9, జనవరి 2014, గురువారం

నీ గుడివాకిట నిలచితిని
నీ గుడివాకిట నిలచితి నింతలో
ఆగితి నిదె లో నడుగిడ దగుదునో


మానవుడను దుర్మానిని నేను
కానిపనులను కపటంబులను
మానగ లేని మతిహీనుడను
ఏనాటికి మన్నించి దిద్దుదువొ     
॥నీ గుడివాకిట॥

ధర్మము నెఱిగి యధర్మము నెఱిగి
ధర్మమార్గమును తలదాల్చనుగా
కర్మమెట్టిదో కట్టుబడితి నీ
ధర్మేతరమున దయజూపవయా  
॥నీ గుడివాకిట॥

అన్నియు తెలిసి న న్నేమనని నిను
కన్నుల జూడగ కడు సిగ్గాయెను
నిన్నే నమ్మితి నీవే దిక్కిక
ఎన్నడు యోగ్యత నిచ్చెదో రామ 
॥నీ గుడివాకిట॥
1 కామెంట్‌:

  1. బాగుందండి. మీ పద్యాలు చదివినప్పుడల్లా కంచెర్ల గోపన్న గురుకొస్తున్నాడు. ఆయనకున్న చనువు (ఎవడబ్బ సొమ్ము అని...) రాముడి దగ్గిర మీకు లేదులా ఉంది. :-)

    ఈ మధ్యన ఏమీ రాయడం లేదులా ఉంది. పూతన ఖంఢ కావ్యం ఎప్పుడు పూర్తి చేస్తున్నారు? అంతా కులాసాయేనా?

    రిప్లయితొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.