18, సెప్టెంబర్ 2014, గురువారం

ఒక ఊరి కథ - 3

నాయకుని కుమారుడు కొంత తీవ్రమైన స్వభావములు కలవాడని యూరిలో నందరకును తెలియును. ఊరిలో వృధ్ధులైన వారు కొందరు నాయకుని గూర్చి యాతడొక యువకుడుగ నున్నప్పటి సంగతులును తెలిసినవారుగా నున్నారు.  వారి నోట మాత్రము తండ్రి దుడుకుదన మంతయు కొడుకునకు వచ్చిన దను మాట వినిపించుచు నుండును. కాని తండ్రిబిడ్డల మధ్యనొక తారతమ్యమును గూడ వారు ప్రస్తావించుట జరుగుచున్నది.  తండ్రి స్వభావములో పట్టుదలలకు పోవుట యనునది లేదు కాని యాతని పెద్దకుమారుడు మాత్రము పట్టుదలలకు దిగు స్వభావము కలవాడు.  ముఖ్యముగ నీ‌ నాయకుని కుమారుడా యూరికి సర్పంచి యగుట నుండి యిట్టి పోలికల ప్రస్తావనములు కనిపించుచునే యున్నవి.  పట్టుబట్టినచో నెంతకైను తెగించు నట్టి వాడీ యువకుడని యూరిపెద్దల యభిప్రాయమే కాక చాల మంది ప్రత్యక్షముగ తిలకించిన సంగతి.  ఇప్పుడీ గ్రామనామమును మార్చుటకై పూనుకొని నప్పు డది యీతని యూహ కావున జరిగితీరునని పెద్ద లనుకొనిరి. వారిలో హెచ్చుమంది కట్టిది యేమాత్రమును రుచించని పని యైనను తాము చేయగలిగినది లేదని యూరకొనిరి. కాని నే డా యువకుడే జరిగిన నామాంతరమును గూర్చి మండిపడుటను జూచి యూరి వారందరును గొప్ప యుపద్రవమే కలిగినదిగా భావించిరి. కాని చిత్రమైన విషయ మేమనగా కొత్తప్రార్థనామందిరము పైన చేరినదైన తమ యూరి పేరి మార్పును గూర్చి సన్నిహితుల వద్ద నగ్నిహోత్రుని వలె మండిపడిన వాడు క్రియలో మాత్ర మేమియును చేయక నూరకొనెను.

ఇంతలో నొకనా డూరి లోనికి కొందరు పెద్దమనుష్యులు వచ్చిరి.  వారు సరాసరిగ నీ క్రొత్త ప్రార్థనామందిరమునకు పోయిరి.  పోయిన వారు లోనికి మాత్రము పోలేదు.  బయటనే నిలువబడి చర్చలు చేసుకొనిరి.  కొత్త నామఫలకమును మాత్ర మందరును చూపులతో పరామర్శనము చేసిరి.  కొంత సేపటికి ప్రార్థనామందిరము లోని కొకడెవడో పోయి కబురు చెప్పినాడు . కొంతసేపటికి కబురు తెచ్చిన వానితో కలసి యచ్చట ప్రార్థనాధికములు జరిపించు నాతడు వెలికి వచ్చెను.  కబురు మోసిన వాడొక సైకిలుపై వెడలిపోయెను. అందరును మరికొంత సేపు మంతనము లాడు కొనిరి.  తుది నందరును కలిసి దివంగత నాయకుని యింటికి పోయిరి.

వా రచ్చటకు చేరుకొని తామ రాక నెఱిగించుకొనగా దాదా పైదు నిముషముల పిమ్మట నొకడు కొన్ని ప్లాష్టిక్ కుర్చీలను తెచ్చి యరుగుపై వేసి వారిని కూర్చుండ నియమించెను.  వా రొకరి మొగము లొకరు చూచుకొని నిశ్సబ్దముగా పోయి వాటిలో‌నాసీను లైరి.

