19, ఆగస్టు 2025, మంగళవారం

వేడివేడిగా

వేడివేడిగా కాఫీ తాగే వాడి మూతే కాలేను
వాడివాడిగా వాదము చేసే వాడి నోరే నొచ్చేను

వాడు వీడని పెద్దల నాడే వాడి కెప్పుడో మూడేను
నేడు రేపని అర్ధుల తిప్పే వాడి సిరులకే మూడేను

వినయము నెరుగక తిరిగే వాడే వేయి చిక్కులను పొందేను
అనయము వినయము కలిగిన వాడే యందరి మన్నన పొందేను

నేడు రేపని తాత్సారించే వాడికె కార్యము తప్పేను
లేడు లేడని రాముని తిట్టే వాడికె సద్గతి తప్పేను

వేడుక మీరగ సిరులను కొలిచే వాడికి నరకము దొరికేను
వేడుక మీరగ రాముని కొలిచే వాడికె మోక్షము దొరికేను

1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.