాని లీపు సంవత్సరంలో మార్చికి ముందు నెలలు కాబట్టి 1 తగ్గిస్తే 2-1=1 సోమవారం అని వేగంగా నోటి లెక్క చేయవచ్చును. 7వ ఎక్కం బాగా రావాలి ముందు.

రాబోయే టపాలో ఈ సూత్రాన్ని విస్తరించి ఏశతాబ్దంలో ఐనా ఎలా గణనం చేయవచ్చునో చెబుతాను.

5, అక్టోబర్ 2018, శుక్రవారం

సీతమ్మా రామయ్యకు


సీతమ్మా రామయ్యకు చెప్పరాదటమ్మా
మా తప్పులు మన్నించి మమ్మేలుకొమ్మని

ఈ కలియుగమున మే మెంత యత్నించినను
మాకు ధర్మము పైన మనసు నిలువదే
ఆ కారణముచేత నగచాట్లు పడుచుంటిమి
మా కర్మమింతే నని మమ్ము వదలవద్దని

వదలలేకుంటి మీ పాడు కామక్రోధముల
తుదకేమో పరస్పరద్రోహములే
చిదుమ మా బ్రతుకులు చింతింతుము మిమ్ము
మదనారిసన్నుతుని మమ్ము వదలవద్ధని

తల్లిదండ్రులు మీరు తనయులము మేము
చల్లగా మీరు మమ్ము సాకకుందురే
యెల్లవేళల మీరు యించుకదయ చూపినచో
మెల్లగ నొకనాటికి మేము బాగుపడుదుము


దేవదేవ నిన్ను


దేవదేవ నిన్నునేను తెలియజాలను
నీ విధానము లెఱుగ నేనెంత వాడను

నే నెవడ ననునది నేనే యెఱుంగనే
నేననగ లోన ని న్నెఱుగు టెట్టిది
నీ నిజతత్త్వంబును నీరేజభవుడును
లో నెఱుంగడన్న నేనెంతవాడనో

విశ్వంబులన్నియు వెలయించితి వీవు
విశ్వంబులందు వెలెగె దీవు
విశ్వరూపుడ వీవు విశ్వాత్మకుడ వీవు
కావుమ నిన్నే కరణి తెలియు వాడను

నీవే రాముడవని నిన్నదాక తెలిసితినా
భావించ నిప్పు డో భగవంతుడ
నీవే తెలిపితివి గాన నే నెఱింగితి నిదే
భావనాతీతప్రభావ నీ దాసుడను


4, అక్టోబర్ 2018, గురువారం

హాయిగా రామరామ యనుచు


హాయిగా రామరామ యనుచు పాడేవు
తీయగా ఓ చిలుకా దిక్కులు నిండగను

ఎవరు నేర్పించిరే యీ రామనామము
చవులూరంగ చక్కగ నీ
వవలంబించితి వందాలచిలుకా
చెవులకు సుఖమగు శ్రీహరినామము

పడియుండితి విటు పంజరమున నీవు
కుడుచెద విదె కొన్ని గింజలే
యిడుమల మధ్యన నిదె రామనామము
కడువేడ్క నేర్చి చాల గడితేరితివే

మంచిపంజర మను భ్రమలేని చిలుకా
మంచివాడంటే మనరాముడే
యించుక తాళవే యీ రామనామమే
మంచితాళపుచెవి మాయపంజరానికి


3, అక్టోబర్ 2018, బుధవారం

చూడ నందరకు


చూడ నందరకు పెద్దచుట్టంబవ నీవు
వేడుకతో విందువు మా విన్నపంబులు

మాకు ధర్మ మెఱుకగు మార్గమే దంటేను
లోకావననిపుణ నరాకారము దాల్చి
శ్రీకర దయాళో శ్రీరామమూర్తివై
నీకథయే మార్గముగా మాకొసగిన చుట్టమవు

తరణోపాయ మొకటి దయచేయ మంటేను
నరులకిచ్చితివి నీ నామమంత్రము
పరమపామరులము పతితపావననామ
కరుణాలయ నీవే కడుపెద్ద చుట్టమవు

కలిమాయ క్రమ్మిన కపటలోకమునందు
వెలుగుదారి మాకు వెల్లడిచేయు
నళినాక్ష నీ దివ్య నామమంత్రము కాన
నిలనెల్లవారి కీవె యెంతోపెద్ద చుట్టమవు

2, అక్టోబర్ 2018, మంగళవారం

ఇప్పటి కిది దక్కె


ఇప్పటి కిది దక్కె నింతయ చాలు
నెప్పటి కైన ముక్తి నీయక పోవు

నీవు లోకేశుడవని నిశ్చయముగ నెఱిగి
నీవుదక్క గతిలేదని నిశ్చయముగ నెఱిగి
నీవు మోక్షదాతవని నిశ్చయముగ నెఱిగి
భావంబున నిలచెను భక్తి నీమీద

