24, ఫిబ్రవరి 2015, మంగళవారం

మన టీవీ‌ సీరియళ్ళు



ఏడుపులు మొత్తుకోళ్ళు
అరుపులు పెడబొబ్బలు
మన టీవీ సీరియళ్ళు
చెప్పరానంత కుళ్ళు

మతిలేని కథనాలు
వింతవింత మళుపులు
మన టీవీ సీరియళ్ళు
చెప్పరానంత కుళ్ళు

కుట్రలు కూహకాలు
ఎత్తులు పైయెత్తులు
మన టీవీ సీరియళ్ళు
చెప్పరానంత కుళ్ళు

ఐనా ఈ‌ ఆడవాళ్ళు
వాళ్ళ కింతలేసి కళ్ళు
వాళ్ళే కుళ్ళు సీరియళ్ళు
చూస్తారప్పగించి కళ్ళు

విలన్లంతా ఆడవాళ్ళు
చూస్తే తిరిగేను కళ్ళు
అబ్బబ్బో ఆ విసుళ్ళు
జ్వాలాతోరణాలు ఇళ్ళు

చీకటి పడగానే మగాళ్ళు
చేరుకుంటారు వాకిళ్ళు
టీవీ రణరంగాలా యిళ్ళు
ఐనా కిమ్మనరాదు వాళ్ళు

చూడు డబ్బింగు సీరియళ్ళు
అబ్బో అవి ఇళ్ళా రాజమహళ్ళు
ఆ పట్టుచీరల కష్టాల కావళ్ళు
కళ్ళల్లో మోస్తారు మన ఆడవాళ్ళు

వదలక చూస్తూ  ఆ పటాటోపాలు
అవుతున్నారు కోచ్ పొటాటోలు
దాంతో డబ్బులు మందులపాలు
గట్టిగా అంటే కోపతాపాలు


23, ఫిబ్రవరి 2015, సోమవారం

దొరికిన దొంగ!



ఒక ఎఱ్ఱచందనం స్మగ్లర్ మహాశయుణ్ణి పట్టుకున్నారు.
సంతోషం.

అలాంటి ఇలాంటి స్మగ్లర్ కాదండి.
ఎఱ్ఱచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాధినేత గంగిరెడ్డి అంటే యావన్మందికీ తెలుస్తుంది.
అంత ప్రసిధ్ధుడు
ప్రబుధ్ధుడు.

ఇంకా పూర్తి కథనం తెలుసుకోలేదు నేను.
వార్తలు వినాలి వీలుంటే పదింటికి.

సరే, ఒక బడాబడా స్మగ్లర్ని పట్టారండీ.
ఇప్పుడేం జరుగుతుంది?

ఆయన్ని (గౌరవంగా సంబోధించాలి మరిచిపోరాదు, ఎంత బడాదొంగైతే అంత గొప్ప గౌరవం మరి మనదేశంలో)  వేగిరం శిక్షించగలవా మనం‌ చట్టమూ‌ న్యాయమూను?

బహుశః ఏం‌జరుగుతుందో ఆలోచిద్దాం ఒకసారి.