మరియొక పది నిముసములు గడచినవి.  పావుగంట గడచినది. వచ్చి వీరిని పలుకరించిన వారు లేరు. ఆ వచ్చిన వారిలో నొకాయన యరువదికి పైబడిన వయస్సులోని వాడు. అయనకు దాహబాధ మిక్కుటము గా జొచ్చెను.  మిగిలిన వారికిని దాహముగనే యున్నది గాని ఏమి చేయుటకును తోచక నూరకొనిరి.  మరియొక పది నిముషముల పిమ్మట నొక బాలుడు బంతితో బయటకు రాగా వానితో దాహము దాహమని చెప్పుకొనిరి. వాడు లోనికి పోయి చెప్పగా మరియొక రెండు మూడు నిముషముల పిమ్మట నొక పనిపిల్ల సాధారణమైన గాజుగ్లాసులలో మంచితీర్థమును గొని తెచ్చి యిచ్చినది. ఆమె గ్లాసుల నచ్చట నుంచి లోనికి పోవుచుండగా నా వృధ్ధవ్యక్తి తన పేరును పరిచయమును చెప్పికొని తామందరమును సర్పంచిగారి కొఱకు వచ్చితి మని చెప్పికొనినాడు.

అందరును పూజామందిరములో నున్నారని చెప్పి ఆమె లోనికి పోయినది.

మరల నొక పది నిముషములు గడచిన పిమ్మట వెనుకటి పనిపిల్ల  మంచినీళ్ళ గ్లాసులను తీసుకొని పోవుటకునై వచ్చినది.  పరిస్థితి యేమని వాకబు చేయగా సర్పంచిగారికి చెప్పి వచ్చెదనని లోనికి పోయినది.  దీనిని బట్టి వీరి రాకను సర్పంచిగారికి చెప్పినవారే లేరని యర్థమై వారందరు నుసూరు మనినారు.  కొద్ది సేపటికే పనిపిల్ల వర్తమానము మోసుకొని వచ్చినది.  సర్పంచిగారు పంచాయతీ కార్యాలయమునకు పోవుచున్నా ననియు, కార్యార్థులు తనను కార్యాలయములో కలుసుకొనవలె ననియును చెప్పినారట,  వృధ్దు డనుమానముగా నా పేరు చెప్పినావా యనగా చెప్పితినని యామె ప్రత్యుత్తరమిచ్చినది. పనిబడి వచ్చిన వా రెవరైనను తనను కార్యాలయములోనే కలుసుకొనవలెనని చెప్పినారని తెలుపగా వచ్చిన వారందరును విస్తుపోయిరి. ఇట్టి మర్యాద జరుగుట కిదే ప్రథమము.  చేయునది లేక నందరును పంచాయతీ కార్యాలయము నకు బోయిరి.

వా రచ్చటికి చేరుసరికే కొందరు పంచాయతీసభ్యులు కార్యాలయములో నుండిరి. అంతలో సర్పంచి గారు వచ్చి సరాసరి లోనికి పోయెను. బల్లలపై కూర్చున్న పెద్దమనుష్యులను పలుకరించలేదు. నిజమునకు వారివంకనే చూడలేదు  వారి కది చాల యవమానముగా నుండెను.

లోపలి నుండి పిలుపు వచ్చునని వారు ప్రతీక్షించిరి కాని లోపల నొక సమావేశము ప్రారంభమైనది. ఈ విషయమును వారికి పంచాయతీ నౌక రొకడి మాటల వలన తెలిసినది. ఆ సమావేశము రమారమి యొక గంట సేపు నడచినది. బయటికి మాట లేమియును వినబడలేదు.

అప్పటికి పంచాయతీ నౌకరు బయటకు వచ్చి అయ్యగారు లోనికి రమ్మనినారని చెప్పగా నందరును లేచిరి. కాని యాతడు వెంటనే మీ యందరిలో నెవరో యొక్కరినే రమ్మని చెప్పినారనగా వారికి మిక్కిలి నిరాశ కలిగినది.  నిరాశను మించి యాగ్రహము కలిగినది.  కాని చేయునదేమి గలదు? కార్యార్థులైన వారల కాగ్రహము తగదు కదా. అందుచేత వారిలో వారొక నిముషము సంప్రదించుకొనిన పిమ్మట వారియందలి వృధ్ధవ్యక్తి తుదకు లోనికి పోయెను.

