17, జనవరి 2014, శుక్రవారం

ఇంత కంటే ఏమి చెప్పగలను?



తప్పులొప్పు లెన్నగా దలచెడు వారు
తప్పక ధర్మంబు తలపోయ వలయు
ఒప్పుగా ధర్మంబు నూహించ లేక
తప్పులు పలికిన దైవంబు ద్రుంచు
ఒకవేళ తనవార లొనరించి రేని
యొక తప్పు తప్పుగా కుండగా పోదు
పరపక్షమున నొప్పు వరలెడు నెడల
కర మడ్డు పెట్టినా కడకది గెల్చు
ఇటువారు చేసిన వెల్ల నొప్పులుగ
నటువారు చేసిన వన్ని తప్పులుగ
ఆవేశపడి తీర్పు లందించు వారు
భావింప దుర్మోహవశు లైన వారు
సత్యంబు శాంతంబు సమభావ మొప్ప
నిత్యంబు పలికెడు నిర్మల బుధ్ధి
కాలస్వభావంబు మేలుగా తెలిసి
పాలుమాలక పల్కు పరిణత బుధ్ధి
జాతిస్వభావంబు చక్కగా తెలిసి
నీతివిడువక పల్కు నిశ్చలబుధ్ధి
తత్త్వవిచారంపు దారుల నెఱిగి
సత్త్వంబు విడువని చక్కని బుధ్ధి
స్వపరబేధము లేని వంచన లేని
చపలత్వ మెఱుగని సంయమబుధ్ధి
జడతయు లౌల్యంబు జాడయే లేని
పెడదారి పట్టని వడిగలబుధ్ధి
నిరయ మయ్యెడుగాక నిలకడ గలిగి
పరమసత్యము బల్కు పావనబుధ్ధి
ఏ సహృదయులకు నీశ్వరు డొసగె
నా సజ్జనులె కాక నటులిటు లనుచు
న్యాయమన్యాయంబు నమరించి పల్క
నీ యుర్విపై నున్న నితరుల వలన
ఒక్క నాటికిని గాకుండుట నిజము
విషయ మిట్లుండగా విపరీత బుధ్ది
మిషపెట్టి యొరులను మిక్కిలి తిట్టి
ఒకపక్షమున నుండి యోర్వమి చేత
ప్రకటంబుగా పెఱపక్షంబు వారి
చేతలన్నింటిలో చెడుగునే కనుచు
తమపక్షమే యొప్పు తప్పన్యమనుచు
శ్రమపడి నిత్యంబు చాల నిందలకు
దిగుటయే కాకుండ తీర్పుచెప్పుటకు
తెగబడు వారలు తెలియ లే రెపుడు
కాలంబు చేతనే కలుగు కష్టంబు
కాలంబు చేతనే కలుగు వైభవము
కాలంబు చేతనే కలుగును శాంతి
కాలంబు చేతనే కడముట్టు కాంతి
కాలంబు చేతనే కలుగు స్నేహములు
కాలంబు చేతనే కలుగు వైరములు
కాలంబు చేతనే ఘనతలు కలుగు
కాలంబు చేతనే ఘనతలు తొలగు
కాలంబు చేతనే కలుగు రాజ్యములు
కాలంబు చేతనే కరుగు రాజ్యములు
కాలంబు చేతనే కలుగు జీవనము
కాలంబు చేతనే కాలు జీవనము
కాలంబు చేతనే గర్వంబు కలుగు
కాలంబు చేతనే గర్వంబు తొలగు
కాలంబు మంచిది కాదు కొందరకు
కాలంబు చెడ్డది కాదు కొందరకు
కాలంబు సకలంబు కల్పించు చుండు
కాలంబు సకలంబు కబళించు చుండు
కాలంబు చుట్టంబు కా దెవ్వరికిని
కాలంబు దుష్టంబు కా దెవ్వరికిని
కాలంబు సమబుధ్ధి కలిగి వర్తించు
కాలంబు దైవంబు కావున దాని
పోకడ తెలియగా బోలదు మనకు
తేకువ గలిగి సందేహంబు విడచి
మమతాదికంబుల మత్తత తొలగి
భ్రమవీడి లోకముల్ వర్తించు తెఱగు
నిక్కంబుగా కాల నియమంబు చేత
నక్కజంబుగ కలుగు టది మది నెఱిగి
కుజనుల కోడుచో కుంద కుండగను
విజయంబు గల్గుచో విఱ్ఱవీగకను
హెచ్చగు కుందగు నేవేళ నేని
వచ్చిన దది కాల వర్తన మనుచు
తగురీతి వర్తించు ధర్మాత్ములకును
భగవంతుడిచ్చును పరమసౌఖ్యంబు
కావున నాయకకవివిమర్శకులు
నా వంక నీ వంక నగ్గించు నట్టి
మాటలు చాలించి మంచిని పెంచు
మేటి పల్కుల నుండ మెచ్చు నీశ్వరుడు



14, జనవరి 2014, మంగళవారం

గవర్నర్ పదవి ఎందుకు?