  • అతగాడికి హఠాత్తుగా ఆరోగ్యసమస్యలు ఎదురౌతాయి.
  • బోలెడు వైద్యపరీక్షలు జరుగుతాయి.
  • అతడు అత్యంత ఉదారుడూ, యోగ్యుడూ, సజ్జనుడూ అని బందుమిత్రులు మీడియాలో గోలచేస్తారు.
  • ఆయన కొన్నాళ్ళు పోలిసు కాపలాతో ఐదు నక్షత్రాల స్పెషాలిటీ ట్రీట్‌మెంట్ సౌకర్యాలతో కాలక్షేపం చేస్తారు.
  • మేజస్ట్రీట్ గారు వారమో పద్నాలుగురోజులో‌ కష్టడీకి ఇస్తారు పోలీసులకు.
  • ఛార్జిషీట్లు ఫైల్ కావటానికే చాలా నెలలు బహుశః సంవత్సరం ఐనా పట్టవచ్చును.
  • ఆ ఛార్జిషీటు బాగోలేదనో అసమగ్రంగా ఉందనో కోర్టువారు కోప్పడితే మనం విని ఆనందించవచ్చును. మళ్ళా సరిగ్గా ఫైల్ చేయమని ఆదేశించవచ్చును.  దానికి బోలెడు గడువూ ఇవ్వవచ్చును.
  • అందాకా జైలులో రాజభోగాలు కావాలని ఆయన అడగటమూ, అత్యంత ఉదారంగా న్యాయస్థానాలు వాటిని అమోదించటమూ జరుగుతుంది.
  • రాజభోగాలు జరుగుతూ ఉండగానే బెయిల్ ప్రయత్నాలు జరుగుతాయి
  • వాటికి  కొన్ని వైఫల్యాలూ వగైరా కలుగుతాయి ప్రాసిక్యూషన్ వారు తీవ్రంగా అభ్యంతరాలు చెప్పటం వలన.
  • కొందరు రాజకీయ నాయకులు జైలుకు వెళ్ళి మరీ మంతనాలు జరుపుతే అశ్చర్యపోవద్దు మనం.
  • ఈ లోగా ఈడీ వారు కొన్ని కొన్ని ఆస్తులని ఆటాచ్ చేస్తారు.  అబ్బే ఎంత లేసి లెండి. కొండమీద దండెత్తి ఒకటి రెండు బండరాళ్ళు మోసుకు పోయినంతగా. అంతే.
  • మీడియాలో దానిపై నిరసనలు వెల్లువెత్తుతాయి సానుభూతిపరుల నుండి.
  • సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు స్మగ్లర్ గారు నిర్దోషిని నాపైన వివిధ కోర్టుల్లో ఉన్న కేసులు కొట్టేయండీ అని.
  • చివరికి రాం జెట్ మలానీగారు రంగంలో‌ దిగి ఆ మహాత్ముడు విడుదల కావాలీ అని అన్ని బల్లలూ గుద్ది వాదిస్తారు.
  • బెయిల్ ఇవ్వటానికి తమకేమీ అభ్యంతరం లేదని ప్రాసిక్యూషన్ వారు న్యాయస్థానానికి చెబుతారు.
  • చిద్విలాసంగా స్మగ్లర్ గారు విడుదల అవుతారు.
  • కేసు కొనసాగుతూనే ఉంటుంది.
  • ప్రాసిక్యూషన్  మరింత గడువు అడుతుతూ‌ ఉంటుంది ఎప్పటి కప్పుడు
  • కోర్టు మండిపడుతూ ఉంటుంది యథాప్రకారంగా, కానీ మళ్ళా మళ్ళా గడువులు ఇస్తూనే ఉంటుంది.
  • ముఖ్యసాక్షుల మరణాలు - అందులో కొందరివి అనుమానాస్పదం అని జనం చెవులు కొరుక్కోవటం జరుగుతుంది.
  • ఆయన జీవిత చరిత్ర పుస్తకాలుగా వ్రాసి కొందరు రచయితలు సొమ్ములు చేసుకుంటారు.
  • ఆయనకి కూడా అసంతృప్తి కలిగి, తానే ఒక ఆత్మకథ వ్రాస్తే అది బెష్ట్ సెల్లర్ గా ఏడాది పైనే నడుస్తుంది.
  • ఆయనపై తెలుగు సినిమా తీస్తున్నారన్న వార్త గుప్పుమటుంది.
  • హీరో ఎవరూ ఆపాత్రలో? ఎవరు బాగుంటారూ అని సినీ అభిమానుల చర్చలు మీడియాలో సోషల్ మీడియాల్లో!
  • ఈ కేసు ఎటుపోతోందీ‌? తేల్చండీ అని మేథావుల వ్యాసాలు మీడియాలో వస్తాయి.
  • ఈ లోగా ఎన్నికలు వస్తాయి.  ఎందుకు రావూ? ఇలాంటి ఛోటామోటా కారణాలకు ఎన్నికలు ఆపుతారా మరి?
  • ఈ‌యన సపోర్టుకోసం కూడా ఇండైరెక్టుగా చాలా మతలబులు నడుస్తాయి.
  • అందులో‌ కొన్నింటిమీద టీవీ ఛానెళ్ళవాళ్ళు ఎక్లూజివ్ కవరేజీలూ ఇస్తారు.
  • కేసు అలాగే కాగితాలమీద నిద్దరపోతూ ఉంటుంది.
  • ఆయన బెయిల్ పైన అనంతకాలం హాయిగా ఉండనే ఉంటాడు.
  • అన్నట్లు ఎఱ్ఱచందనం స్మగ్లింగ్ ఎందుకు ఆగటం లేదో తేల్చండీ అని,  అన్ని రాజకీయపక్షాలూ ఏమీ ఎరగనట్లు అరుస్తూ ఉంటాయి.
  • షరామామూలుగా జనం కొత్తకొత్త సెన్సేషనల్ వార్తల కోసం చూస్తూ ఈ వ్యవహారాన్ని పట్టించుకోరు.
  • సరే, ప్రభుత్వాలూ పట్టించుకోవు, కందకు లేని దురద కత్తిపీటకా అన్నట్లు,  ప్రజలకు లేని ఆసక్తి మనకెందుకూ‌ అని. 