పంచాయతీ కార్యాలయములో సర్పంచిగారి గది కొంత విశాలముగనే యున్నది.  అచ్చట సర్పంచి గారు ఠీవిగా కూర్చొని యుండి కాగితములు తిరుగవేయుచుండెను.  ఈ వృధ్ధవ్యక్తి లోనికి పోగా సర్పంచిగా నున్న దివంగత నాయకుని పెద్ద కుమారుడు కనీసము ప్రత్యుథ్థానమైనను చేయలేదు.  ఊరకే కూర్చుండమని చేయాడించి యెదుట  నుండిన కుర్చీని చూపించెను. దర్శనార్థము వచ్చిన పెద్దమనిషి కది యవమానకరముగ తోచెను. కాని ఏమి చేయును?

ఆ వచ్చిన వృధ్ధుడు కూరుచుండిన పిదప మరల సర్పంచి యూరకనే యొక కాగితము లోనికి తన దృష్టిని సారించి యించుక సేపు కాలయాపనము చేసిన పిదప గాని యెదుట నున్న వ్యక్తిని పలుకరించనే లెదు.  ఆతడు యెదుట నున్న వ్యక్తి తనకు పరిచయస్తుడే కావున యెవరు మీరని యడుగ లేదు కాని యేమి పని మీద వచ్చినారని యెవరో యపరిచితుని యడుగుచున్నధోరణిలోనే యేదో యథాలాపముగ బ్రశ్నించినాడు.

వచ్చిన వ్యక్తియు నిప్పటికే  తగినంతగ నవమానించబడి నానని యెఱింగిన వాడు. ఏమియు పలుకక తన చేతి సంచిలోనుండి యొక చిన్న దస్త్రమును వెలికి దీసి దానిలో నుండి యొక దళసరికాగితమును భద్రముగా సర్పంచి చేతి కందించినాడు.  ఆ కాగితమొక  యాహ్వానపత్రమని తెలియుచునే యున్నను సర్పంచి దానిని చూచుచు  నించుకయు నుత్కంఠను ప్రదర్శించకయే తెఱచి కొంచెము పైపైన పరిశీలనము చేసి ప్రక్కకు బెట్టినాడు.

ఈ ధోరణి నంతయు చూసి వచ్చిన మానవున కేమి మాట్లడవలెనో తోచినది కాదు.

ఒక్క నిముషము సేపు నిశ్శబ్దము తాండవించినది.

చివరకు సర్పంచిగారే నిదానముగ మీరు చేయు కార్యక్రమమునకు పంచాయతీ వారి యనుమతి గైకొన్నారా యని ప్రశ్నించినాడు.

ఇది దైవకార్యక్రమము.  దీనికి పంచాయతీ వారి యనుమతము కావలెనా యని వచ్చి కూర్చున్న వ్యక్తి విస్తుబోవుచు ప్రశ్నించెను.

సర్పంచి ఖరాఖండిగా నిట్లనెను. ఎవరికి వారు సభలును సమావేశములు నిష్టారాజ్యముగ చేసికొందురా? దైవకార్యక్రమమైనను మీ యింట పెండ్లియైనను మీరు పంచాయతివారి యనుమతి లేకుండ బహిరంగకార్యక్రమములును బాకాలు నూరేగింపులును  మొదలైనవి చేయరాదు.  మీరీ యాహ్వానపతము వేసినంత మాత్రము చేత నేమగును? నిజము చెప్పవలెనన్న నిది మీరు మా యనుమతి దొరకిన పిమ్మట చేయవలసినది. మీ కార్యక్రమము వివరములతో పంచాయతీ కార్యాలయముతో ననుమతి కొరకై దరఖాస్తు చేసుకొనుడు. ఈ ఆహ్వానపత్రము దరఖాస్తుగా గ్రహించబడదు. ప్రక్కగదిలో పంచాయతీకార్యదర్శిగా రుందురు.  వారు మీరు దరఖాస్తు చేయుటకు సహాయపడగలరు. ఈ మాటలు చెప్పి ఆయన తన బల్లపై నున్న గంటను మ్రోగించగనే పంచాయతీ నౌకరు లోనికి వచ్చెను.  సర్పంచి వానితో వీరిని కార్యదర్శిగారి వద్దకు తోడ్కొని పొమ్మని చెప్పెను.