అసలు మన దేశ రాజకీయవ్యవస్థలో గవర్నర్ అనే పదవి ఎందుకు?

రాజ్యాంగ నిర్మాతలు ఈ గవర్నర్ పదవిని ఎందుకు సృష్టించారో కాని అది ఖచ్చితంగా ఒక రాజకీయపదవి ఐ కూర్చుంది.  ఆ పదవిలో ఉన్న వ్యక్తి చేసే ఏకైక కార్యక్రమం కేంద్రం తరపున వచ్చి కూర్చుని, వారు అడిగినప్పుడు, వారు కోరిన విధంగా నివేదికలు ఇవ్వటం లేదా వారి ఆదేశం ప్రకారం ఇతరవిధాలుగా వ్యవహరించటం మాత్రమే.

ఇతర విధాలుగా వ్యవహరించటం అంటే, కేంద్రం చూసీచూడనట్లు ఉండమంటే ఆ రాష్ట్రపరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నా అంతా సరిగ్గానే ఉన్నట్లు మాట్లాడటమూ, అలాగే రాష్ట్రపరిస్థితిలో ఏమీ కల్లోలాలు లేకపోయినా అదుపు తప్పుతున్న శాంతిభధ్రతలూ వగైరా అంటూ చెప్పటమూ అన్నమాట.

రాష్ట్రప్రభుత్వాలపై కేంద్రం‌ పెత్తనం చేయటానికి తప్ప గవర్నర్ పోష్టుకు వేరే బాధ్యతలు లేవని దివంగత ప్రధాని ఇందిర ప్రగాఢంగా నమ్మిన సిధ్ధాంతం.

గవర్నరర్లు కేంద్రం తరపున తాబేదార్లన్న పరిస్థితి కారణంగానే కేంధ్రంలో పెత్తనం చేసే పార్టీ మారగానే గవర్నర్లు రాజీనామాలు చేయటమూ, అలా చేయని వారిని కొత్త ప్రభుత్వాలు పదవినుండి తప్పించటమూ జరుగుతోంది.

గవర్నర్‌కు కళ్ళుముక్కూ చెవులూ కాళ్ళూ వగైరా అవయవాలు పనిచేయకపోయినా ఫరవాలేదని ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్ హోదాలో వచ్చిన  కే.సీ.అబ్రహాం వంటివారు ఉదాహరణ.

గవర్నర్ కేంద్రం ఆడించే బొమ్మ మాత్రమే అని ఋజువుచేసిన మరో గవర్నర్ రామ్‌లాల్.

ఇలాంటి దుస్థితిలో పడిన గవర్నర్ వ్యవస్థను ఎందుకు రద్దు చేయకూడదు?

ఈ రోజు టివీ స్క్రోలింగ్‌లో చూసాను ఒక వృధ్ధరాజకీయజంబుకానికి ముఖ్యమంత్రి పదవి అక్కర లేదట. గవర్నర్ పదవి కావాలట.

గవర్నర్ పదవి వృత్తిరాజకీయనాయకులకు పునరావాసం కల్పించటానికా రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశించినది?

ఒక రాజ్యాంగరక్షకుడి హోదాలో ఉండిన వ్యక్తి కీలుబొమ్మగా ఆడటం బాగోలేదని ప్రజలు విసుక్కుంటున్నా దొరతనాలు నిస్సిగ్గుగా అదొక పార్టీపదవిలాగ భావించుకుంటున్నాయి.  కొందరు గవర్నర్‌గిరీ వెలగబెట్టాక కూడా ముఖ్యమంత్రి పదవికి మళ్ళారంటే అంతా వృత్తిరాజకీయనాయకుల మయమైపోయిందీ గవర్నర్ పదవి అనే కదా అర్థం?

