26, జూన్ 2024, బుధవారం

అసమాన మీనామము

అసమాన మీనామము బహు
పసందైన రామనామము

విశదముగా నిది మన విష్ణుదేవుని నామము
దిశలను వెలిగించే దివ్యనామము 
నిశాచరులకంటికి నిదురమాన్పు నామము
కుశలముమనకిచ్చే గొప్ప నామము

రామదాసుల కెల్ల ప్రాణమైన నామము
కామదాసుల కనువుగాని నామము
కామితార్ధము లిచ్చు ఘనమైన నామము
క్షేమదాయకు డైన స్వామినామము

వివరింప పురారికి ప్రీతిగొలుపు నామము
పవమానసుతు డెపుడు పలుకునామము
భవరోగమును బాపు పరమదివ్యనామము
అవనిజార్చితమంత్ర మైన నామము