అంతేనంటారా?
వేరేగా ఏమన్నా జరిగి శిక్షపడిపోతుందా అతగాడికి?
కాలమే చెప్పాలి.

అచ్చతెనుఁగు కావ్యం శృంగారశాకుంతలంలోని వృషభగతిరగడ







ఇది అచ్చతెనుఁగు కావ్యం శృంగారశాకుంతలంలోని వృషభగతిరగడ.


అచ్చతెనుఁగు కావ్యం‌ అంటే సంస్కృతపదాలూ, తత్సమాలూ ఏవీ వాడకుండా కేవలం తెలుగుపదాలతోనే నిర్మించిన కావ్యం అన్నమాట.

ఈ శృంగారశాకుంతలం అనే అచ్చతెలుగు కావ్యాన్ని వ్రాసిన కవిగారు కేసిరాజు సీతారామయ్యగారు. ఈ‌ కావ్యం ప్రథమ ముద్రణం 1959లో జరిగింది. నాకు తెలిసినంతవరకు, ప్రస్తుతం దీని ప్రతులు అందుబాటులో లేవు. ఈ కావ్యానికి జటావల్లభుల పురుషోత్తం గారూ, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారూ, చిలుకూరి పాపయ్యశాస్త్రిగారూ, ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రిగారూ, నండూరి బంగారయ్యగారూ తమతమ పండితాభిప్రాయాలను వ్రాసారు. కేసిరాజు వేంకట నృసింహ అప్పారావుగారు విపులమైన పీఠికను వ్రాసారు.

ప్రస్తుతం ఈ‌ కావ్యంలో ఉన్న వృషభగతిరగడను అందిస్తున్నాను.మన తెలుగుకవులు రగడలను వాడింది తక్కువే. ఏదో‌ ప్రబంధనిర్మాణకార్యక్రమంలో కావ్యానికొకటి చొప్పున సంప్రదాయం పాటించటాని కన్నట్లుగా వ్రాయటమే కాని ఆట్టే మక్కువను రగడలపై ప్రదర్శించింది కనరాదు. ఈ శృంగారశాకుంతలంలో కూడా ఒక రగడ ఉన్నది. అది కావ్యం ద్వితీయాశ్వాసంలో ఉంది. ముద్రణలో పద్యాలకు సంఖ్యాక్రమం ఇవ్వలేదు కాబట్టి పద్యసంఖ్యను ఇవ్వటం కుదరదు. పుట సంఖ్య 39-40లో ఉందని మాత్రం వివరం ఇవ్వగలను.

