22, జూన్ 2024, శనివారం

ఏమర మేమరము


ఏమర మేమరము మేము రామనామము
ప్రేమతోడ పలికెదమా రామనామము

శాపములను వదలించెడు స్వామినామము
పాపాటవుల దహించు స్వామినామము
తాపములను తొలగించెడు తండ్రినామము
మాపెదవులపై రహించు మంచినామము

సుమధురమై వెలుగొందెడు శుభదనామము
ఉమాపతికి హృదయమున నుండునామము
అమరవిరోధులను తరుము నట్టినామము
ముముక్షువుల నోటనుండు ముఖ్యనామము

వివరింపగ సాటిలేని నిష్ణునామము
పవమానసుతు డెప్పుడు పలుకునామము
శివుడిచ్చిన యందమైన చిన్నినామము
భవరోగము నణగించెడు భవ్యనామము