30, ఆగస్టు 2025, శనివారం

ఇదిగో

పరమాత్ముడు హరి ప్రభవించెను
ధరపై నిదిగో దశరథసుతుడై

కరుణను ధర్మపు ఘనతను చాటగ
సురరిపునాథుని సొదబెట్టగ
వరమునిగణముల బాధలు తీర్చగ
నిరతము భక్తుల నేలగ నిదిగో

నిరుపమసుగణాకరుడై నిత్యము
శరణాగతులగు నరులకు భవ
తరణోపాయము తననామంబుగ
చిరకాలంబును చెలగగ నిదిగో

హరేరామ యని యన్నంతనె శ్రీ
హరేకృష్ణ యని యన్నంతనె
నరులకు మోక్షము తిరమని తెలుపగ
నరనాథుండై హరియే యిదిగో

రత్నము

రాజులు కోరని రత్నము మునిరాజులు కోరెడు రత్నము యోగి
రాజులు కోరెడు రత్నము బహుపూజనీయమగు రత్నము

మూడు లోకముల వెలుగులు నింపే ముచ్చట గొలిపే రత్నము అది
వేడుక మీరగ కొలిచిన ఘనవరవితరణ చేసే రత్నము 
వాడుకగా తమ తనువుల దాల్చినవారల బ్రోచే రత్నము అది
వాడిన బ్రతుకుల జీవము నింపే పరమపావనరత్నము

కామితార్ధమును కాదని కిచ్చే ఘనకీర్తి కలిగిన రత్నము అది
సామాన్యులకును సులభముగానే సాధ్యమైన శుభరత్నము 
ఆమోక్షమునే వాంఛిచినచో నది మన కిచ్చెడు రత్నము అది
నామరత్నముల నాణ్యమైన మన రామనామఘనరత్నము

తిట్టకు తిట్టకు

తిట్టకు తిట్టకు రామచంద్రుని పుట్టకు హీనయోనులను

తిట్టకు తిట్టకు హరిభక్తులను నెట్టకు నరకద్వారమును


కట్టకు కట్టకు గాలిమేడలు కావు తనువులు శాశ్వతము 

పెట్టకు పెట్టకు మనర్హునకిక ముట్టదు నీకే ఫలితము

కొట్టకు కొట్టకు మూగజీవులను చుట్టుకొనునురా పాపము 

నెట్టకు నెట్టకు బలహీనులను కట్టికుడుపు నా పాపము


పట్టకు పట్టకు దుష్టదానమును చుట్టుకొనును దారిద్ర్యము

ముట్టకు ముట్టకు పరద్రవ్యంబును పట్టుకొనును ఘనదుఃఖము

తిట్టకు తిట్టకు నిగమంబులను పట్టుకొనును నిను రోగము

పట్టకు పట్టకు నరుల కాళ్ళను పట్టుకొనుము హరిపాదములు



29, ఆగస్టు 2025, శుక్రవారం

చెల్లనీ నీమాటే

చెల్లనీ నీమాటే శ్రీరామచంద్ర
చల్లని నీమాటే సాకేతరామ

ఎల్లలోకములను ఎదురే లేక 
ఎల్లకాలములను ఈశ్వర నీమాట
ఎల్ల జీవుల యెడ యేక రీతిగ
ఎల్ల విధములుగను యెంతెంతో చక్కగ

వాగీశుడు నలువ బాగుగా మెచ్చ
యోగిరాజగు శివు డొప్పనుచును పొగడ
సాగిదిక్పాలురు జరుప నీయాన
భోగిరాజశయన పురుషోత్తమ యిక

28, ఆగస్టు 2025, గురువారం

నిన్నే నమ్మితి

హరి నేను నిన్నే నమ్మితి శ్రీ
హరి నేను నిన్నే నమ్మితి 

పరమాత్మ శ్రీరామ పావననామ 
సరిలేని శరముల సాకేతరామ
శరణాగతత్రాణ వరవ్రత రామ
ధరణిజావరరామ దశరథరామ
నిరుపమగుణధామ వరమునికామ
కరుణానిలయ రామ కమనీయనామ
సురవైరిగణభీమ సురుచిరనామ
హరదేవనుతనామ నరనాథ రామ
స్థిర కీర్తి గల రామ చిన్మయ రామ
నరుడను నీవాడ నాతండ్రి రామ
తరచైన కష్టాలు తప్పించి రామ
కరుణను నన్నేలు కాదనక రామ