ఇది వృషభగతి రగడ అని చెప్పాను కదా. మనకు రగడలు ఆట్టే ప్రచారంలో కనిపించవు కాబట్టి, ఈ వృషభగతి రగడ లక్షణం మొదట వివరిస్తాను. మాత్రాఛందస్సు. పాదానికి 28 మాత్రల చొప్పున రెండు పాదాలు ఒక పద్యం. అంటే నాలుగు సప్తమాత్రాగణాలుగా ఉంటుంది. సప్తమాత్రలగణం అంటే ఒక సూర్యగణం పైన ఒక చతుర్మాత్రాగణం అన్నమాట. చతుర్మాత్రాగణంగా జగణం వదిలి భ,నల,గగ, స అనేవి వాడవచ్చును. (3+4) + (3+4) + (3+4) + (3+4) = 28 మాత్రలు అన్నమాట. ప్రాచీనకాలంలో రగడలకు ప్రాసనియమం లేకపోయినా తరువాత మనకవులంతా ప్రాసనియమం పాటించారు. మూడవ గణం మొదటి అక్షరం యతిస్థానం. దీని నడక మిశ్రగతి. వృషభగతికి త్రిపుటతాళం అని లక్షణశిరోమణిలో‌ రమణకవి ఉవాచ. రగడలలో అంత్యప్రాస సాధారణంగా ప్రయోగిస్తారు. కవుల రుచిభేదాన్ని బట్టి రకరకాల యమకాలూ అనుప్రాసలూ వగైరా కూడా యధేఛ్ఛ అన్నమాట. అలాగే లక్షణం ప్రకారం రెండుపాదాలు ఒక పద్యం ఐనా పద్యాలను తోరణంలా వ్రాసుకుంటూ పోతూ దండలాగా అనేకం గుదిగుచ్చుతారు.

సంప్రదాయికంగా మొత్తం రగడలోని పద్యాలన్నీ మధ్యలో ఖాళీలైనులు ఇవ్వకుండా ఒకే వరుసగా వ్రాసుకుంటూ పోతారు కాని పాఠకుల సౌలభ్యం దృష్టిలో ఉంచుకొని నేను ఈ‌ రగడలో ఏ పద్యానికి ఆ పద్యంగా ఎత్తి వ్రాసాను. అదీ కాక, ప్రతిపాదాన్నీ రెండు భాగాలుగా చూపటం చేసాను - లేకుంటే పాదం మరీ‌ పొడుగ్గా అనిపించి కొందరు జడుసుకొనే ప్రమాదం ఉంది కదా నేటి కాలంలో. 

ఇక కవిగారు చెప్పిన వృషభగతి రగడ.


వెలఁది వెలఁది వెడంద కన్నుల
     విప్పువిప్పుట నంటి కప్రము
నలరు నలరుల రాల్చు పుప్పొడి
     నల్లనల్లన వీడు చప్రము

లేమ లేమరువంబు లవియే
     లెక్కలెక్కకు మీఱె మోవులు
కోమ కోమలికంబుగాఁ గొన
     గోర గోరఁటఁ ద్రుంపు పూవులు

మనము మన ముంగిటను నీ యెల
     మావి మావిరిబోఁడి యూయెల
కొనకకొన కటు తాపుచో ననఁ
     గోయఁ గోయని కూసె కోయల

తలఁప తలపంతం బదేలను
     దాకఁ దాకకు తీవ మిన్నది
చెలువ చెలువగు తావి నెలపూఁ
     జిట్టజిట్టలుగాగ నున్నది

తుఱుము తుఱుమున మొల్లమొగ్గలు
     తూలి తూలిక జాఱెవాడఁగ
చుఱుకు చుఱుకున వీచు తెమ్మెర
     జుమ్ము జుమ్మని తేంట్లు వీడఁగ

రంగు రంగుల పూల వేచిగు
     రాకు రాకుము కోయఁగా నిట
చెంగు చెంగున క్రోవి నీ ర్వెద
     జల్ల జల్లని రాలు పూలట

పొగడ పొగడఁగఁ బూచె నీ సుర
     పొన్న పొన్నదలిర్చె నల్లదె
నిగనిగని పురివిచ్చి యాడెడు
     నెమ్మి నెమ్మిని జూడ నల్లదె

