17, మే 2015, ఆదివారం

దేవుడవని మొన్ననే తెలిసికొంటినిదేవుడవని మొన్ననే తెలిసికొంటిని
కావుమని నిన్ననే వేడుకొంటిని
ఈవేళ వత్తువని వేచియుంటిని నీ
వేవేళకు వత్తువో తెలియకుంటిని

కబురు చేయుదమంటే కనబడరే నా కెవరూ
కబురు పంపుటకు నీకు కనబడలేదా ఎవరూ
గుబులాయె రామ ఈ జీర్ణకుటీరము నీకు
సబహుమానముగ తగిన స్వాగత మిచ్చేనా
॥దేవుడవని॥
గొప్పగొప్పవారు నిన్ను కొలువ వైకుంఠములో
తప్పనిసరి పనుల మధ్య తలమునక లైతివో
ఎప్పటికి వీలు చిక్కి యిటు వచ్చెదవో రామ
అప్పటికే జీర్ణకుటిని ఆరగించు కాలము
॥దేవుడవని॥
వేదాంతిని కాను నేను విద్యలేవి నేర్వలేదు
నీ దారితెన్నులను నేనెఱుగ నేనెఱుగ
ఓ దయామయ నమ్మి యున్నాను వత్తువని
వేదన లడలించవయ్య విచ్చేయ వయ్య రామ
॥దేవుడవని॥4 కామెంట్‌లు:

 1. చాలా బావున్నది..ఆర్తి గోచరమైనది..

  రిప్లయితొలగించండి
 2. శిలువను పూజించు క్రైస్తవులు విగ్రహారాధకులు కారా,అదేమి చిత్రము?
  అది రూపమే కదా!దానిని భూతములను వదలించెది మహత్తులున్నవే!

  మక్క నగరములోని కాబ ఘనమెట్లు కాదో చెప్పవోయి పిచ్చివాడ?
  ఘనము రూపము కాదనుట వితండ వాదము కాదటోయ్ వెర్రివాడ!

  మేము చేయునది గొప్ప వారు చేయునది తప్పు
  అని చెప్పుట మితిలేని మూఢత్వమునకె సాక్ష్యం!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరిబాబుగారూ, నామరూపాత్మకమైనదంతా ప్రకృతిలో భాగమే. భగవంతుడు ప్రకృతికి అధినేత కాని దానిలో భాగంకాదన్న దృష్టిలో ఆలోచిస్తే ఏ ప్రతీకకూడా భగవంతుని సమగ్రంగా సూచించలేదన్నది వాస్తవం. ఈశ్వరా౽౽స్సిద్ధేః అన్న సూత్రం ప్రకారం భగవత్తత్త్వాన్ని ఏ విధంగానూ నిష్పన్నమూ చేయలేము ఋజువులతో పట్టుకోనూ లేము. కాని ప్రతికల ప్రయోజనం ఒకటున్నది. సర్వశాస్త్రాలూ కూడా మనశ్శుధ్ధి కోసమే ఐన విధంగా ఆ స్థితికి వచ్చే ప్రయత్నంలో ఉండి అవస్థలు పడుతున్న జనానికి ప్రతీకలు ఊతంగా పనిచేస్తాయి. ప్రతీకలో భగవంతుని చూడటంలో దోషం లేదు. సమస్తమందూ ఉన్నది భగాత్తత్త్వమే కాదా. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు అన్న భాగవతోక్తి ప్రకారం ప్రతీక భగవత్తత్త్వానికే ప్రతీక అన్న మంచి స్పృహ ఉన్న సాధకుడు అర్చావందననైవేద్యాదులను భగవంతునికి సమర్పిస్తున్నట్లు భావనచేస్తూ ఉంటాడు కాని ఇది రాముడు కాదు రాముడి బొమ్మ కదా అన్న స్పృహతో ఉండడు (ఉంటే అది పూజయే కాదు!). అందుచేత ఎవరూ విగ్రహార్చన చేయటం లేదు భగవదర్చనే చేస్తున్నారు. అది గ్రహించలేని వారు అల్లరి చేస్తున్నారు.

   ఇతరమతస్థుల్లోనూ ధర్మనిష్ఠా భగవత్ప్రేమా కలవారు చేస్తున్నదీ అదే. వారి ప్రతీకలప్రయోజనమూ అదే. దైవానికి మానసికంగా చేరువగా ఉండేందుకు సహాయపడటమే.

   పామరులు దురర్థం చేసుకుంటున్నారని వారితో వాదించి ప్రయోజనం లేదు. చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అని ఊరకే అన్నారా? తగినపరిణతి జన్మాంతరంలో సిధ్ధించినప్పుడు వారు సరైన దారికే వస్తారు. అంతకంటే మరేమీ లేదు. వారిని కోప్పడటమూ అనవసరమే.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.