23, ఆగస్టు 2025, శనివారం

నామము చేయగదే


నోరా నామము చేయగదే తని
    వారా నామము చేయగదే


శ్రీరామ శ్రీరామ శ్రీరామా యని
    తారకనామము చేయగదే

ఊరక వ్యర్ధాలాపము లాడక 
    నోరా నామము చేయగదే


వారితో వీరితో వాదములకు దిగి 
    బడబడ వాగుచు నుండుటకు

మారుగ వారిజ నేత్రుని నామము 
    మరిమరి పలుకుచు నుండగదే


నారాయణుని పొగడక నీవు 
    నరులకు పొగడుచు నుండెదవే

ధారాళముగ రాముని పొగడుచు
    తారకనామము చేయగదే


దారినపోయే వారిని పిలచుచు
    దంభములాడుచు నుండెదవే

దారినిచూపే శ్రీరాముని భవ
    తారకనామము చేయదే


21, ఆగస్టు 2025, గురువారం

చిలుకా

మాట వినవే మంచి చిలుకా ఆ
రాటమెందుకె రామచిలుకా

సూటిగా శ్రీరామ యపవే ఓ

నోటిగూటి మేటి చిలుకా బహు

ధాటిగా శ్రీరామ యనవే ఆ

మాటనే జగమెల్ల మెచ్చేనే


మాటిమాటికి రామ యనవే ఓ

నోటిగూటి మేటి చిలుకా వెర

పేటికే శ్రీరామ యనవే ఆ

మాటనే జగమెల్ల మెచ్చేనే 


పాటగట్టవె రామ నామమున ఓ

నోటి గూటి మేటి చిలుకా ఆ

వేటగాడిని తరిమి కొట్టవే నీ

పాటనే జగమెల్ల మెచ్చేనే 



సుదినము

రాముని నామము పలుకని దినము - రామ రామ యది దుర్దినము

రాముని పూజలు చేయని దినము -  రామ రామ యది దుర్దినము

రాముని కీర్తన చేయని దినము -  రామ రామ యది దుర్దినము

రాముని చరితము తడుమని దినము -  రామ రామ యది దుర్దినము

రాముని తలపక గడిపిన దినము - రామ రామ యది దుర్దినము

రాముని సన్నిధి నుండని దినము -  రామ రామ యది దుర్దినము
 
రాముని బంటుగ నుండని దినము -  రామ రామ యది దుర్దినము

రామున కన్యుని పొగిడిన దినము -  రామ రామ యది దుర్దినము

రామవిరోధుల కలిసిన దినము -  రామ రామ యది దుర్దినము

రామాంకితముగ గడచిన దినము - రాముని దయచే సుదిన మదే

19, ఆగస్టు 2025, మంగళవారం

రామనామ మున్న దండి

రామనామ మున్న దండి రక్తి ముక్తి దాయకమై
రామనామ మున్న దండి రమ్యాతిరమ్యమై

రామనామ మున్న దండి రాజులకును పేదలకును
రామనామ మున్న దండి కామితార్ధ దాయకమై
రామనామ మున్న దండి పామరులకు పండితులకు
రామనామ మున్న దండి క్షేమయోగ దాయకమై

రామనామ మున్న దండి రమణులకును పురుషులకు
రామనామ మున్న దండి ప్రేమామృతవారిదమై
రామనామ మున్నది బాలలకు వృధ్ధజనులకుకు
ప్రేమతోడ పాలించెడు పెద్దదిక్కుగా నగుచును

రామనామ మున్న దండి సామాన్యులు మాన్యులకును
భూమినున్న జనావళికి పొలుపుగ భవతారకమై
రామనామ మున్న దండి తామసులకు తాపసులకు
కామందుల జేయుటకై కడిది మోక్షభూములకే

ఈశ్వరాజ్ఞచే


ఈశ్వరాజ్ఞచే గాక యేమి జరుగును పర

మేశ్వరాజ్ఞ చేతనే యిహము పరమును


ఎవ్వరు నీవారో యీశ్వరాజ్ఞచే ఎవ

రెవ్వరు పైవారో యీశ్వరాజ్ఞచే


ఎవ్వరు నిను మెచ్చేరో యీశ్వరాజ్ఞచే ఎవ

రెవ్వరు నిందించేరో యీశ్వరాజ్ఞచే


ఎవ్వరు తోడయ్యేరో యీశ్వరాజ్ఞచే ఎవ

రెవ్వరు వేరయ్యేరో యీశ్వరాజ్ఞచే


ఎవ్వరు హరి నెరిగించెద రీశ్వరాజ్ఞచే ఎవ

రెవ్వరు హరి నెరుగుదురో యీశ్వరాజ్ఞచే


ఎవ్వరు శ్రీరామభక్తు లీశ్వరాజ్ఞచే ఎవ

రెవ్వరు సంసారముక్తు లీశ్వరాజ్ఞచే


అందగాడా

అందగాడా రాముడా ఆనందరూపుడ రాముడా మే
మందరము నిను శరణుజొచ్చితి మందరిని కరుణించరా

అందమైన తనువులే యందించరా మారాముడా మా
కందమైన బుధ్ధులే యందించరా శ్రీరాముడా
అందమైన విద్యలే యందించరా మారాముడా మా
కందమైన జీవికల నందించరా శ్రీరాముడా

అందమైన భోగభాగ్యము లందజేయర రాముడా మా
కందమైన బంధుబలగము లందజేయర రాముడా
అందమైన మంచిజీవిత మందజేయర రాముడా మా
కందమైన కీర్తి సుఖముల నందజేయర రాముడా

అందమైన నీదు పాదము లంటి యుంటిమి రాముడా మే
మందరము నీపాదసేవల కమరి యుంటిమి రాముడా
వందనము శ్రీరాముడా మాయందు కరుణజూపి మా
కందరకును మోక్షమిచ్చి ఆదరించర రాముడా 


వేడివేడిగా

వేడివేడిగా కాఫీ తాగే వాడి మూతే కాలేను
వాడివాడిగా వాదము చేసే వాడి నోరే నొచ్చేను

వాడు వీడని పెద్దల నాడే వాడి కెప్పుడో మూడేను
నేడు రేపని అర్ధుల తిప్పే వాడి సిరులకే మూడేను

వినయము నెరుగక తిరిగే వాడే వేయి చిక్కులను పొందేను
అనయము వినయము కలిగిన వాడే యందరి మన్నన పొందేను

నేడు రేపని తాత్సారించే వాడికె కార్యము తప్పేను
లేడు లేడని రాముని తిట్టే వాడికె సద్గతి తప్పేను

వేడుక మీరగ సిరులను కొలిచే వాడికి నరకము దొరికేను
వేడుక మీరగ రాముని కొలిచే వాడికె మోక్షము దొరికేను