పూని పూనిలువెల్ల రాల్పఁగ
     పూపపూప బెడంగు కనుమిది
జాన జానగు పూవుఁ గొమ్మల
     సారెసారెకు వంచకుము గుది

కుదుర కుదురుల నీరు వోయగ
     కొల్లకొల్లగఁ బూచె మల్లియ
పొదలు పొదలుట జూడుమీ యెల
     పోఁకపోకడ గనుము చెల్లియ

చెలియ చెలియలి ప్రేంకణం బిదె
     చేరి చేరిక ననల ద్రుంపకు
కలికి కలికితనంబు గాదిది
     కన్నె కన్నెర జేసి నింపకు

వలను వలనుగ నెగిరిపడు గొరు
     వంక వంకను జూడు మియ్యెడ
చిలుక చిలుకలు ముద్దుపలుకులు
     చేరు చేరువ నున్న కుయ్యిడ

తగవు తగవులమారి తుమ్మెద
     తారుతారుము మమ్ము వీడుము
నగడు నగడువడంగ నీకిది
     నాలి నాలితనంబుఁ జూడుము

మంచి మంచి రకాల పూలెన
     మాలి మాలియ గుత్తు మింతట
నంచు నంచుల తా మొడళ్ళను
     నలరు నలరులఁ గోసి రంతట





17, ఫిబ్రవరి 2015, మంగళవారం

శ్రీమదాంధ్రమహాభారతంలో నన్నయ్యగారు అర్జునుడిచే చేయించిన శివస్తుతి దండకం









శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారిప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానందసందోహసంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైవ తత్త్వంబు భేదించి బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబుల్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా భవానీపతీ నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్నిసోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్ర క్రియాయంత్రవాహుండవై తాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంతయోగస్థితిన్ నిర్మలజ్ఞానదీపప్రభాజాల విధ్వస్త నిస్సార సంసారమాయాంధకారుల్ జితక్రోధరాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాదపంకేరుహ ధ్యానపీయూష ధారానుభూతిన్ సదాతృప్తులై నిత్యులై రవ్యయా భవ్యసేవ్యాభవా భర్గ భట్టారకా భార్గవాగస్త్యకుత్సాదినానామునిస్తోత్రదత్తావధానా లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ ప్రసాదంబున్ సర్వగీర్వాణగంధర్వులున్ సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ  త్రిలోకైకనాథా నమస్తే నమస్తే నమః.


శ్రీమదాంధ్రమహాభారతం - ఆరణ్యపర్వం.







14, ఫిబ్రవరి 2015, శనివారం

అష్టాక్షరి - వ్యావహారికభాష కోసం ఒక ఛందస్సు.

ఈ అష్టాక్షరి అనేది ఒక సినిమా పేరు కాదు.

అష్టాక్షరి అనేది ఒక ఛందస్సు. కొత్త ఛందస్సు.

భయపడకండి.  ఇది ఛందస్సు అన్నా కూడా ఇది అందరికోసమూ ఐన ఛందస్సు కాబట్టి ఏమీ భయపడకండి.

అష్టాక్షరి అంటే ఎనిమిది అక్షరాలున్నది అని అర్థం.  ఇదొక సంస్కృతపదం.

కానీ ఈ అష్టాక్షరి కేవలం తెలుగు ఛందస్సు. ఆట్టే నియమాలంటూ ఏమీ లేని ఛందస్సు. నిజం చెప్పాలంటే సంప్రదాయిక లాక్షణిక నియమాలేవీ లేని ఛందస్సు. కాబట్టి అందరూ ఈ అష్టాక్షరులు హాయిగా వ్రాసుకోవచ్చును.

ఈ అష్టాక్షరికి ఉన్న నియమాలల్లా ఈ కాసినే. అన్నీ తేలికపాటి నియమాలే.

