బుధ్ధిమంతులకు రాముడు పురుషోత్తముడు
బుధ్ధిహీనులకు వాని పొడగిట్టదు
హరిభక్తులు బుధ్ధిమంతు లందు వలన వారికి
పురుషోత్తము డాతడు పూజనీయుడు
హరి యని రామచంద్రు నాత్మలో నెఱిగితే
పరమపదము కాక వేరు ఫలముండునా
హరివైరులు బుధ్ధిహీను లాత్మహానికర మైన
దురాగతంబులకు దిగి తుదిని చెడుదురు
హరి యని రామచంద్రు నాత్మలో నెఱుగరే
పరమపదము గూర్చి తలపు వారి కుండునా
నరుడు బుధ్ధిమంతుడో పరమ బుధ్ధిహీనుడో
మరి యాతని పురాకృతము మలచునట్టుల
పరమాత్మా రామచంద్ర పరమకృపామూర్తివి
కరుణను నాయెడదలో కాపురం బుండవే