29, జూన్ 2024, శనివారం

శ్రీరామనామ మిది

శ్రీరామనామ మిది చింతలన్ని తీర్చునది
ఆరాటము లణచునది ఆనందము నిచ్చునది

సత్యమగుచు నుండునది సర్వజనులు నెఱిగినది
నిత్యమగుచు నుండునది నిగమవినుత మంత్ర మిది
భృత్యుల పోషించు శ్రీవిష్ణుదేవుని నామ మిది
అత్యంతము మధురమై అమరు దివ్యనామ మిది

హరునినోట నుండునది అందమైన నామమిది
సురలు చాల పొగడునది పరమమంత్రరాజమిది
నరుల కెల్ల మోక్షమిచ్చు నాణ్యమైన మంత్రమిది
పరమదివ్యమంత్ర మిది నిరుపమాన మంత్రమిది

భోగపరాయణుల స్వల్పబుధ్ధి కెపుడు తోచనిది
రాగద్వేషముల నణచి రామభక్తి నిచ్చునది
యోగివరుల జిహ్వలపై నొప్పారుచు నుండునది
వేగముగా ఫలించునది విమలసులభ మంత్ర మిది