17, జనవరి 2014, శుక్రవారం

ఇంత కంటే ఏమి చెప్పగలను?



తప్పులొప్పు లెన్నగా దలచెడు వారు
తప్పక ధర్మంబు తలపోయ వలయు
ఒప్పుగా ధర్మంబు నూహించ లేక
తప్పులు పలికిన దైవంబు ద్రుంచు
ఒకవేళ తనవార లొనరించి రేని
యొక తప్పు తప్పుగా కుండగా పోదు
పరపక్షమున నొప్పు వరలెడు నెడల
కర మడ్డు పెట్టినా కడకది గెల్చు
ఇటువారు చేసిన వెల్ల నొప్పులుగ
నటువారు చేసిన వన్ని తప్పులుగ
ఆవేశపడి తీర్పు లందించు వారు
భావింప దుర్మోహవశు లైన వారు
సత్యంబు శాంతంబు సమభావ మొప్ప
నిత్యంబు పలికెడు నిర్మల బుధ్ధి
కాలస్వభావంబు మేలుగా తెలిసి
పాలుమాలక పల్కు పరిణత బుధ్ధి
జాతిస్వభావంబు చక్కగా తెలిసి
నీతివిడువక పల్కు నిశ్చలబుధ్ధి
తత్త్వవిచారంపు దారుల నెఱిగి
సత్త్వంబు విడువని చక్కని బుధ్ధి
స్వపరబేధము లేని వంచన లేని
చపలత్వ మెఱుగని సంయమబుధ్ధి
జడతయు లౌల్యంబు జాడయే లేని
పెడదారి పట్టని వడిగలబుధ్ధి
నిరయ మయ్యెడుగాక నిలకడ గలిగి
పరమసత్యము బల్కు పావనబుధ్ధి
ఏ సహృదయులకు నీశ్వరు డొసగె
నా సజ్జనులె కాక నటులిటు లనుచు
న్యాయమన్యాయంబు నమరించి పల్క
నీ యుర్విపై నున్న నితరుల వలన
ఒక్క నాటికిని గాకుండుట నిజము
విషయ మిట్లుండగా విపరీత బుధ్ది
మిషపెట్టి యొరులను మిక్కిలి తిట్టి
ఒకపక్షమున నుండి యోర్వమి చేత
ప్రకటంబుగా పెఱపక్షంబు వారి
చేతలన్నింటిలో చెడుగునే కనుచు
తమపక్షమే యొప్పు తప్పన్యమనుచు
శ్రమపడి నిత్యంబు చాల నిందలకు
దిగుటయే కాకుండ తీర్పుచెప్పుటకు
తెగబడు వారలు తెలియ లే రెపుడు
కాలంబు చేతనే కలుగు కష్టంబు
కాలంబు చేతనే కలుగు వైభవము
కాలంబు చేతనే కలుగును శాంతి
కాలంబు చేతనే కడముట్టు కాంతి
కాలంబు చేతనే కలుగు స్నేహములు
కాలంబు చేతనే కలుగు వైరములు
కాలంబు చేతనే ఘనతలు కలుగు
కాలంబు చేతనే ఘనతలు తొలగు
కాలంబు చేతనే కలుగు రాజ్యములు
కాలంబు చేతనే కరుగు రాజ్యములు
కాలంబు చేతనే కలుగు జీవనము
కాలంబు చేతనే కాలు జీవనము
కాలంబు చేతనే గర్వంబు కలుగు
కాలంబు చేతనే గర్వంబు తొలగు
కాలంబు మంచిది కాదు కొందరకు
కాలంబు చెడ్డది కాదు కొందరకు
కాలంబు సకలంబు కల్పించు చుండు
కాలంబు సకలంబు కబళించు చుండు
కాలంబు చుట్టంబు కా దెవ్వరికిని
కాలంబు దుష్టంబు కా దెవ్వరికిని
కాలంబు సమబుధ్ధి కలిగి వర్తించు
కాలంబు దైవంబు కావున దాని
పోకడ తెలియగా బోలదు మనకు
తేకువ గలిగి సందేహంబు విడచి
మమతాదికంబుల మత్తత తొలగి
భ్రమవీడి లోకముల్ వర్తించు తెఱగు
నిక్కంబుగా కాల నియమంబు చేత
నక్కజంబుగ కలుగు టది మది నెఱిగి
కుజనుల కోడుచో కుంద కుండగను
విజయంబు గల్గుచో విఱ్ఱవీగకను
హెచ్చగు కుందగు నేవేళ నేని
వచ్చిన దది కాల వర్తన మనుచు
తగురీతి వర్తించు ధర్మాత్ములకును
భగవంతుడిచ్చును పరమసౌఖ్యంబు
కావున నాయకకవివిమర్శకులు
నా వంక నీ వంక నగ్గించు నట్టి
మాటలు చాలించి మంచిని పెంచు
మేటి పల్కుల నుండ మెచ్చు నీశ్వరుడు



2 కామెంట్‌లు:

  1. భళా! లెస్సపలికితిరి కదా!!

    రిప్లయితొలగించండి
  2. నిజం నిద్ర లేవక ముందే అబద్దం ఊరు చుట్టి వస్తుంది. అబద్దం అరుస్తుంది - నిజం నిశ్శబ్ధంగా గెలుస్తుంది.

    కొన్ని సమస్యలను కాలం పరిష్కరిస్తుంది. కనుక వేచియుండడమది మంచిది కొన్ని విషయములయందు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.