కనీసం ఒక పని చేయాలి.  గవర్నర్ పదవికి కేంద్రం ఎంపిక వ్యక్తిని పార్లమెంటు మూడింట రెండువంతుల మెజారిటీతో అమోదించాలి.  అలా చేస్తే కనీసం అధికార పార్టీలు ఏకపక్షంగా అస్మదీయులతో గవర్నర్ పోష్టులను భర్తీచేసి కావలసినట్లు ఆడించుకోవటాన్ని నిరోధించేందుకు దారి ఏర్పడుతుంది.  అలాగే గవర్నర్ గిరీ వెలిగించిన వ్యక్తి మున్ముందు కార్యనిర్వాహక పదవులు చేపట్టకుండా చట్టం కూడా చేయాలి.  అంతే‌కాదు, గవర్నర్ పదవికిఎంపికయే వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా ఏ కార్యనిర్వాహక పదవిలోనూ ఉండి ఉండకూడదు మరియు గత ఐదు సంవత్సరాలుగా ఏ రాజకీయపార్టీలోనూ సభ్యుడు కూడా కాకూడదు.

ఏమంటారు?

9, జనవరి 2014, గురువారం

కనులు మూతబడు క్షణమున




 కనులు మూతబడు క్షణమున నిన్నే
 తనివారగ కనుగొనగలనా రామా


 నిరతము లాలస నిండిన చూపుల
 పరువులెత్తి నశ్వరముల వెనుక
 అరరే కన్నులు తెరచితి నిపుడే
 తరలిపోయెడు తరుణమాయెనే    
॥కనులు॥

 వెలుగులలో తొలి వెలుగువు నీవని
 తెలియక యెంతో మోసపోయితిని
 తెలిసితి నిపుడే తెరచితి కన్నులు
 మలగిపోవు క్షణమరుదెంచెనయా  
॥కనులు॥

 ప్రాణప్రదుడా భవబంధముల
 పోనడచెడు నీ పుణ్యరూపమును
 కానగ నగు భాగ్యమున కన్నను 
 ఈ నా కన్నుల కేమి వలయును  
॥కనులు॥






నీ గుడివాకిట నిలచితిని




నీ గుడివాకిట నిలచితి నింతలో
ఆగితి నిదె లో నడుగిడ దగుదునో


మానవుడను దుర్మానిని నేను
కానిపనులను కపటంబులను
మానగ లేని మతిహీనుడను
ఏనాటికి మన్నించి దిద్దుదువొ     
॥నీ గుడివాకిట॥

ధర్మము నెఱిగి యధర్మము నెఱిగి
ధర్మమార్గమును తలదాల్చనుగా
కర్మమెట్టిదో కట్టుబడితి నీ
ధర్మేతరమున దయజూపవయా  
॥నీ గుడివాకిట॥

అన్నియు తెలిసి న న్నేమనని నిను
కన్నుల జూడగ కడు సిగ్గాయెను
నిన్నే నమ్మితి నీవే దిక్కిక
ఎన్నడు యోగ్యత నిచ్చెదో రామ 
॥నీ గుడివాకిట॥




6, జనవరి 2014, సోమవారం

మాయమైన ఉదయకిరణం




గాయపడిన కిరణమా మాయమైతివా
సాయము కరువైనదని సాగిపోతివా

నీ యంతట నీవు వచ్చి నిలబడితే చూడలేక
న్యాయం విడనాడి అణచినారే మరి దారిలేక
నీ యుజ్వలభవిష్యత్తు నిలువునా కూలనీక
చే యందించేందు కొక్క స్నేహితుడే కనరాక  ॥గాయపడిన॥

పలుకుబడి గలవాళ్ళే పగబట్టి నీ బ్రతుకును
నలగబొడిచి నారని కలగిన నీ‌ మనసును
తెలుసుకొని పలుకరించి కలతతీర్చి ధైర్యమును
చిలుకరించి సేదతీర్చు స్నేహితుడే కనరాక  ॥గాయపడిన॥
  
పోరాడి యోడిన వీరుడా నీ వారే
లేరని తలచిన లేలేత సూర్యుడా
నీరసించి పడమటికి జారిపోతివా
అరని గురుతుగా మారిపోతివా  ॥ గాయపడిన॥


దివంగత సినీనటుడు ఉదయకిరణ్‌తో నాకేమీ పరిచయం లేదు.
మా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ లోనే వారి బందువు ఒకావిడ ఉండేవారు.
ఒక సారి మేము రాత్రి తిరిగి వచ్చేసరికి పార్కింగు స్థలంలో వేరే వారి కారు అడ్డుగా ఉంది.
ఫలాని అపార్ట్‌మెంట్ వారి గెష్ట్ తాలూకు అని సెక్యూరిటీ వారి చెబుతే కాబోలు వెళ్ళి రెక్వేష్ట్ చెస్తే ఒకబ్బాయి వచ్చి తన కారును అడ్డు తీసాడు.
ఆ అబ్బాయి చాలా సౌమ్యుడు.
అతను ఉదయ కిరణ్ అని తరవాత తెలిసింది.

