అష్టాక్షరి అనేది ఒక ఛందస్సు. కొత్త ఛందస్సు.
భయపడకండి. ఇది ఛందస్సు అన్నా కూడా ఇది అందరికోసమూ ఐన ఛందస్సు కాబట్టి ఏమీ భయపడకండి.
అష్టాక్షరి అంటే ఎనిమిది అక్షరాలున్నది అని అర్థం. ఇదొక సంస్కృతపదం.
కానీ ఈ అష్టాక్షరి కేవలం తెలుగు ఛందస్సు. ఆట్టే నియమాలంటూ ఏమీ లేని ఛందస్సు. నిజం చెప్పాలంటే సంప్రదాయిక లాక్షణిక నియమాలేవీ లేని ఛందస్సు. కాబట్టి అందరూ ఈ అష్టాక్షరులు హాయిగా వ్రాసుకోవచ్చును.
ఈ అష్టాక్షరికి ఉన్న నియమాలల్లా ఈ కాసినే. అన్నీ తేలికపాటి నియమాలే.
- 8 అక్షరాలు ఒక యూనిట్. అంటే, ఒక పాదం అనుకోండి. (గురువులూ లఘువులూ అన్న తూనికలూ కొలతలూ లేవు)
- పాదంలో చివరి మాట అసంపూర్ణంగా ఉండటానికి వీల్లేదు. ఐతే పాదం ఒక పూర్తి వాక్యం కానక్కర్లేదు
- రెండు పాదాలు ఒక పద్యం.
- పాదంలో యతినియమం ఏమీ లేదు.
- పద్యంలో ప్రాసనియమం కూడా ఏమీ లేదు.
- ఒక్కో పంక్తిలో (లైనులో) ఒకటి (సగం పద్యాన్ని) లేదా రెండు పాదాలను (అంటే పూర్తి పద్యాన్ని) వ్రాయాలి.
- తోరణంలా ఎన్ని పద్యాలైనా అలా అలా వ్రాసుకుంటూ పోవచ్చును.
- సుబ్బరంగా వ్యావహారికభాషలో వ్రాయవచ్చును.
ఇంతే నండి, ఇవన్నీ తేలిక నియమాలే అని ఒప్పుకుంటారు కదా. యతిలేదు ప్రాసలేదు వ్యావహారికంలో సుబ్బరంగా వ్రాసుకోవచ్చును. ఎంతపొడుగ్గా ఐనా వ్రాసుకోవచ్చును. ఇంకేం కావాలి మనకి?
ఒక సందేహం రావచ్చును. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండేసి అష్టాక్షరుల జంటలు వ్రాయాలి కాని బేసిగా వ్రాయకూడదూ అని ఒక పధ్ధతి అనుకున్నాక హాయిగా షోడశి (పదహారు) అనుకోవచ్చుగా పేరూ అని. నిజమే. కాని ఒక కారణంగా అష్టాదశి అనే అన్నాను. ఎందుకంటే ఏ అష్టాదశికి అదే కొన్ని మాటల సమాహారంగా ఉండాలే కాని ఒక ఎనిమిది అక్షరాల సముదాయం లోంచి చివరి మాటను తరువాతి అష్టాక్షరిలో కొనసాగించటానికి వీలు లేదూ అను కూడా అనుకుంటున్నాం కాబట్టి.
ఇకపోతే లయ పాటించాలా? లేదా అంత్యప్రాసలు పాటించాలా? వంటి ప్రశ్నలకు అన్నింటికీ ఒకటే జవాబు. మీ ఓపిక మేరకు ఎలాగన్నా చేసుకోవచ్చును.
అలాగే, గ్రాంథికంలో వ్రాయకూడదా? యతి ప్రాసలు పెట్టకూడదా వంటివి. అంతా మీ యిష్టం. ఏదైనా ఒక పద్దతిగా తోచినట్లుగా వ్రాయవచ్చును. అంతే.
కొసమెరుపు. సంస్కృతంలోని అనుష్టుప్పు ఛందస్సు తెలుగు అష్టాక్షరిలో అంతర్భాగమే. మనం అనుష్టుప్పుకు ఉన్న అదనపు నియమాలు తొలగంచామన్నమాట.
చిన ఉదాహరణ ఐనా వ్రాయకుండా ఈ అష్టాక్షరిని పరిచయం చేయటం బాగుండదు కదా.
