శివుడవు నీవే చిత్రంబుగా కే
శవుడవు నీవే సత్యంబుగా
అంచితంబుగ నీవు హరివి వైకుంఠాన
మంచుకొండ మీదను మరి నీవు హరుడవు
ఒడలెల్ల నలుపన్న నొప్పుగా శ్రీహరివి
ఒడలెల్ల తెలుపనుచు నుడువ శ్రీహరుడవు
పాము పడకమీద ప్రభుడవై వెన్నుడవు
పాములహారాల స్వామివై శివుడవు
మదనజనకుడ వనగ మాధవుండవు నీవు
మదనాంతకుడ వగుచు మహదేవుడవు నీవు
సురారికి వరమిచ్చు శూలాయుధుడ వీవు
మరి వాని మ్రందించు వరచక్రహస్తుడవు
నరుడొసంగిన దండ ధరియించిన హరివి
నరున కాదండతో హరుడవై తోచితివి
రాముడై వెలసిన స్వామి వెన్నుడ వీవు
రామనామము చేయు స్వామి శివుడవు నీవు