అతడి సినిమాలు కొన్ని చూసాను.  బాగా చేసాడు.
అతడి కెరీర్ వివరాలు వగైరా టీవీలో వస్తుంటే విని బాధ కలిగింది.
అతడిని సినీ‌పరిశ్రమలోనే కొందరు పైకి రానివ్వలేదని చాలా కాలంగానే పుకార్లున్నాయి.

అతడు డిప్రెషన్‌లో ఉన్నాడని అతడి భార్యకు తెలిసీ, అతడిని ఒంటరిగా వదలి తాను బయటకు సోషల్ ఫంక్షన్‌కు వెళ్ళటం పొరపాటు అని నా అభిప్రాయం.  అటువంటి వాడిని ఒంటరిగా ఉండనివ్వటం ప్రమాదం అన్న సంగతి విస్మరించటం విషాదకరమైన ఫలితాన్నిచ్చింది కదా!

1, జనవరి 2014, బుధవారం

బ్లాగర్‌ టపాల్లో వీడియోలు ఆండ్రాయిడ్ బ్రౌజర్‌లో కనపడాలంటే ఉపాయం ఇదిగో.


అవునండీ.  నేను నిన్ననే మా తెలుగుతల్లికి మల్లెపూదండ అని ఒక టపా వేసాను కొన్ని వీడియోలతో.
తీరా చూస్తే అది నా శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్౩  లో సరిగా రాలేదు.  వీడియోలు ఖాళీ స్థలాలుగా వచ్చాయి.

ఈ రోజున అదే టాబ్‌లో శ్రీబెజ్జాల కృష్ణమోహన్‌గారి వ్యాసం మాణిక్యవీణాముపలాలయంతీం చూసాను. దానిలో‌వీడియోలున్నాయి. అవన్నీ చక్కగా వచ్చాయి.

ఏమీటీ కిటుకు అని కొంచెం శోధించగా బ్లాగరువాడు వీడియోనిఅనుసంధానం చేసే విధానానికీ, బెజ్జాలవారి వ్యాసంలో వీడియోలు నిక్షిప్తం ఐన విధానానికీ మధ్యన ఉన్న తేడాయే కారణంగా కనిపించింది.

ఉదాహరణకు నా టపాలో ఒక వీడియోను నిక్షిప్తం చేయటానికి బ్లాగరు వాడు వాడిన కోడ్ చూడండి:

<div class="separator" style="clear: both; text-align: center;">
<object class="BLOGGER-youtube-video" classid="clsid:D27CDB6E-AE6D-11cf-96B8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=6,0,40,0" data-thumbnail-src="http://img.youtube.com/vi/KLW0XmQLXT0/0.jpg" height="266" width="320"><param name="movie" value="http://youtube.googleapis.com/v/KLW0XmQLXT0&source=uds" /><param name="bgcolor" value="#FFFFFF" /><param name="allowFullScreen" value="true" /><embed width="320" height="266"  src="http://youtube.googleapis.com/v/KLW0XmQLXT0&source=uds" type="application/x-shockwave-flash" allowfullscreen="true"></embed></object></div>


కృష్ణమోహన్‌గారి వ్యాసంలో ఒక వీడియోని ప్రదర్శించటానికి వాడబడిన కోడ్

<p><iframe src="//www.youtube.com/embed/R58a5Ht4-Ok" height="315" width="420" allowfullscreen="" frameborder="0"></iframe></p>

ఈ పైన కోడ్ వాడితే నా ఈ టపాలో కూడా వీడియో చక్కగా ఇలా క్రింద చూపినట్లుగా వచ్చింది!




బ్లాగరువాడు అంత పెద్ద కోడ్ ఎందుకు వాడుతున్నాడో అర్థం కావటం లేదు.

ఎవరికైనా ఈ విషయంలో మరింత అవగాహన ఉంటే దయచేసి చెప్పవలసింది.