శ్రీగణనాయక నీకు చేతులెత్తి మొక్కేనయ్యా
నా కండదండవు నువ్వే నన్ను దయ చూడవయ్యా
ఓ అమ్మల కన్న అమ్మా అమ్మ వంటే నువ్వే నమ్మా
అమ్మా దుర్గమ్మ తల్లీ అరసి రక్షించ వమ్మా
ఓం ప్రథమం అష్టాక్షరులు ఇష్టదేవతా స్తుతితో ఉండాలని అలాగు సంకల్పం చేసి వ్రాసినవి.
చదువరులు కూడా ఈ అష్టాక్షరులు వ్రాయటానికి ప్రయత్నించ వలసిందిగా నా చిన్న సూచన.
నేను |హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విశ్లేషణం| అని ఒక పోస్టు వేశాను.దానికి సంబంధించి మీ అభిప్రాయం కావాలి.రామాయణంలో గొదవలకి కారణమైన ముఖ్యమైన సన్నివేశాల్ని ఆ సన్నివేశం అసలు యెలా జరిగింది దాన్ని మనం యెలా అర్ధం చేసుకోవాలి అనేది విశ్లేషించాను.కానీ అంతా పూర్తయి పబిష్ చేశాక ఒక సందేహం పీకుతుంది.నేను సన్నివేశాల గురించి ఉషశ్రీ తెలుగు అనువాదాన్ని ఫాలో అయ్యాను.ఆయన మట్టుకు ఆయన "వాల్మీకి చెప్పనిది ఒక్క అక్షరం చేర్చలేదు.వాల్మీకి చిప్పినది ఒక్క అక్షరం వదలలేదు" అని చెప్పుకున్నాడు గానీ చదివి చాలాకాలమై గుర్తు వున్నంత మేరకు మాత్రమే చాలా క్లుప్తంగా వఋనించాను.పుస్తకం దగ్గిర వుంటే అసలు ఇబ్బంది ఉండేది కాదు.
రిప్లయితొలగించండికాబట్టి ఒకసారి పోష్టుని జాగ్రత్తగా చదివి సన్నివేశాలకు సంబంధించిన వివరాల్లో యెక్కడైనా పొరపాటు ఉంటే చెప్పగలరు.ఇలాంటి విషయాల్లో అహంకారం ఉందకూడదు కాబట్టి మీ సూచనలు తప్ప్పక పాటిస్తాను.
పోస్టు ఇక్కడ చూడవచ్చు:|http://harikaalam.blogspot.in/2015/02/blog-post_14.html|
వీలు చేసుకొని తప్పక చదువుతానండీ. ధన్యవాదాలు.
తొలగించండి
తొలగించండిఇట్లా కొత్త ఛందస్సు అంటూ ఎనిమిది కండీషన్లు పెడ్తే ఎట్లా గండీ శ్యామలీయం వారు ! అసలు కండీషన్లు ఏవైనా లేకుండా చెప్పండి !!
జిలేబి
జిలేబీగారూ,
తొలగించండిఇందులో హాయిగా రాయటానికీ చదవటానికీ ఇబ్బందిగా ఉండే కండిషను ఏదన్నా ఒక్కటంటే ఒక్కటి చూపిస్తారా దయచేసి?
ఈ కొత్త (వ్యావహరికభాషా) ఛందస్సుని ప్రవేశపెట్టటంలో నా ఉద్దేశం వచనంలో రాయటానికి ఒక మంచి ఒరవడి తెద్దామనే కాని ఏదో నా గొప్ప చాటుకుందామని కాదు.
ఇలా నేను ఏం మాట్లాడినా ఏం రాసినా ఏదో ఒకరకంగా సందుచూసుకొని జనం వంకలు పెట్టే పక్షంలో తెలుగు బ్లాగుప్రపంచం వదిలేసి హాయిగా సుబ్బరంగా ఇంగ్లీషులో కవిత్వం రాసుకుంటాను. నాకేమీ ఇబ్బంది లేదు.
కం. తెలుగేదో రుచియని నే
వెలిగించుట సాటివారి వేళాకోళం
బులపాలౌ పక్షంబున
కలుగదె నా కొండు దారి కవితలు వ్రాయన్.
అన్-కండిషనల్‌గా నేను చెప్పగలిగినది ఈ ఒక్క మాటే నండి. చిత్తమండి. మన్నించండి.