  1. 8 అక్షరాలు ఒక యూనిట్. అంటే, ఒక పాదం అనుకోండి. (గురువులూ లఘువులూ అన్న తూనికలూ కొలతలూ లేవు)
  2. పాదంలో చివరి మాట అసంపూర్ణంగా ఉండటానికి వీల్లేదు. ఐతే పాదం ఒక పూర్తి వాక్యం కానక్కర్లేదు
  3. రెండు పాదాలు ఒక పద్యం.
  4. పాదంలో యతినియమం ఏమీ లేదు.
  5. పద్యంలో ప్రాసనియమం కూడా ఏమీ లేదు.
  6. ఒక్కో పంక్తిలో (లైనులో) ఒకటి (సగం పద్యాన్ని)  లేదా రెండు పాదాలను (అంటే పూర్తి పద్యాన్ని) వ్రాయాలి.
  7. తోరణంలా ఎన్ని పద్యాలైనా అలా అలా   వ్రాసుకుంటూ పోవచ్చును.
  8. సుబ్బరంగా వ్యావహారికభాషలో వ్రాయవచ్చును.  

ఇంతే నండి,  ఇవన్నీ తేలిక నియమాలే అని ఒప్పుకుంటారు కదా. యతిలేదు ప్రాసలేదు వ్యావహారికంలో సుబ్బరంగా వ్రాసుకోవచ్చును. ఎంతపొడుగ్గా ఐనా వ్రాసుకోవచ్చును.  ఇంకేం కావాలి మనకి?

ఒక సందేహం రావచ్చును.  ఎట్టి పరిస్థితుల్లోనూ రెండేసి అష్టాక్షరుల జంటలు వ్రాయాలి కాని బేసిగా వ్రాయకూడదూ అని ఒక పధ్ధతి అనుకున్నాక హాయిగా షోడశి (పదహారు) అనుకోవచ్చుగా పేరూ అని.  నిజమే. కాని ఒక కారణంగా అష్టాదశి అనే అన్నాను. ఎందుకంటే ఏ అష్టాదశికి అదే కొన్ని మాటల సమాహారంగా ఉండాలే‌ కాని ఒక ఎనిమిది అక్షరాల సముదాయం లోంచి చివరి మాటను తరువాతి అష్టాక్షరిలో కొనసాగించటానికి వీలు లేదూ అను కూడా అనుకుంటున్నాం కాబట్టి.

ఇకపోతే లయ పాటించాలా? లేదా అంత్యప్రాసలు పాటించాలా? వంటి ప్రశ్నలకు అన్నింటికీ‌ ఒకటే జవాబు. మీ ఓపిక మేరకు ఎలాగన్నా చేసుకోవచ్చును.

అలాగే,  గ్రాంథికంలో వ్రాయకూడదా? యతి ప్రాసలు పెట్టకూడదా వంటివి. అంతా మీ యిష్టం. ఏదైనా ఒక పద్దతిగా తోచినట్లుగా వ్రాయవచ్చును. అంతే.

కొసమెరుపు.  సంస్కృతంలోని అనుష్టుప్పు ఛందస్సు తెలుగు అష్టాక్షరిలో అంతర్భాగమే. మనం అనుష్టుప్పుకు ఉన్న అదనపు నియమాలు తొలగంచామన్నమాట.

చిన ఉదాహరణ ఐనా వ్రాయకుండా ఈ అష్టాక్షరిని పరిచయం చేయటం బాగుండదు కదా.

శ్రీగణనాయక నీకు చేతులెత్తి మొక్కేనయ్యా
నా కండదండవు నువ్వే నన్ను దయ చూడవయ్యా
ఓ అమ్మల కన్న అమ్మా అమ్మ వంటే నువ్వే నమ్మా
అమ్మా దుర్గమ్మ తల్లీ అరసి రక్షించ వమ్మా

ఓం ప్రథమం  అష్టాక్షరులు ఇష్టదేవతా స్తుతితో ఉండాలని అలాగు సంకల్పం  చేసి వ్రాసినవి.

చదువరులు కూడా ఈ అష్టాక్షరులు వ్రాయటానికి ప్రయత్నించ వలసిందిగా నా చిన్న సూచన.