అతడేదో చెప్పబోవుటను గమనించి సర్పంచి వానితో సంగతి యేమనగా వాడును నయ్యా వీరితో మరి యారుగురు వచ్చి బయట వేచి యున్నారు కదా వారికి కాఫీలు పంపుదునా యని సందేహము వెలిబుచ్చినాడు.  సర్పంచి యట్లే యన్నట్లుగా తలయూచి మీ రొక్కరు వచ్చు పనికి గా నిందరను వెంట తెచ్చుకొనుట దేనికి యని ప్రశ్నించి తోడనే మఱల నదియును గాక యింత చిన్నపనికి మీఱేల స్వయముగా వచ్చితిరి, ఆ పెద్దమనుష్యులలో నెవరో యొకరు వచ్చిన సరిపోయెడిది కదా యని చెప్పెను.

ఎదుట నున్న పెద్దమనుష్యునకు కనులు తిరుగుచున్నట్లుగా ననిపించినది. ఏమియు మాట్లాడక నొక చిరునవ్వు వంటిది నవ్వి నౌకరు వెంట బయటకు నడచినాడు.

బయట ప్రతీక్షించుచున్న వ్యక్తులకు కూడ నాకలి మండిపోవుచున్నది.  వారికిని కనులు తిరుగుట మొదలగు చున్నది. ఊరిలో నడుగు పెట్టినప్పటి నుండియు నొక్కరి గొంతున కైనను గాని హీనపక్షముగ నొక కప్పు కాఫీ కూడ తగులలే దాయెను.


(సశేషం)

4 వ్యాఖ్యలు:

 1. మాస్టారూ, మీరు ఇంతకాలం చాలా సీరియస్ రచనలు మాత్రమే రాయడం చూశాను.విశ్వనాధ వారి శైలిలో సహజంగా వుండే హాస్యాన్ని కూడా పట్టుకుని బలే క్యామిడీలు కూడా రుచి చూపిస్తున్నారు,చాలా బాగుందండి!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హరిబాబుగారూ మీరీ కథను చదువుతున్నందుకు సంతోషమైనది.

   విశ్వనాథవారొక ధనమ్మమఱ్ఱి వంటివారు. నేననగా నొక తోటకూర కాడ వంటి వాడను. వారితో నాకెట్టి పోలిక నైన యూహించుకొనుట దుస్సాధ్యమనుట యొక చిన్నమాట.

   ఈ కథలో మీరు హాస్యమును జూచితిరి. సంతోషము. హాస్యమొక ప్రథానమైన రసము. అది కథాగమనము ననుసరించి ప్రాకృతికముగా నవతరించ వలసినదే కాని మనము పని గట్టుకొని సాధించరాదు. ఒక వేళ మనమట్లు చేసినచో నది తుది నపహాస్యమాత్రమే యగును కాని కార్యము లేదు. ఇక్కడ కొంత హాస్యస్ఫోరకమగు సంగతి యున్నదనగా నది కథ యందలి విశేషమే గాని నా ప్రయత్నము మాత్రము గాదు. ఒక కథ చెప్పుట యనగా నొక కాలఖండమునందు గలిగిన కొన్ని విషయముల సమాహారమును పఱచుటయే. కాలప్రవాహములో మానవజీవితములందు చిత్రచిత్రములైన సంఘటనములును వానివలన రకరకములైన మానవప్రవర్తనావికారములును దర్శనీయము లగుచుండగా హాస్యమును సందర్భోచితముగ నమరు చుండును. కానిండు మంచిదే.

   నేను విశ్వనాథవారి వలె చెప్పగలనని భావించుటకు గూడ సాహసించను. ఇచ్చట నొక కథ యున్నది. దానిని తిన్నగా చెప్పగలిగినచో ధన్యుడను. అది నాకు చాలును.

   తొలగించు
  2. అవును,హాస్యం వుపాంగ రసమే నని అర్ధ మయింది.కధా సూత్రంలో వున్న కొంత వేదనా కొంత కాఠిన్యమూ కూడా అర్ధ మవుతున్నది.కానివ్వండి మరి!!

   తొలగించు
  3. హరిబాబుగారూ, కథయొక్కస్వభావమును చక్కగనే పోల్చుకొంటిరి. ధన్యవాదములు.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.