10, మే 2015, ఆదివారం

నిన్ను కాక వే రెవరిని సన్నుతింతురా రామ

తిన్ననైననడత లేని నన్ను కటాక్షించితి విక
నిన్ను కాక వే రెవరిని సన్నుతింతురా రామ

ధర్మమొక్క టున్నదని తలదాల్చుట యుచిత మని
నిర్మలాచరణుల కది నిత్యరక్ష సలుపు నని
దుర్మోహపు పరిణామము దుష్కర్మాచరణ మని
కర్మఫలానుభవము చాల కఠిన మనుచు నెరుగ నట్టి   ॥తిన్ననైన॥

పెద్దలాడు మాటలలో సుద్దులెరిగి వర్తించక
గద్దరినై పలువురతో కలహించుచు గడపి నట్టి
పద్దువేసి ఎత్తిచూపి పాశధరుని లేఖకుడు
గద్దించుచు పలుకుదినము కలదని తలపోయ నట్టి   ॥తిన్ననైన॥

నీ‌ పాదములకు పూజ నే నెన్నడు చేసితిని
నీ పావన నామమును నే నెంత జపించితిని
నీ పారమ్యము నమ్మని నీచులతో చేరితిని
నా పగిది వారి నైన నమ్మకముగ బ్రోతునని   ॥తిన్ననైన॥


1 కామెంట్‌:

  1. ఇహ్హీ .... రాముడెంతటి కఠినాత్ముడు! మా శ్యామలీయుని ఆత్మారాముని ఇంతగా క్షోభ పెట్టుచున్నాడేమి!?

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.