నీవు నావాడవని నిశ్చయముగ నెఱిగి
నీవు రక్షింతువని నిశ్చయముగ నెఱిగి
నీవు నా సర్వమని నిశ్చయముగ నెఱిగి
భావమున ప్రేమ నీ పైననే నిలచెను

నీవు నాలో గలవని నిశ్చయమగ నెఱిగి
నీవు నా ఆత్మవని నిశ్చయముగ నెఱిగి
నీవు నేను నొకటని నిశ్చయముగ నెఱిగి
భావంబిది రామ పరమశాంత మాయెను

చేయలేని పనుల


చేయలేని పనుల దలచి చింతించి ఫలమేమి
చేయగలిగినట్టి పనులు చేసిన చాలు

శక్తికి మించి ధనము సంపాదించుటకై
యుక్తులెప్పుడు పన్నుచుండు చిత్తము
రక్తిమీఱ కొద్దిసేపు రామచంద్రమూర్తిని
ముక్తి కొఱకు ప్రార్థించి మురిసితే చాలదా

ప్రొద్దుపొడిచినది మొదలు నిద్దుర కొఱగుదాక
సద్దుచేయ కుండలేని చచ్చు నాలుక
కొద్దిసేపైన గాని గోవిందనామస్మరణ
ముద్దుముద్దుగా చేసి మురిసితే చాలదా

వారివీరి సేవించి బ్రతుకీడ్చెడు కాయము
ఘోరమైన రోగాల కుప్ప కాయము
పారమార్థికము తలచి పరగ నొక్క ఘడియైన
చేరి శ్రీహరి సేవ చేసిన చాలదా

ఇచటి కేమిటి కని

ఇచటి కేమిటి కని యిందరు వత్తురో
విచిత్రమగు నెల్లవిధముల చూడ

మాయముసుగులు తొడిగి మతిమాలి గంతులు
వేయుచు తిరిగేరు వెంగళులై
చేయరాని పనులు చేసి చెడుఫలితము లొంది
మోయలేని కష్టాలు మోయుచు తిరిగేరు

వచ్చిన దెందుకో భావించ రెవ్వరును
వచ్చి చేసే రెన్నో పిచ్చి పనులు
ఎచ్చోటి నుండి వచ్చి రెన్నాళ్ళ ముచ్చటో
యిచ్చట నే యొక్కరి కిసుమంత పట్టదు

తిరిగిపోవ దారేదో తెలియనేరమి జేసి
తిరుగుచునే గడిపేరీ ధరను వీరు
పరమాత్ముడు రాముని పాదములు పట్టి
మరల స్వస్థితికి కొద్దిమంది చేరెదరు

వేరువారి జేరి నేను


వేరువారి జేరి నేను విన్నవింతునా
శ్రీరామ నీకే నేను చెప్పుకొందు గాక

ఊరక సంసారమం దుంచితి విదె నీవు
తీరిక లేనట్లు మోము త్రిప్పు కొందువా
నా రక్షణభార మది నమ్మకముగ నీదేను
ఔరౌరా కాని వాడ నైతినా సీతాపతి

తప్పించుకు తిరుగుట నీ తరముగా దొకనాడు
తప్పక నిన్ను చేరి తప్పులెంచనే
యిప్పటి కైన న న్నొప్పుగ కరుణించితే
తప్పును నా ఘోష నీకు దశరథరామయ్య

సర్వలోకరక్షకుడే సంరక్ష జేయకున్న
నిర్వహించుకొను టెట్లు నే నీ బ్రతుకు
దుర్వారమైన తాపదోషముచే తిట్టితే
గర్వ మనుకొనక దయగనుము నీ దాసుడ

1, అక్టోబర్ 2018, సోమవారం

ఆశలపల్లకి నధిరోహించుము


ఆశలపల్లకి నధిరోహించుము
దాశరథి దయజూచె నిను

బహుభవములుగా పరితపించితివి
అహరహమును శ్రీహరికై నీవు
ఇహమున పొందిన నిడుము లడగును
తహతహ లన్నియు తగ్గునని

పరబ్రహ్మమును భావించితివి
నిరతము మదిలో నిండుగ నీవు
పరము కలిగినది బహుధన్యుడవు
హరి నీవాడై యుండునని

నోరునొవ్వగ తారకమంత్రము
నారాధించిన వీరుడ వీవు
కూరిమి చూపెను శ్రీరఘునాథుడు
మారుజన్మమను మాటే లేదని