19, జూన్ 2017, సోమవారం

నేను -4

ఎందుల కిటు లైనాను
మందుడ నైతిని నేను

కలలా యిది యిలలోని కథయా
యిలయా మరి కలవంటి వ్యథయా
తెలియకుండుచో నిలచే దెట్లా
కలియక యే నిను తెలిసే దెట్లా

పొటమరించగా అహంకారమే
ఇటు వచ్చితినో‌ పొరబడి నేనే
యిటు వచ్చాకే పొరబడి నానో
ఇటునటు పరుగులు మానగ లేనో

తొల్లిటి తెలివిడి దూరం బగుటకు
కల్లప్రపంచమె తగు కారణమా
గుల్లగురుగులీ‌ కల్లయుపాధుల
పెల్లగించుకొను విధమే లేదా

18, జూన్ 2017, ఆదివారం

నేను - 3

దూరతీరా లేవో నన్ను చేర రమ్మని పిలిచేను
కోరిపిలిచే గొంతులన్నీ కొంటెవాడా నీవేను

ఏతీరమైనా యొకటేలే యీ యీతరాని జీవునకు
చేతోముదము నీకౌనుగా నే చేరుచో నొక తీరము
ఏతీరున భవవార్నిధిని తా నీదురా యీ జీవుడు
నాతోడువై నిర్వ్యాజకృపతో నన్నుచేర్చును తీరము

నేరక నిన్ను విడచితి నయ్యో నేనొక జీవుడ నైతిని
ఘోరమహాభవసాగరజలముల క్రుంగక నన్నీదించుము
తీరము జేర్చే భారమునీదే తిరముగ నిన్ను నమ్మితిని
నేరుపుమీరగ నను రక్షింపుము నిన్నిక విడువను విడువను

నన్ను నీవు పిలచుచుంటివి నాకై వగచుచు నుంటివి
నిన్ను నేను పిలచుచుంటిని నీకై వగచుచు నుంటిని
చన్న వెన్నో యుగము లిటులే సాగిరారా నాకొఱకై
వన్నె కాడా నా చేనంది తిన్నగా దరి చేర్చు రామ



15, జూన్ 2017, గురువారం

నేను - 2



రవివి కావు నీవు
కవిని కాను నేను

రవి జీవితము ఒక దినము
కవి జీవితము ఒక యుగము
రవివలె నీవు దినార్ధకాలపు రాజువు కానే కావు
కవివలె నేను కాలపుపోటుకు కదలని వాడను కాను

రవి వెలుగు పంచి కదలు
కవి పలుకు పంచి కదలు
రవితేజము నీ వధిగమించినను రవి వలె తపనుడవా
కవి నెట్లౌదును జ్ఞానపుంజముల కలిమి లేని నేను

రవి చూడ లోకబాంధవుడు
కవి  కూడ లోకబాంధవుడు
రవివలె అందరి వాడవు కాని నిరంజనుడవు నీవు 
కవివలె రవియును కాంచని యూహల కలిమి లేదు నాకు



14, జూన్ 2017, బుధవారం

నేను నీతో పందెంవేసి






నేను నీతో పందెంవేసి
    నిన్నో మొన్నో ఓడానా
ఐనా నీతో పందెం కాస్తే
    నేనే కాయా లన్నానా 

దాగుడుమూతల చెలికాడా నీ
    దైన తీరున దాగున్నా
నీ గుట్టుమట్లను కాలం దాచి
    నిశ్శబ్దంగా ఉంటున్నా
వేగం చాలని నా ఊహలు నిను
    వెదుకలేక విరమిస్తున్నా
అగక ఆశాజ్యోతిని చేగొని
    అహరహమూ యత్నిస్తున్నా

ఓడిన కొద్దీ నీతో‌ పందెం
    హుషారు కలిగిస్తున్నదిరా
ఆడిన కొద్దీ‌ నీతో‌ ఆటలు
    ఆనందాలను పంచునురా
వేడిన దొరకని వాడవు నిన్నే
    ఓడింతును బంధింతునురా
గూడు కట్టి నా గుండెలోపలే
    గుట్టుగ దాచుకొందునురా

మాయగాడివని పేరుబడ్డ నీ
    మాయ రహస్యం కనుగొన్నా
సాయం కోరను కాలాన్ని నే
    సాయం కోరను విశ్వాన్ని
ధ్యేయం సిధ్దించేందుకు మంచి ఉ
    పాయం నేను కనుగొన్నా
ఓయీ రామా ప్రేమపాశమున
    ఒడిసిపట్టనా విజయాన్ని