రాఘవ రాఘవ నిన్నే నమ్మితి రారా యికనైన
లాఘవముగ తప్పించుకొందునన రాదు సుమా రామా
వందలు వేలును లక్షలుగా సురవైరుల జంపియు నే
డెందుకురా యీకలిపురుషునిపై నింతటి కనికరము
ఎందరెందరో సద్భక్తులనే యీతడు హింసింప
తొందరపడకున్నా విది యొప్పదు ముందుకు రావయ్యా
కలిపురుషుని యనుచరులు రాముడే కల్ల యన్న నైన
తలపోయవుగా రామచంద్ర యీ కలిని సంహరింప
నిలుచుటెట్లురా నీభక్తుల కిక నిన్ను తిట్టుచోట
యిలపై నీసత్కీర్తిని మేమిక యెట్లు చాటగలము
సనాతనుండవు సర్వేశ్వరుడవు జగద్రక్షకుడవు
సనాతనంబగు ధర్మంబు నిక సంరక్షించవయా
జనకజారమణ సరగున కలిపై సమరము చాటవయా
నిను ప్రార్ధింతును నను మన్నింపుము నేడే రావయ్యా